విధాత, నిజామాబాద్: కామారెడ్డి మున్సిపల్ మాస్టర్ ప్లాన్ పై అనుమానాలు, అపోహలు పెట్టుకోవద్దని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ రైతులకు విజ్ఞప్తి చేశారు. ఇది ఫైనల్ కాదని నొక్కి చెప్పారు. ఇది మార్చుకునే అవకాశం ఉందన్నారు. ఈ మాస్టర్ ప్లాన్ ముసాయిదా మాత్రమేనని, దీనిపై అభ్యంతరాలను స్వీకరించనున్నట్లు చెప్పారు.
మాస్టర్ ప్లాన్ మార్చే అవకాశం ఉందని కలెక్టర్ చెప్పకనే చెప్పారు. రైతులు భూమి హక్కులను కోల్పోలేదన్నారు. భూ సేకరణ చేయడం లేదన్నారు. 2000 సంవత్సరంలోనే మాస్టర్ ప్లాన్ తయారైందని, అందులో ఇండస్ట్రియల్ జోన్ లో వున్న భూములు ఇప్పటికి రైతులు సాగు చేసుకుంటున్నారని, వారికి రైతుబంధు కింద డబ్బులు వస్తున్నాయని కలెక్టర్ చెప్పారు.
కామారెడ్డి మున్సిపల్ పరిధిలో 61.5 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో మాస్టర్ ప్లాన్ రూపొందించడం జరిగిందన్నారు. ఈ నెల 11వ తేదీ వరకు అభ్యంతరాలకు అవకాశం ఉందని, అవసరమైతే పొడిగించు కోవచ్చన్నారు. ఇప్పటి వరకు 1026 అభ్యంతరాలు వచ్చాయన్నారు. దీనిపై రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దన్నారు.