Site icon vidhaatha

Himachal Pradesh | కులూలో కుంభ‌వృష్టి వాన‌లు.. విరిగిప‌డిన కొండ చ‌రియ‌లు

Himachal Pradesh | విధాత‌: హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో కులూ (Kullu) జిల్లాలో 24 గంట‌ల్లో కురిసిన కుంభ‌వృష్టి వాన‌లు బీభ‌త్సం సృష్టించాయి. అనేక చోట్ల కొండ చ‌రియ‌లు విరిగిప‌డ్డాయి. ర‌హ‌దారులు దెబ్బ‌తిన్నాయి. ముఖ్యంగా కులూ-మండి జాతీయ ర‌హ‌దారి చాలా చోట్ల దెబ్బ‌తిన్న‌ది. ఫ‌లితంగా సుమారు 10 కిలోమీట‌ర్ల మేర వంద‌ల వాహ‌నాలు ఎక్క‌డిక‌క్క‌డ నిలిచిపోయాయి. క‌నీసం తాగ‌డానికి నీళ్లు, తిన‌డానికి తిండి కూడా అంద‌క తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్న‌ట్టు వాహ‌న డ్రైవ‌ర్లు వాపోతున్నారు.

ప‌బ్లిక్ వ‌ర్క్ డిపార్ట్‌మెంట్ సిబ్బంది రోడ్డు పున‌రుద్ధ‌ర‌ణ ప‌నులు చేప‌డుతున్నార‌ని అధికారులు తెలిపారు. ‘కులూ-మండి హైవే దెబ్బ‌తిన్న‌ది. ప్ర‌త్యామ్నాయ మార్గ‌మైన పండ‌హ్ ర‌హ‌దారి కూడా ధ్వంసమైంది. అందువ‌ల్లే వాహ‌నాలు ఎక్క‌డిక‌క్క‌డ నిలిచిపోయాయి’ అని కులూ ఎస్పీ సాక్షి వ‌ర్మ తెలిపారు. గ‌త రాత్రి భారీ వ‌ర్షం కుర‌వ‌డంతో కొండ చ‌రియ‌లు విరిగిప‌డి ర‌హ‌దారులు ధ్వంస‌మ‌య్యాయి. గురువారం రాత్రి వ‌ర‌కు చిన్న‌వాహ‌నాల రాకపోక‌ల‌ను అయినా పురుద్ధ‌రిస్తాని ఎస్పీ వెల్ల‌డించారు.

ఈ వ‌ర్షాకాల సీజ‌న్‌లో కుండ‌పోత వాన‌ల‌తో రాష్ట్రంలో ఇప్ప‌టివ‌ర‌కు రూ.8,014.61 కోట్ల ఆస్తిన‌ష్టం సంభ‌వించిన‌ట్టు రాష్ట్ర ప్ర‌భుత్వం తెలిపింది. 2,022 ఇండ్లు పూర్తిగా, 9,615 ఇండ్లు స్వల్పంగా దెబ్బ‌తిన్నాయ‌ని వివరించింది. 113 చోట్ల కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డిన‌ట్టు తెలిపింది. 224 మంది మృత్యువాత ప‌డిన‌ట్టు వివ‌రించింది.

Exit mobile version