విధాత: నల్లగొండ జిల్లాకు చెందిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బ్రదర్స్ కోవర్టులు అని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక్కొక్కరు ఒక్క పార్టీలో ఉండి.. కోవర్ట్ ఆపరేషన్లు చేసేటోళ్లు అని కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్‌వీ విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ పాల్గొని, మునుగోడు ఉప ఎన్నికపై దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఫ్లోరోసిస్‌తో సతమతమవుతున్న మునుగోడు నియోజకవర్గ ప్రజలకు మిషన్ భగీరథ ద్వారా విముక్తి కల్పించామన్నారు. అలాంటి గొప్ప మిషన్ భగీరథ పథకాన్ని దేశమంతా అమలు చేయాలని నీతి ఆయోగ్ కేంద్రానికి సూచించిందన్నారు. అంతే కాకుండా ఆ పథకానికి రూ.19 వేల కోట్లు ఇవ్వాలని కూడా నీతి ఆయోగ్ సిఫారసు చేసిందన్నారు. కానీ మోదీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు.
మునుగోడు ప్రజల కోసం రూ. 19 వేల కోట్లు ఇవ్వమంటే ప్రధాని మోదీకి మనసు ఒప్పలేదు. కానీ కాంట్రాక్టర్ గోపాల్ రెడ్డికి మాత్రం రూ. 18 వేల కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చిండు. ఇక అన్నదమ్ముళ్లను బుట్టలో వేసుకున్నారు. ఈయనేమో బీజేపీలోకి జొర్రిండు. అన్ననేమో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్తున్నారట.. ఎలక్షన్ అయిపోయాక తిరిగి వస్తడట. అన్న కాంగ్రెస్ ఎంపీ, ఈయనేమో బీజేపీలో జొర్రిన నేత. వీళ్లిద్దరూ కోమటిరెడ్డిలు కాదు.. కోవర్ట్ రెడ్డిలు. కోవర్ట్ ఆపరేషన్లు చేసేటోళ్లు వీరు. ఈ చిల్లర రాజకీయాన్ని మునుగోడు ప్రజలకు తెలియజెప్పాలి. గల్లిగల్లీకి, ఇంటింటికీ ఈ విషయాన్ని చెప్పాలని టీఆర్ఎస్‌వీ నాయకులకు కేటీఆర్ సూచించారు.