విధాత: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రధాని మోదీ, బండి సంజయ్‌పై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. గట్టిగా మాట్లాడిన వారిపై సీబీఐ, ఈడీ, ఐటీ దాడులు చేయిస్తున్నారు. మోదీ, బోడీ, నీ ఈడీ మా వెంట్రుక కూడా పీకలేరు. ఏం చేసుకుంటవో చేసుకోపో. చావనైనా చస్తాం.. నీకు మాత్రం లొంగిపోయే ప్రసక్తే లేదు అని కేటీఆర్ తేల్చిచెప్పారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన టీఆర్ఎస్‌వీ విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు.
తప్పు చేయనోళ్లు ఎవరికీ భయపడరని కేటీఆర్ స్పష్టం చేశారు. అవినీతి ఆరోపణలు మోదీ మీదనే వచ్చాయన్నారు. శ్రీలంక దేశంలో అక్కడి ప్రభుత్వ పెద్దలు, విద్యుత్ రంగ సంస్థ అధిపతి.. మోదీ మీదనే ఆరోపణలు చేసిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. అదానీకి రూ.6 వేల కోట్ల కాంట్రాక్ట్ ఇవ్వాలని ఒత్తిడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. మోదీకి నీతి, సిగ్గు, మానం ఉంటే దాని మీద వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
దేశం ఒక వైపు పేదరికంలోకి పోతోంది. నిరుద్యోగం పతాక స్థాయికి చేరిందని కేటీఆర్ అన్నారు. నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటాయి. 8 ఏండ్లలో మోదీ చేసిందేమీ లేదు. పేదలున్న దేశంగా భారత్ మారింది. ధనవంతులే ధనవంతులుగా మారిపోతున్నారు. ఒక అదానీ, రాజగోపాల్ రెడ్డి ధనవంతులైతే ఈ దేశ ప్రజల భాగ్య రేఖలు మారిపోతాయా? అని కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు.
మన తెలంగాణ మోడల్‌ను దేశానికి చూపేందుకే భారత్ రాష్ట్ర సమితి అని పెడుతున్నాం.. బరాబర్ పరిచయం చేస్తాం. గుజరాత్ మోడల్‌తో దేశాన్ని గోల్‌మాల్ చేసినప్పుడు, బ్రహ్మాండంగా పని చేస్తూ, పేదవారికి అండగా ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి, భారత్ రాష్ట్ర సమితి ఎందుకు కావొద్దు. ఇక్కడ ఎవరెవరో రాజకీయం చేయొచ్చు. కానీ తెలంగాణ వారు బయటకు వెళ్లి రాజకీయం చేయొద్దా? తెలంగాణకు చేసినట్లే.. దేశంలోని ఇతర ప్రాంతాలకు విస్తరిద్దాం. బలంగా గులాబీ జెండాను ఇతర ప్రాంతాల్లో నాటుదాం అని కేటీఆర్ పేర్కొన్నారు.