విధాత, హైదరాబాద్ : బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో గేమ్ చేంజర్ గా ముఖ్యమంత్రి మహిళా రోజ్ గార్ యోజన పథకాన్ని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న నేపథ్యంలో ఇప్పుడు నగదు బదిలీ పథకాలు మరోసారి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ ఫలితాల కంటే కూడా ఎక్కువ సీట్లు సాధించి ఎన్డీఏ తిరిగి అధికార పీఠం సాధించడంలో మహిళలకు నితీష్ కుమార్ ప్రభుత్వం అందించిన రూ.10వేల ఆర్థిక సహాయం పథకం కీలకంగా పనిచేసింది. ఎన్నికలకు ముందు నీతీష్ కుమార్ తెచ్చిన ముఖ్యమంత్రి మహిళా రోజ్ గార్ యోజన పథకంతో ఏకంగా 1.4కోట్ల మంది బీహారి మహిళల ఖాతాల్లో రూ.10వేల చొప్పున జమకావడంతో ఎన్నికల్లో మహిళా ఓటర్లు ఎన్డీఏకు జై కొట్టారు. పెరిగిన మహిళల పోలింగ్ శాతం కూడా ఈ పథకానికి స్పందనగా చెబుతున్నారు. దీంతో నగదు బదిలీ పథకాల ప్రాధాన్యత రాజకీయ పార్టీల్లో మరోసారి హాట్ టాపిక్ గా మారింది.
మార్గదర్శి కేసీఆర్ రైతు బంధు
తెలంగాణలో సీఎం కేసీఆర్ రైతుబంధు పేరిట 2018ఎన్నికలకు ముందు స్కీమ్ అమలు చేసి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. అప్పట్లో ఏటా ఎకరాలకు రూ.10వేలు ఇచ్చే రైతు బంధు స్కీమ్ దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అలాంటి నగదు బదిలీ పథకాలను పలు రాష్ట్రాలలో రాజకీయ పార్టీలు అనుసరించే ప్రయత్నం చేశాయి. కేంద్రం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పథకానికి కూడా రైతుబంధు మార్గదర్శకంగా నిలిచిందంటారు. ఈ పరంపరలోనే నితీష్ కుమార్ సర్కార్ మహిళలకు రూ.10వేల ఆర్థిక సహాయం పథకం కూడా చేరింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కూడా రైతు బంధును రైతు భరోసా పేరుతో ఎకరాకు 15వేల చొప్పున ఇస్తామని ప్రకటించి..రూ12వేల చొప్పున అమలు చేస్తుంది. అలాగే మహిళలకు మహాలక్ష్మి ఆరు గ్యారెంటీల హామీల కింద రూ.2,500ఆర్థిక సహాయం అందిస్తామని కాంగ్రెస్ ప్రకటించడం జరిగింది. మహాలక్ష్మీ పథకం ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంలో కీలకంగా పనిచేసింది. అయితే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండెళ్లయినా ఈ పథకం అమలుకు పూనుకోలేదు. ప్రస్తుతానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేని నేపథ్యంలో మహిళలకు ఆర్థిక సహాయం పథకంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెండింగ్ మంత్రం పఠిస్తుంది. అయితే బీహార్ లో మాదిరిగా రాజకీయంగా లబ్ధి పొందాలనుకుంటే స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు మహిళలకు రూ.2500పథకం అమలు చేయవచ్చు. కొత్త పథకం అమలు చేయడం ఆర్థికంగా కష్టతరం అనుకుంటే..ప్రస్తుతానికి పెండింగ్ లో పెట్టుకుని.. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ పథకాన్ని అమలు చేస్తే మాత్రం అశ్చర్యపోనక్కరలేదు.
లోకల్ ఎలక్షన్స్ కు ముందు రైతు భరోసా వేస్తారా?
ఇకపోతే తెలంగాణ ప్రభుత్వం త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు సిద్దమవుతుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విజయం సాధించిన ఉత్సాహంతో ఇదే ఊపులో స్థానిక ఎన్నికలను కూడా ఎదుర్కోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం తలపోస్తుంది. అయితే గ్రామీణ ప్రాంతాల ఓటర్లలో రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపైన ప్రతికూలత నెలకొని ఉంటే మాత్రం కాంగ్రెస్ కు చేదు ఫలితాలు ఎదురుకాకతప్పదన్న ఆందోళన కూడా ఉంది. రైతు రుణమాఫీ సంపూర్ణం కాకపోవడం, ధాన్యం, పత్తి కొనుగోలులో ఎదుర్కొంటున్న సమస్యలు, రూ.500ధాన్యం బోనస్ పెండింగ్, వర్షాలతో దెబ్బతిన్న పంటలకు సహాయం దక్కకపోవడం వంటి సమస్యలతో రైతులు అసంతృప్తిగా ఉన్నారు. ఇటు 42శాతం బీసీ రిజర్వేషన్ల వ్యవహారం ప్రహసనంగా మారిపోవడం బీసీలను కూడా నిరుత్సాహపరిచింది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళితే ఫలితాలు ఎలా ఉండబోతాయన్నదానిపై సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తర్జన భర్జన చేస్తుంది. అయితే బీహార్ ఎన్నికలలో మహిళలకు రూ.10వేల ఆర్థిక సహాయం పథకంతో ఎన్డీఏ పొందిన విజయాన్ని పరిగణలోకి తీసుకుంటే మాత్రం..డిసెంబర్ నెలలో చెల్లించాల్సిన రైతు భరోసా డబ్బులను స్థానిక ఎన్నికలకు ముందు రైతులకు జమ చేసే ఆలోచనను కాంగ్రెస్ ప్రభుత్వం చేయవచ్చన్న చర్చ వినిపిస్తుంది. రైతుభరోసాను ముందుగా చెల్లిస్తే..అటు రైతులకు ప్రయోజనంతో పాటు ఇటు స్థానిక ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లో అధికంగా ఉండే రైతుకుటుంబాల ఓటర్లను ఆకట్టుకునే అవకాశం ఉంటుందని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి. అయితే ఈ విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. అలాగే చేనేత కార్మికుల రుణమాఫీ కూడా చేసే అవకాశం లేకపోలేదంటున్నారు విశ్లేషకులు.
