Site icon vidhaatha

Nalgonda: మహిళా సంక్షేమానికి కేంద్రం పెద్దపీట: BJP మహిళా మోర్చా జాతీయ కార్యదర్శి పద్మజామీనన్

విధాత: ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం శిశు బాలిక మహిళా సంక్షేమానికి పెద్ద పీట వేసి పని చేస్తుందని మహిళా మోర్చా జాతీయ కార్యదర్శి పద్మజా మీనన్ అన్నారు. నల్లగొండ జిల్లాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా మొదటి రోజు నల్లగొండ పట్టణ మహిళా మోర్చా ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో నడుస్తున్న అంగన్వాడీ కేంద్రాల్లో పర్యటించారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జాతీయ పోషకాహార మిషన్(పోషణ అభియాన్) పథకం క్రింద గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు, 0-6 సంవత్సరాల పిల్లలు, కౌమార బాలికలు, పాలిచ్చే తల్లులకు అందుతున్న పోషకాహార పంపిణీ తీరును పరిశీలించారు. పోషకాహార పంపిణీ ద్వారా స్త్రీ శిశు ఆరోగ్య సంరక్షణ చర్యలను మెరుగు పరచాలని అంగన్వాడీ టీచర్లకు ఆమె సూచించారు.

ఆశావర్కర్ల సెంటర్లు సందర్శించి కోవిడ్ సమయంలో వారి సేవలు మరువలేనివని వారిని కొనియాడారు. అంగన్వాడీలోని పిల్లలకు బాలింతలకు సరియైన సమయంలో టీకా వేయాలని వారిని కోరారు. అనంతరం పట్టణ ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమంలో భాగంగా సంక్షేమ హాస్టల్స్ లోని అమ్మాయిలను కలిసి చదువు పూర్తి అయిన అమ్మాయిలకు ఉన్నత విద్యను అభ్యసించడానికి ప్రధాన మంత్రి పథకాలను వివరిస్తూ వాటిని ఉపయోగించుకోవాలని అమ్మాయిలకు సూచించారు. సమభావన పొదుపు సంఘాల సభ్యులను కలిసి, ప్రధాన మంత్రి జీవన జ్యోతి భీమా యోజన పథకం గురించి, ముద్రా రుణాల గురించి వారితో ముచ్చటించారు.

కార్యక్రమంలో వారి వెంట బీజేపీ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి, మహిళా మోర్చ జిల్లా ఇన్‌చార్జి బండారి శైలజ, జిల్లా మహిళా మోర్చ ప్రభారి నిమ్మల రాజశేఖరరెడ్డి, జిల్లా అధ్యక్షురాలు కొండేటి సరిత, పట్టణ అధ్యక్షురాలు నేవర్సు నీరజ, నాగార్జున సాగర్ ఇన్‌చార్జి నివేదితా రెడ్డి, జిల్లా, పట్టణ పార్టీ పెద్దలు, సీనియర్ నాయకులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Exit mobile version