Lok Sabha Polls | బీజేపీ ఐదో లిస్ట్‌ రిలీజ్‌.. 37 మంది సిట్టింగ్‌లకు టికెట్లు నిరాకరణ..

  • Publish Date - March 25, 2024 / 04:43 AM IST

Lok Sabha Polls | లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ తన ఐదో జాబితాను ఆదివారం విడుదల చేసింది. ఈ జాబితాలో 111 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. కేంద్ర మంత్రులు అశ్వినీకుమార్ చౌబే, వీకే సింగ్, వరుణ్ గాంధీ సహా 37 మంది సిట్టింగ్ ఎంపీలకు ఈసారి బీజేపీ టికెట్లు నిరాకరించింది. ఈ సారి బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌, రామాయణం టీవీ సీనియర్‌ నటుడు అరుణ్‌ గోవిల్‌కు టికెట్‌ కేటాయించడం విశేషం. సంబల్‌పూర్ నుంచి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను బీజేపీ పోటీకి దింపింది. బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర పూరీ నుంచి పోటీ చేయనున్నారు. 2019 ఎన్నికల్లో ఈ స్థానం నుంచి ఓడిపోయారు. రాజ్యాంగంపై ఇటీవల చేసిన వ్యాఖ్యలు వివాదానికి తెరలేపిన, ఆరుసార్లు కర్ణాటక ఎంపీగా పని చేసిన అనంత్ కుమార్ హెగ్డేకు బీజేపీ టికెట్ నిరాకరించింది.

ఐదో జాబితాలో 37 మంది అభ్యర్థులకు టికెట్‌ నిరాకరించింది. ఉత్తరప్రదేశ్‌ నుంచి తొమ్మిది మంది, గుజరాత్‌ నుంచి ఐదుగురు, ఒడిశా నుంచి నలుగురు, బీహార్‌, కర్ణాటక, జార్ఖండ్‌ల నుంచి ముగ్గురు చొప్పున సిట్టింగ్‌ ఎంపీలు ఉన్నారు. సీతా సోరెన్, తపస్ రాయ్, ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి సహా ఇతర పార్టీలను వీడి బీజేపీలో చేరిన పలువురు నేతలకు టికెట్లు ఇచ్చింది. కాంగ్రెస్ మాజీ ఎంపీలు నవీన్ జిందాల్ కురుక్షేత్ర, జితిన్ ప్రసాదకు ఫిలిబిత్‌ నుంచి బరిలోకి దిగనున్నాయి. కేరళ బీజేపీ అధ్యక్షుడు కే సురేంద్ర రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి పోటీ చేయనున్నారు. సందేశ్‌ఖాలీ బాధితుల్లో ఒకరైన రేఖా పాత్ర పశ్చిమ బెంగాల్‌లోని బసిర్‌హత్ నుంచి పోటీలో నిలిపింది. కేంద్రమంత్రి గిరిరాజ్‌సింగ్‌కు బెగుసరాయ్‌ నుంచి, మాజీ కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ పాట్నా సాహిబ్‌ నుంచి బీజేపీ టికెట్‌ దక్కించుకున్నారు. సిట్టింగ్ ఎంపీ వరుణ్ గాంధీకి ఈసారి పిలిభిత్ నుంచి టికెట్ దక్కలేదు. ఇటీవల బీజేపీ నేతృత్వంలోని కేంద్రంపై పలు విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. రైతుల ఆందోళన తదితర అంశాలపై ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఈ క్రమంలోనే ఆయనకు అధిష్ఠానం టికెట్‌ను నిరాకరించింది. అయితే, ఆయన ఏం చేయనున్నారనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఇక సంజయ్‌ గాంధీ తల్లి మేనకా గాంధీకి బీజేపీ టికెట్‌ ఇచ్చింది. సుల్తాన్‌పూర్‌ నుంచి ఆమె బరిలో ఉండనున్నారు. అలాగే ఘజియాబాద్‌లో రెండుసార్లు ఎంపీగా ఎన్నికైన వీకే సింగ్ స్థానంలో అతుల్‌ గార్డ్‌కి టికెట్‌ ఇచ్చింది. కంగనా రనౌత్ లోక్‌సభ ఎన్నికల్లో మండి నుంచి పోటీ చేయనుండగా.. రామాయణంలో రాముడి పాత్ర పోషించిన అరుణ్ గోవిల్ మీరట్ నుంచి బరిలో నిలిపింది. జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్‌ కోడలు దుమ్కా నుంచి అభ్యర్థిగా ఎంపికయ్యారు. కొన్ని రోజుల క్రితం జార్ఖండ్ ముక్తి మోర్చాను వీడి.. ఆమె బీజేపీలో చేరారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి జగదీశ్‌ షెట్టర్ బెల్గాం నుంచి పోటీ చేయనున్నారు. కలకత్తా హైకోర్టు మాజీ న్యాయమూర్తి అభిజిత్ గంగోపాధ్యాయ పశ్చిమ బెంగాల్‌లోని తమ్లుక్ టికెట్‌ కేటాయించింది.

Latest News