Site icon vidhaatha

గోబీ మంచురియా తిన‌లేద‌ని అమ్మ‌మ్మను చంపిన మ‌నుమ‌డు

విధాత : గోబీ మంచురియా తిన‌డం లేద‌ని ఓ యువ‌కుడు త‌న అమ్మ‌మ్మ‌ను చంపేశాడు. ఈ ఘ‌ట‌న 6 ఏండ్ల క్రితం బెంగ‌ళూరులో చోటు చేసుకోగా, ఆల‌స్యంగా వెలుగు చూసింది. అమ్మ‌మ్మ‌ను చంపిన మ‌నుమ‌డిని, స‌హ‌క‌రించిన అత‌ని త‌ల్లి, స్నేహితుడిని పోలీసులు ఇటీవ‌లే అరెస్టు చేశారు.

వివ‌రాల్లోకి వెళ్తే.. సంజ‌య్ వాసుదేవ్ రావు(27) త‌న త‌ల్లి శ‌శిక‌ళ‌, అమ్మమ్మ శాంత‌కుమారితో క‌లిసి బెంగ‌ళూరులోని కెంగెరి శాటిలైట్ టౌన్‌లో నివాస‌ముంటున్నాడు. అయితే సంజ‌య్ ప్ర‌తి రోజు ఇంటికి గోబి మంచురియా పాకెట్లు తీసుకొచ్చేవాడు. ఆ మంచురియా తినేందుకు శాంత‌కుమారి ఇష్ట‌ప‌డేది కాదు. ఈ విష‌యంలో అమ్మమ్మ‌, మ‌నుమ‌డి మ‌ధ్య ప‌లు సార్లు గొడ‌వ‌లు చోటు చేసుకునేవి. 2016, ఆగ‌స్టులో కోపంతో అమ్మ‌మ్మ‌ను చంపేశాడు. ఇక ఇంటి పక్క‌నే ఉన్న ఖాళీ స్థ‌లంలో శ‌శిక‌ళ‌, స్నేహితుడు నందీశ్ స‌హాయంతో శ‌వాన్ని పూడ్చిపెట్టారు. ఎవ‌రికీ అనుమానం రాకుండా ఆ స‌మాధిపై బొగ్గు, సిమెంట్ వేశారు.

ఇలా వెలుగులోకి..

2017, ఫిబ్ర‌వ‌రిలో శశిక‌ళ‌, సంజ‌య్ ఆ గ‌దిని ఖాళీ చేసి, మ‌హారాష్ట్ర‌లోని కోల్హాపూర్‌కు వెళ్లారు. ఈ క్ర‌మంలో ఇంటిని ఆధునీక‌రించాల‌ని ఓన‌ర్ నిర్ణ‌యించాడు. దీంతో ఆ ప‌రిస‌రాల‌ను శుభ్రం చేస్తుండ‌గా, స‌మాధి ఉన్న‌ట్లు గుర్తించాడు. పోలీసుల‌కు స‌మాచారం అందించాడు. శ‌వాన్ని వెలికితీశారు. ఇక అనుమానంతో నందీశ్‌ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించారు. బ్యాంకు కేవైసీ స‌హాయంతో శ‌శిక‌ళ‌, సంజ‌య్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంజ‌య్ ఏరోనాటిక‌ల్ ఇంజినీరింగ్‌ను మ‌ధ్య‌లోనే వ‌దిలేసి హోట‌ల్‌లో వెయిట‌ర్‌గా ప‌ని చేస్తున్న‌ట్లు పోలీసులు పేర్కొన్నారు.

Exit mobile version