Lion | దక్షిణాఫ్రికాలో సింహాల ‘వ్యవసాయం’.. మృగరాజులను పెంచి.. అమ్మకం

Lion | ఔషధ కంపెనీలకు సింహాల ఎముకలు పర్యాటక పార్కుల్లో సింహం కూనలు దక్షిణాఫ్రికాలో పెరుగుతున్న దారుణాలు లండన్‌: కోళ్లు, మేకలు, చేపలు, పందుల వ్యవసాయం (పెంపకం) అందరికీ తెలిసిందే. కాని సింహాల ఫార్మింగ్‌ కూడా ఉన్నదంటే ఆశ్చర్యం కలుగకమానదు. సింహాల సాగు విషయంలో ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీకి చెందిన గ్లోబల్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్‌ యూనిట్ హెడ్ నీల్ డి క్రూజ్, మాంచెస్టర్‌ మెట్రోపాలిటన్ యూనివర్సిటీకి చెందిన వైల్డ్ లైఫ్ రిసెర్చ్ మేనేజర్ ఆంజీ ఎల్విన్ తమ […]

  • Publish Date - August 24, 2023 / 10:53 AM IST

Lion |

  • ఔషధ కంపెనీలకు సింహాల ఎముకలు
  • పర్యాటక పార్కుల్లో సింహం కూనలు
  • దక్షిణాఫ్రికాలో పెరుగుతున్న దారుణాలు

లండన్‌: కోళ్లు, మేకలు, చేపలు, పందుల వ్యవసాయం (పెంపకం) అందరికీ తెలిసిందే. కాని సింహాల ఫార్మింగ్‌ కూడా ఉన్నదంటే ఆశ్చర్యం కలుగకమానదు. సింహాల సాగు విషయంలో ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీకి చెందిన గ్లోబల్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్‌ యూనిట్ హెడ్ నీల్ డి క్రూజ్, మాంచెస్టర్‌ మెట్రోపాలిటన్ యూనివర్సిటీకి చెందిన వైల్డ్ లైఫ్ రిసెర్చ్ మేనేజర్ ఆంజీ ఎల్విన్ తమ బ్లాగ్‌లో ఈ విషయాన్ని పంచుకున్నారు. అడవి సింహాలను ఫార్మ్‌హౌజ్‌లలో ఉంచి.. విచ్చలవిడిగా వాటి సంఖ్యను పెంచే ప్రయత్నాలు వెంటనే ఆపాలని వారు అన్నారు.

జంతువుల ఎముకల లైసెన్సు పరిమితిని కూడా బాగా తగ్గించాలని చెప్పారు. దక్షిణాఫ్రికాలో గత కొంతకాలం నుంచి అడవి జంతువుల ఎముకల వ్యాపారం బాగా పెరిగింది. ఇది ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. దక్షిణాఫ్రికాలో 350కి పైగా వ్యాపార కేంద్రాల్లో 8,000కు పైగా సింహాలు బందీగా ఉన్నాయని ఒక అంచనా ప్రకారం తెలుస్తున్నది. నిజానికి ఆ దేశపు సింహాల అంచనా 3,500 కాగా దీనికి రెండింతలు వ్యాపార కేంద్రాలలో ఉండటం గమనార్హం.

మాఫియా, వ్యాపారుల కుమ్మక్కు

అడవి జంతువుల ఎముకల వ్యాపారులకు, స్మగ్లింగ్‌ మాఫియాకు మధ్య ఉన్న గట్టి సంబంధాలతోనే ఈ లైసెన్స్‌డ్ దందా నడుస్తున్నదని అంటున్నారు. లైసెన్స్‌ వ్యాపారం పేరుతో మాఫియా ముఠాలు చట్టవ్యతిరేక కార్యకలాపాలను ముమ్మరం చేస్తున్నాయి. పేరుమోసిన బడా మాఫియా ముఠాల చేతుల్లో ఈ వ్యాపార కేంద్రాలువున్నాయని నీల్ డి క్రూజ్, ఆంజీ ఎల్విన్ తమ బ్లాగ్‌లో పేర్కొన్నారు. ఈ ముఠాలు అనేక పద్ధతుల్లో సింహాల సంఖ్యను పెంచుతారు. కోట్ల రూపాయల టర్నోవర్‌తో ఈ వ్యాపారం నడుస్తున్నది.

టూరిజం పేరుతో సింహం కూనల కేంద్రాలు, సింహాల పార్కులు, సింహాలను వేటాడి, బోనులో బంధించటం, వాటిని సజీవంగా ఎగుమతి చేయటం, వాటి వివిధ శరీర భాగాలను సంప్రదాయ మందుల కోసం సరఫరా చేయడం వంటి అక్రమ వ్యాపారాల్లో ఈ ముఠాలు మునిగితేలుతున్నాయని అంటున్నారు. ఈ సమయాల్లో మృగరాజులు తీవ్ర హింసకు గురవుతున్నాయి. వీటి ప్రభావం పరిసర ప్రాంతాల్లోని ప్రజల ఆరోగ్యాలపైనా ఉంటుందని నీల్ డి క్రూజ్, ఆంజీ ఎల్విన్ పేర్కొన్నారు.

పట్టించుకోని దక్షిణాఫ్రికా ప్రభుత్వం

సింహాల వ్యాపారంలో పెద్ద ఎత్తున ఘోరాలు, అక్రమాలు జరుగుతున్నా దక్షిణాఫ్రికా ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. వీటిని ఆపాల్సింది పోయి.. సింహాల వ్యాపార కేంద్రాలకు అనుమతులు ఇవ్వడమే కాకుండా.. సింహాల వేటను ఒక దశలో చట్టబద్ధం చేయడం గమనార్హం. వివిధ రకాల జంతువుల కళేబరాల నుంచి వేరు చేసినవే కాకుండా.. సింహాల కళేబరాల నుంచి వాటి ఎముకలు, పంజాలు, తలలు, పుర్రెలు, దంతాలు తదితరాలను చట్ట వ్యతిరేకంగా స్మగ్లింగ్‌ చేస్తున్నారని తెలుస్తున్నది.

ఈ విషయంపై 2019లో దక్షిణాఫ్రికా హైకోర్టు స్పందిస్తూ.. సింహాల ఎముకల ఎగుమతి చట్టవ్యతిరేకమని తీర్పు చెప్పింది. అయితే ఎగుమతి కొరకు ప్రభుత్వం వైపునుండి కోటా పరిమితి ఎంత అనేది స్పష్టం చేయలేదు. అంటే సింహాల ఎముకల వ్యాపారం మొత్తంగానే చట్టవ్యతిరేకం. అయినా బహిరంగంగానే జరుగుతున్నది. 2020లో వెలువడిన ఒక పరిశోధనా పత్రం ప్రకారం.. దారుణమైన ఈ దందాలో సంప్రదాయ బడా వ్యాపారులు, రాజకీయ నాయకులు, ఫార్మ్‌హౌజ్‌ యజమానులతోపాటు కొందరు శాస్త్రవేత్తలు సైతం కుమ్మక్కయ్యారని తెలుస్తున్నది.

అయితే దక్షిణ ఆఫ్రికా ప్రభుత్వం తదనంతరం తమ నిర్ణయాన్ని మార్చుకున్నది. సింహాల పెంపకం, వేట, వాటి శరీర భాగాల ఎగుమతిని చట్టం వ్యతిరేకంగా గుర్తించింది. అయినా.. ఆ చట్టాల అమలులో వైఫ్యలం కనిపిస్తున్నదని అంటున్నారు. దానితో దందా నిరాటంకంగా కొనసాగుతున్నది.

Latest News