Site icon vidhaatha

Maoist Party | గద్దర్ మృతి కలచివేసింది: మావోయిస్టు పార్టీ

Maoist Party

విధాత బ్యూరో, కరీంనగర్: గద్దర్ మరణం పార్టీని తీవ్రంగా బాధించిందని సీపీఐ మావోయిస్టు పార్టీ సంతాపం వ్యక్తం చేసింది. గుండెకు ఆపరేషన్ ఫెయిల్ అయి మృతి చెందినట్లు మీడియా ద్వారా విన్నామని, తన మరణం రాష్ట్ర ప్రజలందరికి ఆవేదనను కలిగించిందని, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నామని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికారప్రతినిధి జగన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

గద్దర్ అంటేనే దేశంలో తెలియని వారు ఉండరని, నక్సల్బరీ, శ్రీకాకుళం పోరాటాల ప్రేరణతో, తెలంగాణలో ప్రారంభమైన భూస్వామ్య వ్యతిరేక ఉద్యమాలవైపు ప్రజలను చైతన్యం చేసే దిశగా ఆయన పాటలు, నాటికలు, బుర్రకథలు, ఒగ్గు కథల ద్వారా గట్టి ప్రయత్నం చేశారన్నారు. తద్వారా ఆర్ట్ లవర్స్ గా ఏర్పడిన సాంస్కృతిక బృందం, 1972 లో జననాట్యమండలిగా మార్పు చెందిందన్నారు.

దీని ఏర్పాటు వెనుక గద్దర్ కృషి ఉందన్నారు.1972నుంచి 2012వరకు మావోయిస్టు పార్టీ సభ్యుడిగా గద్దర్ విప్లవోద్యమ ప్రస్థానం సాగిందన్నారు. విప్లవోద్యమ నిర్మాణానికి ఆయన చేసిన కృషి అమోఘం అన్నారు. జననాట్యమండలి ద్వారా సాహిత్యాన్ని పాటలు, కథలు నాటకాల రూపకంగా అందించి భూస్వామ్య వ్యతిరేక పోరాటాల వైపు ప్రజలను కదిలించడంలో కీలక పాత్ర పోషించారని చెప్పారు. అనేక పాఠలు రచించాడన్నారు.

ఏఎల్ఆర్ఎస్ కార్యకర్తగా, 1980లో నాలుగేళ్లు అజ్ఞాత కార్యకర్తగా తమ పార్టీలో గద్దర్‌ పనిచేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. సాంస్కృతిక రంగ ఆవశ్యకతను గుర్తించిన పార్టీ నాయకత్వం ఆయనను బయటకు పంపి జననాట్యమండలి అభివృద్ధి బాధ్యతలు అప్పగించిందన్నారు. తెలంగాణ ప్రజాస్వామిక ఉద్యమాల్లో, తొలి, మలిదశ తెలంగాణ ఉద్యమాలలో ఆయన క్రియాశీలకంగా పని చేశారని, తెలంగాణ ప్రజా ఫ్రంట్ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారని గుర్తు చేశారు.

ఎన్ కౌంటర్లలో, బూటకపు ఎన్ కౌంటర్లలో మరణించిన విప్లవకారుల మృతదేహాలను వారి కుటుంబీకులకు అప్పగించకుండా ప్రభుత్వాలు వ్యవహరించిన సందర్భాలలో, ఆ మృతదేహాల స్వాధీన ఉద్యమాలకు ఆయన నాయకత్వం వహించారని చెప్పారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విప్లవోద్యమ నిర్మూలన కోసం విప్లవ ప్రతిఘాతక శక్తులతో నల్లదండు ముఠాలు ఏర్పాటయ్యాయని, ఈ ముఠాల ద్వారా ప్రజా సంఘాలలో కీలకపాత్ర పోషిస్తున్న వారిని అంతమొందించేందుకు కుట్రలు జరిగాయన్నారు.

1997 లో నల్ల దండు ముఠా జరిపిన కాల్పుల్లో, గద్దర్ శరీరంలోకి 5 తూటాలు దూసుకు వెళ్లినప్పటికీ ఆయన ప్రాణాలతో బయటపడ్డారని చెప్పారు. తెలంగాణలో ఉన్నత స్థాయిలో కొనసాగుతున్నవర్గ పోరాటంలో ఎంతో మంది విప్లవ ప్రజానికాన్ని, యువతను జననాట్య మండలి పాటలతో ఉర్రూతలూగించిన ఘనత గద్దర్ కు దక్కుతుందన్నారు.

గద్దర్ చివరి కాలంలో పార్టీ నిబంధనావళికి విరుద్ధంగా పాలక పార్టీలతో కలవడంతో మా పార్టీ షోకాజ్ నోటీస్ ఇచ్చిందని, దీంతో 2012లో గద్దర్ మా పార్టీకి రాజీనామా చేశారని, ఆయన రాజీనామాను తమ పార్టీ ఆమోదించిందన్నారు. 2012 వరకు పీడిత ప్రజల పక్షాన నిలిచిన గద్దర్ ఆ తరువాత బూర్జువా పార్లమెంట్ మార్గాన్ని ఎంచుకున్నారన్నారు

Exit mobile version