Site icon vidhaatha

Mallikarjun Kharge | సైన్యంలో ఖాళీల భర్తీ ఏది?: మల్లికార్జున ఖర్గే

Mallikarjun Kharge

న్యూఢిల్లీ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ప్రతిపక్ష పార్టీలను చీల్చేందుకు సమయం ఉంది కానీ.. సాయుధ దళాల్లో ఖాళీల భర్తీకి మాత్రం సమయం చిక్కడం లేదని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. సాయుధ దళాలు, కేంద్ర ప్రభుత్వ సాయుధ పోలీసు దళాల్లో ప్రస్తుతం 2 లక్షల ఖాళీలు ఉన్నాయని ఆయన చెప్పారు. ఆర్మీలో మేజర్‌, కెప్టెన్‌ స్థాయి అధికారుల పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయని తెలిపారు.

ఈ మేరకు పత్రికల్లో వచ్చిన ఒక వార్తను ఖర్గే తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయకపోవడమే కాకుండా.. యూనిట్‌లలో కొరతను అధిగమించేందుకు వివిధ కేంద్ర కార్యాలయాల్లో స్టాఫ్‌ ఆఫీసర్ల నియామకాలను తగ్గించేందుకు కేంద్రం ప్రణాళికలు వేస్తున్నదని ఆ వార్త పేర్కొంటున్నది.


అటువంటి పోస్టుల్లో రీ-ఎంప్లాయిడ్‌ ఆఫీసర్లను నియమించే ఉద్దేశంలో ఉన్నదని ఆ కథనం పేర్కొంటున్నది. ‘రాజకీయ పార్టీలను చీల్చేందుకు మోదీ ప్రభుత్వానికి కావల్సినంత సమయం ఉన్నది. కానీ.. సాయుధ దళాల్లో పోస్టుల భర్తీకి మాత్రం లేదు. ప్రతిరోజూ ‘జాతీయ వాదం’ అనే బాకా ఊదుకునే వారు మన సాయుధ దళాలను మాత్రం మోసం చేశారు’ అని ఖర్గే విమర్శించారు.

అగ్నిపథ్‌ పథకాన్ని ప్రస్తావించిన ఖర్గే.. మోదీ ప్రభుత్వం వద్ద దేశ సైనికుల కోసం నిధులు లేవన్న విషయాన్ని ఈ పథకం స్పష్టంగా వెల్లడిస్తున్నదని పేర్కొన్నారు. దేశ రక్షణ సమాజాన్ని మోదీ ప్రభుత్వం మోసం చేసిందని ఆయన ఆరోపించారు. జాతీయ భద్రత బీజేపీకి జాతీయ ప్రాధాన్యం కాదన్న ఖర్గే.. ప్రజల తీర్పును మోసం చేయడమే దాని ప్రాధాన్యమని విమర్శించారు

Exit mobile version