LED LIGHTS | న‌క్ష‌త్రాల ద‌ర్శ‌నం ఇక క‌నుమ‌రుగేనా..? ఎల్ఈడీ బ‌ల్బుల‌తో పెరుగుతున్న కాంతి కాలుష్యం..

LED LIGHTS | విద్యుత్ ఆదా కోసం అంటూ మ‌నం ఉప‌యోగిస్తున్న ఎల్ఈడీ బ‌ల్బులు (LED Bulbs) కాంతి కాలుష్యానికి (Light Pollution) కార‌ణ‌మ‌వుతున్నాయ‌ని ఒక నివేదిక వెల్ల‌డించింది. ఈ ఎల్ఈడీ బ‌ల్బుల కాంతి వ‌ల్ల ఆకాశంలో న‌క్ష‌త్రాలు క‌నిపించ‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింద‌ని తెలిపింది. సైన్స్ జ‌ర్న‌ల్‌లో ప్ర‌చురిత‌మైన ఈ అధ్య‌య‌నం ప్ర‌కారం.. ఎల్ఈడీ బ‌ల్బులు వెద‌జ‌ల్లుతున్న కాంతి వ‌ల్ల ఆకాశం ఏటా 10 శాతం ఎక్కువ ప్ర‌కాశ‌వంతంగా మారిపోతోంది. త‌క్కువ ధ‌ర‌లో, త‌క్కువ విద్యుత్‌ను ఉప‌యోగించుకుంటూ.. […]

  • Publish Date - September 3, 2023 / 08:30 AM IST

LED LIGHTS |

విద్యుత్ ఆదా కోసం అంటూ మ‌నం ఉప‌యోగిస్తున్న ఎల్ఈడీ బ‌ల్బులు (LED Bulbs) కాంతి కాలుష్యానికి (Light Pollution) కార‌ణ‌మ‌వుతున్నాయ‌ని ఒక నివేదిక వెల్ల‌డించింది. ఈ ఎల్ఈడీ బ‌ల్బుల కాంతి వ‌ల్ల ఆకాశంలో న‌క్ష‌త్రాలు క‌నిపించ‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింద‌ని తెలిపింది.

సైన్స్ జ‌ర్న‌ల్‌లో ప్ర‌చురిత‌మైన ఈ అధ్య‌య‌నం ప్ర‌కారం.. ఎల్ఈడీ బ‌ల్బులు వెద‌జ‌ల్లుతున్న కాంతి వ‌ల్ల ఆకాశం ఏటా 10 శాతం ఎక్కువ ప్ర‌కాశ‌వంతంగా మారిపోతోంది. త‌క్కువ ధ‌ర‌లో, త‌క్కువ విద్యుత్‌ను ఉప‌యోగించుకుంటూ.. ప్ర‌కాశ‌వంత‌మైన కాంతిని ఇస్తుండ‌టంతో ఎల్ఈడీల‌ను ఎక్కువ‌గా వాడాల‌ని ప్ర‌భుత్వాలు ప్రోత్స‌హించ‌డ‌మే దీనికి కార‌ణం.

అమెరికాలోనే తీసుకుంటే 2007లో అన్ని అవస‌రాల‌కు ఎల్ఈడీ లైట్ల‌నే ఉప‌యోగించాల‌ని యూఎస్ కాంగ్రెస్ చ‌ట్టం చేసింది. దీంతో అప్ప‌టి నుంచి ఫిల‌మెంట్ బ‌ల్బులపై నిషేధం ప‌డింది.

అవి కాస్త త‌క్కువ వెలుగునే విర‌జిమ్మేవి కావ‌డంతో న‌క్ష‌త్రాలు ప్ర‌స్ఫుటంగా క‌నిపించేవి. మ‌నం ఉప‌యోగిస్తున్న ప్ర‌స్తుత బ‌ల్బులు వెలుగును భారీ స్థాయిలో ఆకాశంలోకి విర‌జిమ్ముతున్నాయి.

దీని వ‌ల్ల మ‌నుషుల‌కు, జంతువుల‌కు న‌క్షత్రాలు క‌నిపించ‌డం లేదు. క్రమంగా మ‌న పాలపుంత‌లో ఉన్న న‌క్ష‌త్రాలు మ‌నుషుల‌కు క‌నుమ‌రుగవుతున్నాయ‌ని శాస్త్రవేత్త స్టీఫెన్ హ‌మ్మెల్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. దీని వ‌ల్ల అంత‌రిక్ష ప్ర‌యోగాల‌కు తీవ్ర విఘాతం క‌లుగుతుంద‌ని ఆయ‌న పేర్కొన్నారు. మాన‌వ ప‌రిణామ క్ర‌మంలో న‌క్ష‌త్రాల పాత్ర చాలా కీల‌కం. వాటిని గుర్తు ప‌ట్టే మ‌నిషి కొత్త కొత్త ప్ర‌దేశాలు కొనుగొనేవాడు.

నిశి రాత్రుల‌లో వాటిని చూడ‌టం ద్వారానే త‌న‌లో ఉండే శాస్త్ర జిజ్ఞాస‌ను పెంచుకున్నాడు అని ఆయ‌న అన్నారు. అంతే కాకుండా న‌క్ష‌త్ర గ‌మ‌నాన్ని అనుస‌రించే వ‌ల‌స పోయే ప‌క్షులు, జంతువుల‌కు ఈ ప‌రిణామం చేటు చేస్తుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. కొన్ని ప‌క్షులు హ‌ఠాత్తుగా భ‌వ‌నాల‌ను గుద్దుకోవ‌డం, వివిధ జంతు జాతులు నిద్ర‌లేక రోగాల బారిన ప‌డ‌టం కాంతి కాలుష్యం చ‌ల‌వేన‌ని పేర్కొన్నారు.

ఈ కాంతి కాలుష్యాన్ని అరిక‌ట్ట‌డానికి లైట్లు నేరుగా ఆకాశంలోకి విర‌జిమ్మ‌కుండా ప్ర‌తి బ‌ల్బుకు న‌ల్ల‌ని పూత పోసేలా సూచ‌న‌లు ఇచ్చామ‌ని.. బ‌ల్బుల త‌యారీదారుల ఉమ్మ‌డి వేదిక అమెరిక‌న్ లైటింగ్ అసోసియేష‌న్ వెల్ల‌డించింది. ఈ కాలుష్యాన్ని అరిక‌ట్ట‌డానికి డ‌బ్బు, సాంకేతికత అవ‌స‌రం లేద‌ని.. అవ‌గాహ‌న‌తో మెలిగితే చాల‌ని శాస్త్రవేత్త‌లు వెల్ల‌డిస్తున్నారు.

Latest News