వినియోగదారులకు అలర్ట్‌.. ఫాస్టాగ్‌ రూ‌ల్స్‌ నుంచి పొగాకు ధరల వరకు.. ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానున్న కీలక మార్పులు ఇవే

ఫిబ్రవరి 1 నుంచి ఫాస్టాగ్ నిబంధనలు, పొగాకు ధరలు, గ్యాస్ సిలిండర్‌, బ్యాంకింగ్ సేవల్లో కీలక మార్పులు అమల్లోకి రానున్నాయి. పూర్తి వివరాలు ఇవే.

కొత్త ఏడాది ప్రారంభమైందో లేదో.. ఇట్టే ఒక నెల పూర్తైంది. మరో రెండు రోజుల్లో ఫిబ్రవరి నెల ప్రారంభం కాబోతోంది. అయితే, ఈ ఫిబ్రవరి నెల చాలా ప్రత్యేకమనే చెప్పలి. ఎందుకంటే కేంద్ర బడ్జెట్‌తో నెల ప్రారంభం కాబోతోంది. ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తిస్థాయి బడ్జెట్‌ (Union Budget)ను ప్రవేశపెట్టబోతోంది. ఈ బడ్జెట్‌పై సామాన్య ప్రజలు, వేతన జీవులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇక బడ్జెట్‌ మాత్రమేకాదు.. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి సామాన్యుల దైనందిన జీవితానికి సంబంధించి కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. గ్యాస్‌ సిలిండర్‌ ధర నుంచి బ్యాంకింగ్‌, ఫాస్ట్‌ట్యాగ్‌ ఇలా ఎన్నో కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

బడ్జెట్‌ ప్రకటన..

ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. ఆదాయపు పన్ను స్లాబుల్లో ఏవైనా మార్పులు వస్తాయా అని దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ప్రామాణిక మినహాయింపు పరిమితిని పెంచొచ్చని మధ్యతరగతి ప్రజలు ఆశిస్తున్నారు.

పాన్-మసాలా సిగరెట్లపై అదనపు పన్ను

పొగాకు, పాన్‌ మాసాలా ఉత్పత్తులపై ఫిబ్రవరి 1వ తేదీ నుంచి కొత్త పన్ను విధానం అమల్లోకి రానున్నది (Tobacco Prices). ఈ ఉత్పత్తులపై ప్రస్తుతం ఉన్న జీఎస్‌టీ రేట్లకు అదనంగా అదనపు ఎక్సైజ్‌ సుంకాన్ని, హెల్త్‌ సెస్సును కేంద్రం విధించడంతో ఈ కొత్త పన్ను విధానం అమలు కానున్నది. పొగాకు, దాని అనుబంధ ఉత్పత్తులపై అదనపు ఎక్సైజ్‌ సుంకం పడనుండగా పాన్‌ మసాలాపై ఆరోగ్య, జాతీయ భద్రతా సెస్సు పడనుంది. ప్రభుత్వం జారీచేసిన నోటిఫికేషన్‌ ప్రకారం.. పాన్‌ మసాలా, సిగరెట్లు, పొగాకు, తదితర అనుబంధ ఉత్పత్తులపై జీఎస్‌టీ కింద 40 శాతం పన్ను ఉంటుంది. బీడీలపై 18 శాతం జీఎస్‌టీ విధిస్తారు. ఈ జీఎస్‌టీ రేట్లు కొనసాగిస్తూ విడిగా అదనపు లెవీలను విధిస్తారు. ఫలితంగా వచ్చే నెల నుంచి సిగరెట్‌ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది.

గృహ వినియోగ సిలిండర్‌ ధరల్లో మార్పులు ఉండేనా..?

చమురు మార్కెటింగ్‌ కంపెనీలు ప్రతి నెలా ఒకటో తేదీన ఎల్పీజీ సిలిండర్ల ధరలను ( LPG Cylinder Prices) సవరిస్తుంటాయి. ఇందులో భాగంగా ఫిబ్రవరి 1వ తేదీన కొత్త ఎల్పీజీ ధరలను మార్కెటింగ్‌ సంస్థలు ప్రకటించనున్నాయి. అయితే, వాణిజ్య అవసరాలకు ఉపయోగించే 19 కేజీల ఎల్పీజీ ధరలు చాలా కాలంగా మారుతూ వస్తున్నాయి. కానీ గృహ వినియోగం కోసం ఉపయోగించే 14 కేజీల ఎల్పీజీ ధరల్లో ఎలాంటి మార్పూ రావట్లేదు. గత కొన్ని రోజులుగా ఈ గ్యాస్‌ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సారైనా 14 కిలోల గ్యాస్‌ సిలిండర్ల ధరలను సవరిస్తాయో లేదో అని సామాన్య ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరోవైపు ఎల్పీజీ సిలిండర్ ధరలతో పాటు, CNG, PNG, ఏవియేషన్ టర్బైన్ ఇంధన ధరలు కూడా ఫిబ్రవరి 1న మారే అవకాశం ఉంది. ఈ రోజున చమురు కంపెనీలు కొత్త ధరలను విడుదల చేస్తాయి. ATF ధరలు పెరిగితే అది విమాన ఛార్జీలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది.

ఫాస్టాగ్‌ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌..

జాతీయ రహదారుల్లో రాకపోకలు సాగించే వారికి ఇది గుడ్‌న్యూస్‌ అనే చెప్పాలి. వచ్చే నెల 1వ తేదీ నుంచి ఫాస్టాగ్‌ వినియోగదారులకు (FASTag Rules) కూడా నియమాలు మారబోతున్నాయి. కార్లు, జీపులు, వ్యాన్ల కోసం జారీ చేసే కొత్త ఫాస్టాగ్‌లకు నో యువర్‌ వెహికల్‌ (కేవైసీ) విధానాన్ని కేంద్రం ఇటీవలే రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నిబంధన ఫిబ్రవరి 1వ తేదీన నుంచి అమల్లోకి రానుంది. వచ్చే నెల 1వ తేదీ నుంచి జారీ చేసే వాహనాలకు ఈ విధానం నుంచి మినహాయింపు ఉంటుంది. ఇది వాహనదారులకు ఉపశమనం అనే చెప్పాలి. అంతేకాదు, ఇప్పటికే ఫాస్టాగ్‌ జారీ చేసిన వాహనాలకు కేవైసీ తప్పనిసరి కాదు.

బ్యాంకుల్లో కీలక మార్పులు..

ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వచ్చే విధంగా దేశంలోని ప్రధాన ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు తమ సర్వీస్‌ ఛార్జీలు, సేవింగ్‌ అకౌంట్‌ నియమాల్లో కీలక మార్పులు చేసే అవకాశం ఉంది. మినిమస్‌ బ్యాలెన్స్‌ మెయిన్‌టెయిన్‌ చేయకపోతే జరిమానాలు, చెక్‌బుక్‌, IMPS లావాదేవీల రుసుముల్లో మార్పులు ఉండే అవకాశం ఉంది. అంతేకాదు కొన్ని బ్యాంకులు తమ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ వడ్డీ రేట్లల్లో కూడా మార్పులు ప్రకటించే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి :

Himachal Pradesh : కొండలను చీల్చుకుంటూ వెళ్లిన మంచు ప్రవాహం.. షాకింగ్‌ వీడియో
Gold Silver Price Today : భారీగా తగ్గిన బంగారం.. వెండి ధరలు

Latest News