Nirmala Sitharaman : నిర్మలమ్మ బడ్జెట్‌ టీమ్‌ ఇదే.. తొలిసారి శక్తిమంతమైన మహిళకు చోటు.. ఫుల్‌ డీటెయిల్స్ ఇవే..!

2026-27 బడ్జెట్‌ను రూపొందించిన నిర్మలమ్మ టీమ్‌లో తొలిసారి శక్తిమంతమైన మహిళకు చోటు. బడ్జెట్ వెనుక ఉన్న కీలక అధికారులు ఎవరో తెలుసుకోండి.

Nirmala Sitharaman

2026-27 సంవత్సరానికి సంబంధించిన పూర్తిస్థాయి బడ్జెట్‌ను రేపు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ (Nirmala Sitharaman) వరుసగా తొమ్మిదోసారి పార్లమెంట్‌కు బడ్జెట్‌ సమర్పించనున్నారు. ఈ బడ్జెట్‌పై సామాన్య ప్రజలు, వేతన జీవులు, వ్యాపారులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే, బడ్జెట్‌ ఎవరు తయారు చేస్తారనే విషయం చాలా మందికి తెలియదు. ఈ నేపథ్యంలో నిర్మలమ్మ బడ్జెట్‌ టీమ్‌ (Budget Team) గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మరోవిషయం ఏంటంటే..? ఈ బడ్జెట్‌కు ఓ ప్రత్యేకత ఉంది. నిర్మలా సీతారామన్‌తోపాటూ తొలిసారి మరో శక్తిమంతమైన మహిళ కూడా ఈ టీమ్‌లో ఉన్నారు. ఆమె ఎవరో కాదు.. ఐఏఎస్‌ అధికారిణి అనురాధ ఠాకూర్‌.

తొలి మహిళా ఐఏఎస్‌ అధికారిణి..

అనురాధ ఠాకూర్ (Anuradha Thakur).. గతేడాదే ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా నియమితులయ్యారు. అంతకుముందు ఆ స్థానంలో 1987 బ్యాచ్‌కు చెందిన కర్ణాటక కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి అజేయ్ సేథ్ ఉండేవారు. ఆయన స్థానంలో అనురాధ ఠాకూర్‌ బాధ్యతలు చేపట్టారు. ఆమె బడ్జెట్‌ రూపొందించే ఈ కీలక విభాగానికి అధిపతిగా ఉన్నారు. ఆమె ఈ పదవిని చేపట్టిన తొలి మహిళా ఐఏఎస్‌ అధికారిణి. ఈమెది బీహార్‌ రాష్ట్రం. 1994లో హిమాచల్‌ ప్రదేశ్‌ క్యాడర్‌ ఐఏఎస్‌ అధికారిణిగా ఎంపికయ్యారు. కేంద్ర ప్రభుత్వంలో ఎన్నో కీలక పదవులను చేపట్టారు. గతేడాది జులైలో ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు.

వీ అనంత్ నాగేశ్వరన్

వీ అనంత్ నాగేశ్వరన్ (V Anantha Nageswaran) భారత ప్రభుత్వానికి ప్రధాన ఆర్థిక సలహాదారు. ఆయన ఆసియా పరిశోధనా అధిపతిగా.. ఆ తర్వాత స్విట్జర్లాండ్‌లోని బ్యాంక్ జూలియస్ బేర్‌లో గ్లోబల్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆఫీసర్‌గా పని చేశారు. స్విట్జర్లాండ్, సింగపూర్‌లో క్రెడిట్ సూయిస్సే, యూనియన్ బ్యాంక్ ఆఫ్ స్విట్జర్లాండ్ (UBS) కోసం పనిచేశారు. ఐఎఫ్ఎంఆర్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ డీన్‌గా, సింగపూర్ మేనేజ్‌మెంట్‌ యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్ విద్యార్థుల ప్రొఫెసర్‌గా, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ బెంగళూరు, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ ఇండోర్‌లో సేవలందించారు. అనంత్ గతంలో ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలిలో తాత్కాలిక సభ్యుడిగా సేవలు అందించారు.

ఈయన సారథ్యంలో ఆర్థిక సర్వే తయారు చేస్తారు. బడ్జెట్ కోసం మొత్తం స్థూల ఆర్థిక సందర్భాన్ని నిర్వచించే కీలకమైన ఇన్‌పుట్‌లను ఆయన కార్యాలయం అందిస్తుంది. ఇందులో ఆర్థిక వృద్ధిని అంచనా వేయడం, వివిధ రంగాల (వ్యవసాయం, పరిశ్రమ, సేవలు) పనితీరును విశ్లేషించడం, ప్రపంచ నష్టాలను అంచనా వేయడం వంటివి ఉంటాయి. ఇంకా, ఆయన కార్యాలయం కీలక ఆర్థిక సంస్కరణలు, ఆర్థిక విధానం, ఆర్థిక వ్యూహంపై ఆర్థిక మంత్రికి సలహా ఇస్తుంది.

అరుణిష్ చావ్లా

అరుణిష్ చావ్లా (Arunish Chawla) 1992 బ్యాచ్ బిహార్ కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. ఆయన ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలోని డిపార్ట్మెంట్ పెట్టుబడులు, పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ విభాగానికి అధిపతిగా ఉన్నారు. ఆర్థిక మంత్రి టీమ్‌లో ఆయన గతేడాదే చేరారు. ఈయన పెట్టుబడుల ఉపసంహరణ, ప్రైవేటీకరణను చూస్తుంటారు.

ఎం నాగరాజు

ఎం నాగరాజు (M Nagaraju) ఆర్థిక సేవల విభాగానికి నాయకత్వం వహిస్తున్నారు. ఆయన ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా కంపెనీలు, పెన్షన్‌ సంస్థల పనితీరును పర్యవేక్షిస్తారు. ఆయన ప్రధానంగా ఆర్థిక సమ్మిళితం (Financial Inclusion), రుణ సౌకర్యాల విస్తరణ, సామాజిక భద్రతను బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తారు. అలాగే, డిజిటల్ ఫైనాన్స్, మొత్తం ఆర్థిక స్థిరత్వానికి సంబంధించిన విధానాల రూపకల్పనలో ఆయన టీమ్‌ కీలక పాత్ర పోషిస్తుంది.

అరవింద్ శ్రీవాస్తవ

అరవింద్‌ శ్రీవాస్తవ (Arvind Shrivastava) రెవెన్యూ కార్యదర్శిగా సేవలందిస్తున్నారు. ఆయన ఆదాయపు పన్ను, కార్పొరేట్‌ పన్ను, జీఎస్‌టీ, కస్టమ్స్‌ డ్యూటీస్‌ వంటి పన్ను ప్రతిపాదలను పర్యవేక్షిస్తారు. రెవెన్యూ కార్యదర్శిగా ఆయన తొలిసారి బడ్జెట్‌ టీమ్‌లో చేరారు. ఆయనకు బడ్జెట్‌ విభాగం, ప్రధాన మంత్రి కార్యాలయంలో పనిచేసిన అనుభవం ఉంది. ఆర్థిక విధానాలపై ఆయనకు ప్రత్యేక అవగాహన ఉంది. పన్నుల హేతుబద్ధీకరణ, ఆదాయాన్ని పెంచే చర్యలపై అంచనాలు పెరుగుతున్న తరుణంలో ఆయన పాత్ర చాలా కీలకం.

వుమ్లున్మాంగ్ వుల్నామ్

వుమ్లున్మాంగ్ వుల్నామ్ (Vumlunmang Vualnam).. వ్యయ కార్యదర్శి. ఖజానా సంరక్షకుడిగా ఆయన ప్రభుత్వ ఖర్చులను పర్యవేక్షిస్తారు. సబ్సిడీలను హేతుబద్ధీకరిస్తారు, కేంద్ర పథకాలను అమలు చేస్తారు. ఆర్థిక లోటును నిర్వహించడానికి ఆయన శాఖ ఆర్థిక క్రమశిక్షణను అమలు చేస్తుంది. తదుపరి ఆర్థిక సంవత్సరానికి మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది.

కె మోసెస్ చలై

కె మోసెస్ చలై (K Moses Chalai).. పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ విభాగం కార్యదర్శి. ఎంపిక చేసిన ప్రభుత్వ రంగ సంస్థల బడ్జెట్ కేటాయింపులు, మూలధన వ్యయ ప్రణాళికలను సమర్థవంతంగా ఉపయోగించుకునేలా చూసుకోవడం ఆయన బాధ్యత. ఆయన శాఖ ఆస్తుల మోనటైజేషన్, ప్రభుత్వ రంగ సంస్థల మొత్తం ఆర్థిక ఆరోగ్యాన్ని పర్యవేక్షించడంలో కూడా పాత్ర పోషిస్తుంది.

ఇవి కూడా చదవండి :

Jamili Elections | మహిళలు.. వారసులు.. వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్దంకండి!
Raithu Bharosa | ఈ దఫా రైతు భరోసాలో పది లక్షల మందికి కోత?

Latest News