Site icon vidhaatha

KTR | గత పాల‌కులు ఈ జిల్లా పేద‌ల‌ను ప‌ట్టించుకోలేదు: కేటీఆర్‌

KTR |

విధాత: కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వం అధికారంలోకి వ‌చ్చాక దేశంలో మ‌త‌క‌ల్లోలాలు పెరిగాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు విమర్శించారు. సిలిండ‌ర్ ధ‌ర‌లు పెరిగాయని, ఉద్యోగాల భ‌ర్తీ జ‌ర‌గ‌లేదని చెప్పారు. క్రూడ్ ఆయిల్ ధ‌ర‌లు త‌గ్గినా పెట్రోల్ ధ‌ర‌లు మాత్రం త‌గ్గ‌డం లేదని అన్నారు. వాళ్లు అధికారంలోకి రాకముందు 70 ఉన్న పెట్రోల్‌ను ఈ తొమ్మిదేళ్లలో 110 చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పెట్రోల్ ధ‌ర‌లు పెంచ‌డంతో పాటు నిత్యావ‌స‌రాల ధ‌ర‌లు కూడా పెరిగాయన్నారు. హిందూ, ముస్లిం అని పంచాయ‌తీలు పెట్ట‌డం త‌ప్ప 9 ఏళ్లలో బీజేపీ నాయకులు ఏం చేశారని నిలదీయాలని పిలుపునిచ్చారు. బీజేపీ నేతలు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని, వాళ్లు ఓట్ల కోసం వస్తే.. గుండు కొట్టి, డిపాజిట్లు గల్లంతు చేయాన్న కేటీఆర్‌.. ‘పిరమైన’ ప్రధానికి ఓటుతోనే సమాధానం చెప్పాలని కోరారు.

బీజేపీని గ‌ల్లీలో గ‌ల్లా ప‌ట్టి నిల‌దీయాలని చెప్పారు. గురువారం నిజామాబాద్‌లో నిర్వహించిన బహిరంగ సభలో కేటీఆర్‌ మాట్లాడారు. ఎన్నికలు రాగానే సంక్రాంతికి గంగిరెద్దులు మోపైనట్టు వస్తారని ప్రతిపక్ష పార్టీల నుద్దేశించి అన్నారు. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని ఈ సందర్భంగా దృష్టిలో పెట్టుకోవాలని కోరారు. ‘హైద‌రాబాద్ నుంచి నిజామాబాద్ దాకా చెరువులు నిండుకుండ‌లా క‌నిపించాయి.

ఎటు చూసినా ఒక్క ఇంచు ఖాళీ లేకుండా వ‌రి నాట్లు వేయ‌డంతో ఆకుప‌చ్చ‌గా క‌న‌ప‌డుతున్నది. భూమాత ఆకుప‌చ్చ చీర కట్టుకుంటే ఎంత అందంగా ఉంటుందో.. ఆ మాదిరిగా ఆకుప‌చ్చ తెలంగాణ ఆవిష్కృత‌మ‌వుతోంది. గ‌తంలో నెర్రెలు బారిన నేల‌.. నెత్తురుకారిన నేల మ‌న తెలంగాణ‌. న‌క్స‌లిజంతో, తీవ్ర‌వాదంతో, సామాజిక అస‌మాన‌త‌ల‌తో అత‌లాకుత‌ల‌మైన నేల తెలంగాణ నేల‌.

ఆనాటి స‌మైక్య పాల‌న‌లో ఆగ‌మైన నేల తెలంగాణ నేల‌. ఈ 9 ఏండ్ల కాలంలో ఎక్క‌డున్న తెలంగాణ ఎక్క‌డికి వ‌చ్చిందో ఆలోచించాలి’ అని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రజల కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలను, చేసిన అభివృద్ధిని ఆయన వివరించారు. కానీ.. కొన్ని పార్టీలు దీనిని జీర్ణించుకోలేక పోతున్నాయని విమర్శించారు.

‘ఇక్క‌డ ఒక ఎంపీ ఉన్నాడు. చ‌దువుకున్నాడో లేదో తెలియ‌దు కానీ.. ఎంత కుసంస్కారంగా, ఎంత చిల్ల‌ర‌గా మాట్లాడుతున్నారో మీరే చూస్తున్నారు. కేసీఆర్ వ‌య‌సు వారి నాన్న గారి వ‌య‌సు. మేం డీఎస్ గారిని అన‌లేమా? కానీ పెద్దల‌ను గౌర‌వించుకోవ‌డం హిందూ సంప్ర‌దాయం. మ‌నిషి నాగ‌రిక‌త‌కు చిహ్నం కూడా.

కానీ 70 ఏండ్ల వ‌య‌సున్న, ప్ర‌జ‌ల ఆశీర్వాదంతో రెండు సార్లు ముఖ్య‌మంత్రిగా ఎన్నికైన కేసీఆర్‌ను ప‌ట్టుకొని.. నిన్న‌మొన్న ఎంపీ అయినోడు నోటికొచ్చిన‌ట్లు మాట్లాడుతున్నాడు. ఆ ఎంపీకి ఒక్క‌టే విజ్ఞ‌ప్తి చేస్తున్నా. ఇక‌నైనా సంస్కార‌వంతంగా మాట్లాడ‌టం నేర్చుకో. ఇప్ప‌టికే నిజామాబాద్ ప్ర‌జ‌లు డిసైడ్ అయ్యారు. నీవు ఎక్క‌డ పోటీ చేసినా నీ డిపాజిట్ గ‌ల్లంతు చేయ‌డం ఖాయం’ అని అన్నారు.

యాభై ఏండ్లు సతాయించిన కాంగ్రెస్‌

కాంగ్రెసోళ్లు కూడా కేసీఆర్ మీద ఎగ‌బ‌డి ఎగ‌బ‌డి మాట్లాడుతున్నారని కేటీఆర్‌ విమర్శించారు. ‘ఒక్క‌సారి అవ‌కాశం ఇవ్వండ‌ని కాంగ్రెసోళ్లు అడుగుతున్నారు. వీళ్ల‌కు ఒక్క‌సారి కాదు.. ప‌ది సార్లు అవ‌కాశం ఇవ్వ‌లేదా.? 50 ఏండ్ల పాటు ఈ కాంగ్రెస్ పార్టీ మ‌న‌ల్ని సతాయించ‌లేదా..? యాభై ఏండ్లు ప‌రిపాలించినోడో, ఏ ప‌నీ చేయ‌డానికి చేత‌కానోడో.. ఇవాళ మ‌న ముందుకొచ్చి కేసీఆర్‌ను తిడుతుంటే ప‌డుదామా? ’ అని ప్రశ్నించారు.

తెలంగాణ ఉద్య‌మంలో ఉద్య‌మ‌కారుల‌పైకి రైఫిల్ తీసుకెళ్లిన రైఫిల్ రెడ్డి.. నికార్స‌యిన తెలంగాణ వాది ఎలా అవుతారని నిలదీశారు. రేవంత్ రెడ్డి తెలంగాణవాది కాదు.. తెలంగాణ‌కు ప‌ట్టిన వ్యాధి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మూడు గంట‌ల కాంగ్రెస్ కావాల్నా.. మూడు పంట‌ల కేసీఆర్ కావాల్నా.. మ‌తం మంట‌ల బీజేపీ కావాల్నా.. ఏం కావాలో తేల్చుకోండి.

హ‌ర్యానాలో మ‌తం పేరిట దాడులు చేసుకుంటున్నారు. ఓట్ల కోసం చిల్ల‌ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఢిల్లీ బానిస‌లైనా కాంగ్రెస్, బీజేపీ.. తెలంగాణ ఆత్మ‌గౌర‌వానికి మ‌ధ్య జ‌రుగుతున్న పోటీ ఈ రాబోయే ఎన్నిక‌. పౌరుషం ఉన్న తెలంగాణ బిడ్డ‌లు ఈ ఢిల్లీ గ‌ద్ద‌ల‌ను త‌రిమికొట్టాలి’ అని చెప్పారు.

Exit mobile version