Site icon vidhaatha

Madhuri Dixit | లోక్‌సభ ఎన్నికల బరిలో మాధురి దీక్షిత్‌..! రాజకీయరంగ ప్రవేశంపై కీలక వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్‌ నటి..!

Madhuri Dixit | బాలీవుడ్‌ నటి, డ్యాన్స్‌ క్వీన్‌గా ప్రేక్షకుల్లో చెరగని ముద్రవేసిన హీరోయిన్‌ మాధురీ దీక్షిత్‌. తనదైన నటనతో ఎందరో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన నటి రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో బరిలోకి దిగనుందని ప్రచారం జరిగింది. అయితే, ఈ వార్తలపై నటి స్పందించింది. దీంతో ఎన్నికల్లో పోటీ చేయనున్నారనే ఊహాగాలకు తెరపడినట్లయ్యింది. ఎన్నికల్లో పోటీ చేయనున్నారనే వార్తలను మాధురి తిరస్కరించింది. తనకు రాజకీయాలపై ఏమాత్రం ఆసక్తి లేదని స్పష్టం చేసింది ధక్ ధక్ గర్ల్‌. మాధురి ఓ మరాఠీ న్యూస్‌ ఛానెల్‌తో మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీ చేయాలనేది నా కోరిక కాదని.. ఇది ఇతరుల కోరిక అని పేర్కొంది. ప్రతి ఎన్నికల సమయంలో నేను ఎన్నికల్లో పోటీ చేస్తానని ఎక్కడి నుంచో వార్తలు వస్తుంటాయని.. కానీ రాజకీయాలు నాకు నచ్చవన్నారు. ప్రస్తుతం ‘పంచక్‌’ సినిమాపైనే దృష్టి ఉందని.. వచ్చే ఏడాది 2024 విడుదలకానుందని తెలిపారు. ఈ సినిమా హిట్‌ అయితే సినిమాల్లో పని చేయాలనే ఉత్సాహం అలాగే ఉంటుందన్నారు.

అలాగే తాను ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన పనులు చేయాలనుకుంటున్నానని పేర్కొంది. ఇదిలా ఉండగా.. మాధురీ దీక్షిత్‌ ప్రస్తుతం సినిమాలతో పాటు యాడ్స్‌లోనూ నటిస్తున్నది. పలు కార్యక్రమాలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నది. అయితే, మాధురీ 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తారని వార్తలు వచ్చాయి. బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారనే వార్తలు వైరల్‌ అయ్యాయి. ఈ క్రమంలోనే ముంబయి లోక్‌సభ నియోజకవర్గంలో మాధురి బ్యానర్లు వెలిశాయి. బీజేపీ ప్రస్తుత ఎంపీ పూనమ్ మహాజన్ స్థానంలో మాధురీ దీక్షిత్ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారని ప్రచారం జరిగింది. అంతకు ముందు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా మాధురి దీక్షిత్‌ ఇంటికి వెళ్లి కలిశారు. ఈ సందర్భంగా మోదీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులకు సంబంధించిన బుక్‌లెట్‌ను నటికి అందించగా.. బీజేపీలో చేరుతారనే ప్రచారం జరిగింది. తన రాజకీయ ప్రవేశంపై మాధురి క్లారిటీ ఇవ్వడంతో ఊహాగానాలకు తెరపడినట్లయ్యింది.

Exit mobile version