విధాత: సందీప్ కిషన్ హీరోగా 2017లో వచ్చిన చిత్రం ‘మా నగరం’. ఈ చిత్రం ద్వారా లోకేష్ కనకరాజు దర్శకునిగా పరిచయం అయ్యాడు. ఆ తరువాత కార్తీ హీరోగా ‘ఖైదీ’ అనే బ్లాక్‌బస్టర్ మూవీ తీశాడు. వెంటనే తమిళ దళపతి విజయ్, విజయ్ సేతుపతిలతో ‘మాస్టర్’ మూవీ తెరకెక్కించాడు. తాజాగా కమలహాసన్, విజయ్ సేతుపతిలతో ‘విక్రమ్’ అనే మూవీ తీసి సంచలనాలు సృష్టించాడు.
ఇలా కేవలం కొన్ని చిత్రాలతోనే సంచలనంగా మారాడు లోకేష్ కనకరాజు. తమిళ దర్శకుడే అయినా.. అతడి పేరు తెలుగు సహా బాలీవుడ్‌లో కూడా మారుమోగుతుంది. నిజం చెప్పాలంటే ప్రభాస్, విజయ్, కమలహాసన్‌లకి వచ్చినంత ఫాలోయింగ్ ఈ దర్శకుడికి అతి కొద్ది సమయంలో వచ్చిందంటే అతిశయోక్తి కాదేమో…!
లోకేష్ కనకరాజుకి ‘ఖైదీ’, ‘విక్రమ్’ వంటి చిత్రాలు కల్ట్ ఫాలోయింగ్ తీసుకొచ్చాయి. దర్శకుడిగా ఆయన ఏ రేంజ్‌లో ఉన్నాడంటే ఆయన హీరోల చుట్టూ పరిగెత్తకుండా.. హీరోలే ఆయన చుట్టూ పరిగెత్తుతున్నారు. టాలీవుడ్, బాలీవుడ్ హీరోలు సైతం సినిమాలు చేయడానికి రెడీ అంటున్నారు. ఎంత కాలమైనా వెయిట్ చేసేందుకు సిద్ధం అంటున్నారు.
కానీ ఆయన చేయలేని స్థితిలో ఉన్నాడు. దాదాపు 10 ఏళ్ల కాలం పాటు ఆయన పక్కా ప్లాన్‌తో బిజీగా ఉన్నాడు. విజయ్‌తో 67వ సినిమా చేస్తున్నాడు. అలాగే ఖైదీ 2, విక్రమ్ 2, సూర్యతో ఓ చిత్రం చేయనున్నాడు. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ ఫార్మేట్ లో సినిమాలు చేయనున్నాడు.
హాలీవుడ్ మార్వెల్ సిరీస్ తరహాలో ఆయనకు యూనిక్‌నెస్ ఉంది. ఇక విక్రమ్ విషయానికి వస్తే కమల్ గతంలో చేసిన అప్పులన్నింటినీ ఈ చిత్రం తీర్చేసింది. ఇక్కడ విక్రమ్ సినిమా గురించి కాస్త చెప్పుకోవాలి. కమల్ హాసన్ హీరోగా ‘విక్రమ్’ మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.
చాలా కాలం తర్వాత కాదు కాదు.. ఎంతో కాలం తర్వాత కమలహాసన్ విక్రమ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ సినిమా ఏకంగా 400 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. ఈ మూవీలో హీరో సూర్య పాత్రని లోకేష్ కనకరాజ్ ఎలివేట్ చేసిన తీరు ఫ్యాన్స్‌తో పాటు సినీ లవర్స్‌ని కూడా సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది.
రోలెక్స్ అంటూ డ్రగ్ మాఫియా కింగ్ పిన్‌గా సూర్య నటించిన తీరు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచింది. అసలు రోలెక్స్ పూర్వాపరాలు ఏమిటి? రోలెక్స్‌గా ఆయన ఎలా మారాడు? అనే అంశాలతో ఈ చిత్రం రూపొందనుంది. దాంతో ఈ పాత్ర ప్రధానంగా దర్శకుడు లోకేష్ కనకరాజు పూర్తిస్థాయి చిత్రానికి శ్రీకారం చుట్టబోతున్నాడు.
విజయ్ 67, విక్రమ్ సీక్వెల్, ఖైదీ సీక్వెల్ పాటు రోలెక్స్ మూవీ ఉండనుందని తెలుస్తుంది. పరిస్థితులను బట్టి సినిమాలు అటు ఇటు కావచ్చు. వచ్చే పదేళ్ల వరకు నేను సెటిల్ అయ్యానంటూ నవ్వేస్తున్నాడు లోకేష్ కనకరాజ్!