- పంట వేయని భూమికి మొండి చెయ్యి
- సాగు భూములపై శాటిలైట్ సర్వే
- చెల్లింపుల తేదీపై కొరవడిన స్పష్టత
విధాత, హైదరాబాద్ :
Raithu Bharosa | రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జనవరి 26, 2025లో రైతు బంధు పథకాన్ని పేరు మార్చి ‘రైతు భరోసా’గా ఖరారు చేసి ప్రారంభించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.10 వేల చొప్పున ఎకరానికి అందచేయగా, ఆ మొత్తాన్ని పెంచి రూ.12 వేల చొప్పున అందచేయనున్నట్లు ప్రకటించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు మూడు సీజన్లలో రైతు భరోసా నిధులు విడుదల చేసింది. తొలుత మే, 2024లో రైతు భరోసా నిధుల విడుదల చేశారు. ఆ తరువాత ఫిబ్రవరి, 2025 సీజన్‌లో రెండోసారి, జూన్, 2025 సీజన్‌లో మూడోసారి నిధులు విడుదల చేసిన విషయం తెలిసిందే.
వాస్తవానికి జనవరి, 2026లో విడుదల చేయాల్సి ఉండగా నిధుల లభ్యత లేదనే పేరుతో ఇవ్వలేదు. సంక్రాంతి పండుగ సమయంలో విడుదల చేస్తారని రైతులు ఆశించినా.. నిరాశే ఎదురైంది. రైతు భరోసా నిధులు ఎప్పుడు విడుదల చేస్తారన్న విషయంలో వ్యవసాయ శాఖ స్పష్టత ఇవ్వలేకపోతున్నది. ఆలస్యం కావడం మూలంగా ఈ సీజన్‌లో చెల్లిస్తారా? లేదా వాయిదా వేస్తారా? అనే అనుమానాలు రైతుల్లో వ్యక్తమవుతున్నాయి.
పోరంబోకు, బంచరాయి, రాళ్ళు, రప్పలు, లేఅవుట్ భూములు, ప్రాజెక్టులకు సేకరించిన భూములు, దొంగ పట్టాదార్ పాస్‌బుక్స్ కలిగిన వారికి బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు నిధులు మంజూరు చేసినట్లు కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. పరిమితి లేకుండా, సాగు చేయని భూములకు సాయం చేయడం మూలంగా.. కష్టపడి సాగు చేస్తున్న రైతులకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. రైతు భరోసా విధి విధానాల ఖరారుపై దృష్టి సారించారు. ఇందుకోసం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి డీ శ్రీధర్ బాబుతో కమిటీ కూడా వేశారు. ఈ కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటించి వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు, అభ్యంతరాలు సేకరించింది. 2025 జనవరిలో కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం సాగుకు అనువుగా లేని భూములకు రైతు భరోసా నిలిపివేయాలని సిఫారసు చేసింది.
గత ఆరేళ్లలో పన్నెండుసార్లు రైతు బంధు సాయం కింద 80,453 కోట్ల రూపాయలు విడుదల చేశారు. ఈ మొత్తంలో 25,672 కోట్లు.. లే అవుట్ ప్లాట్లు, పడావు భూములు, గుట్టల భూములు, ఫాం హౌస్ భూములు, ప్రభుత్వం సేకరించిన భూములకు ఇచ్చినట్లు తేలింది.
సాధారణంగా వ్యవసాయ భూములను వ్యవసాయేతర అవసరాలకు వినియోగిస్తే నాలా కింద భూ మార్పిడి చేయించుకోవాలి. అయితే.. హైదరాబాద్ నగరం చుట్టుపక్కలే కాకుండా రాష్ట్రంలో పలు ప్రాంతాలలో వేల ఎకరాలు సాగు భూములుగానే రికార్డుల్లో కొనసాగుతున్నాయి. మరోవైపు కౌలు రైతుల విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ఎందుకంటే.. కౌలు రైతులకు రైతుబంధు ఇచ్చేదే లేదని కేసీఆర్ తన హయాంలో తేల్చి చెప్పేశారు. అయితే.. రాష్ట్రంలో సుమారు 20 లక్షల మంది వరకు కౌలు రైతులు ఉన్నారు. వ్యవసాయం చేస్తున్నవారికి రైతు భరోసా ఇవ్వాలని అనుకుంటే వీరికి కూడా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. నిజానికి కౌలు రైతులకు కూడా భరోసా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చింది. రైతు భరోసా పథకాన్ని ప్రకటించినప్పుడు కౌలు రైతుల ఊసే ఎత్తలేదు.
ఇదిలా ఉంటే.. 2025 వానకాలం సీజన్‌లో 69 లక్షల మంది రైతులకు రూ.9వేల కోట్లను వారి ఖాతాల్లో జమ చేశారు. ఇంకా యాసంగి పంటకు విడుదల చేయల్సిన మొత్తం పెండింగ్ లో ఉంది. కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం రాష్ట్రంలో భారీ ఎత్తున అనర్హుల పేర్లను తొలగిస్తున్నట్లు తెలిసింది. భూమి సాగు చేయని వారికి ఇవ్వాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టత ఇవ్వడంతో తొలగింపు ప్రక్రియ జరుగుతోంది. రైతు భరోసా డబ్బులు ఇస్తున్నదే ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు కొనుగోలు చేయడానికి అని అంటున్నారు. అలాంటప్పుడు సాగు చేయని వారికి ఎందుకు ఇవ్వాలనేది ప్రభుత్వ వాదనగా ఉంది.
రాజేంద్ర నగర్ లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివరిటీ, ఎస్ఏఆర్ ఏజెన్సీలు గత కొద్ది రోజులుగా శాటిలైట్ మ్యాపింగ్ చేశాయి. ఈ మ్యాపింగ్ లో వానకాలంలో సాగు చేయని భూములకు కూడా భరోసా తీసుకున్నట్లు తేలింది. సాగు చేస్తున్నారా? లేక పడావు పడిందా? అనేది తెలుసుకునేందుకు సింథటిక్ ఎపర్చర్ రాడార్ సాంకేతికత సాయంతో సాగు భూముల వివరాలు సేకరించింది. ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం 10 లక్షల మంది వరకు కోత విధించే అవకాశం ఉందని విశ్వసనీయవర్గాలు చెబుతున్నాయి. ప్రతి గుంట భూమిలో సాగు అవుతుందా లేదా అనేది పక్కాగా తీసుకుంటున్నారు. రియల్ ఎస్టేట్ వెంచర్లు, కమర్షియల్ ప్లాట్లు, గుట్టలు, పనికిరాని పడావు భూములకు గతంలో పెట్టుబడి సాయం ఇచ్చేవారు. ఇలాంటి వాటికి సాయం నిలిపివేసేందుకు అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్లు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేస్తున్నారు. అంటే గత సీజన్ లో 69 లక్షల ఎకరాలకు సాయం అందగా ఈసారి పది లక్షల ఎకరాలు తగ్గిస్తే, 59 లక్షల ఎకరాలకు మాత్రం సాయం లభించే సూచనలు కన్పిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి..
Double Bedroom Scheme | ఖాళీగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
PRC delay Telangana | రెండేళ్లయినా తెలంగాణ ప్రభుత్వోద్యోగులకు అతీగతీ లేని పీఆర్సీ..
వినియోగదారులకు అలర్ట్.. ఫాస్టాగ్ రూల్స్ నుంచి పొగాకు ధరల వరకు.. ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానున్న కీలక మార్పులు ఇవే
