Site icon vidhaatha

ప్రతి ఎకరాకు 10 నుంచి 15వేల పంట న‌ష్ట‌ పరిహారం


విధాత: అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి జూపల్లి కృష్ణారావు హామీ ఇచ్చారు. కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం అంతంపల్లి, జంగంపల్లి, దోమకొండ మండలం లింగుపల్లి గ్రామాల్లో అకాల వర్షాలతో నష్టపోయిన పంట పొలాలను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీతో కలిసి మంత్రి జూపల్లి పరిశీలించారు. అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలకు ప్రతి ఎకరాకు రూ.10వేల నుంచి 15వేల వరకు పరిహారం ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు.


రైతులకు తమ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని చెప్పారు. నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని భరోసానిచ్చారు. రైతుభరోసా(రైతుబంధు) డబ్బులు ఇప్పటికే దఫాల వారిగా 58.6 లక్షల మంది రైతులకు అందిందని, వచ్చే వారం రోజుల్లో మిగిలిన రైతులకు కూడా అందుతుందన్నారు. పదేళ్లు పాలించిన బీఆరెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి, ఖజానాను ఖాళీ చేసి ప్రాజెక్టులు, భూ దందాలు, అక్రమ వ్యాపారాలతో దోపిడికి పాల్పడిందని విమర్శించారు.


బీఆరెస్ చేసిన తప్పులను ఒక్కోటి సవరిస్తు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తు ముందుకెలుతున్నామన్నారు. బీఆరెస్ పాలకులు అధికారం కోల్పోయి అసహనంతో వంద రోజుల కాంగ్రెస్ పాలనపై అప్పుడే విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. చివరకు బీఆరెస్‌ పాలనా కాలంలోని గత వర్షాకాలంలో వర్షాలు పడక కరవు ఏర్పడితే కరవును కూడా కాంగ్రెస్‌పై నెట్టేసే విమర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. పదేళ్లు పాలించిన బారాస.. రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసిందన్నారు.

Exit mobile version