విధాత, వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రత్యేక ప్రతినిధి: మైనర్ బాలికలే లక్ష్యంగా కామాంధులు రెచ్చి పోతున్నారు మైనర్ బాలికలు సంఘటన జరిగినా బయట పెట్టరనే భరోసాను నమ్మించి మోసం చేయడానికి సులభంగా ఉంటుందని భావిస్తున్న దుర్మార్గులు ముక్కుపచ్చలారని చిన్నారులు బాలికల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. పైశాచిక అత్యాచారాలకు, లైంగిక వేధింపులు, దాడులకు పాల్పడుతున్నారు. మహిళలు, యవతులు అంటే ఆటబొమ్మగా భావిస్తున్నారు.
వరంగల్ నగరంలో..
వరంగల్ నగరంలో గురువారం వెలుగు చూసిన దళిత మైనర్ బాలికపై ఇద్దరు అన్నదమ్ములు అత్యాచారం జరిపిన ఘటన మరువక ముందే జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్‌లో ఓ మైనర్ బాలికపై యువకుడు అత్యాచారయత్నం చేసిన సంఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరుసగా మైనర్ బాలికల పై జరిగిన అత్యాచారం, అత్యాచారయత్నం ఘటనలు ఆందోళనరేకిస్తున్నాయి.
వరంగల్ నగరంలోని దయానంద కాలనీకి చెందిన దళిత మైనర్ బాలిక పైన సమీపంలో నివాసం ఉంటున్న మైనారిటీ మతానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు గత కొంతకాలంగా వరుస అత్యాచారానికి పాల్పడుతున్నారు. బాలికను బెదిరించి తమ కామవాంఛను తీర్చుకుంటున్నారు. దాదాపు 6 నెలల కాలంగా ఈ అత్యాచారం సాగుతున్నట్లు సమాచారం.
అయితే గురువారం బాలికను అన్నదమ్ముల్లోని ఒకరు బలవంతంగా చేయబట్టి లాగుతుండడం గమనించిన బాధిత బాలిక తల్లి తన బిడ్డను మందలించడంతో గత కొంతకాలంగా గుట్టుగా సాగుతున్న ఈ అత్యాచార వ్యవహారం తెలుగులోకి వచ్చింది. బాధిత బాలికకు నిందితులు తరచూ మెసేజ్ చేసే వారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఈ సంఘటన బీజేపీ వర్గాలు, హిందూ సంఘాలకు తెలియడంతో గురువారం దయానంద్ కాలనీ వద్ద రాస్తారోకో నిర్వహించి నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
నిరసనలు.. ఆందోళన
ఈ సందర్భంగా నిందిత కుటుంబానికి చెందిన వాహనాలను ధ్వంసం చేశారు. రాస్తారోకో, దాడి సమాచారం తెలుసుకున్న పోలీసులు వరంగల్ ఎసిపి కలకోట గిరిధర్ ఆధ్వర్యంలో ఆందోళనకారులను అరెస్టు చేశారు. బాలిక ప్రియా అత్యాచారానికి ఒడిగట్టిన నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని, చట్టపరంగా ఇప్పటికే విచారణ ప్రారంభించామని ప్రకటించారు. ఇదిలా ఉండగా బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు నిందితులు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.
ఈరోజు రేపు నిందితులను కోర్టు ముందు హాజరు పరిచే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అయితే నిందితులకు కొందరు రాజకీయ నాయకులు లోపాయికారి మద్దతు అందిస్తున్నట్లు ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సంఘటన రాజకీయ, మతపరమైన రంగు పులుముకుంటున్నది. దయానందకాలనీ సంఘటన మరువకముందే జనగామ జిల్లా స్టేషన్‌ఘనపూర్ మండలంలో మరో ఘటన వెలుగు చూడడం గమనార్హం.
బీజేపీ నాయకులపై కేసు.. అరెస్టు
దయానంద్ కాలనీలో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం చేసిన నిందితులను అరెస్టు చేయాలని బీజేపీ నాయకులు నిరసన తెలిపి, వాహనాలు ధ్వంసం చేసినందుకు శుక్రవారం అర్ధరాత్రి అరెస్టు చేసి జైలుకు పంపారు. వరంగల్ తూర్పు బీజేపీ నాయకుడు కుసుమ సతీష్‌బాబుతో పాటు పలువురిపై కేసు నమోదు చేసి జైలుకు పంపారు.
అన్యాయాన్ని ప్రశ్నిస్తే అర్ధరాత్రులు అరెస్టులు చేస్తారా అంటూ బీజేపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఆందోళన చేసి ప్రశ్నిస్తే అర్ధరాత్రి బందిపోటు దొంగల్లా అరెస్టు చేయడం అప్రజాస్వామికమంటున్నారు. నిందితుల అరెస్టు చూపకుండా బాధిత కుటుంబం పై బెదిరింపుకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కొందరు పోలీసు అధికారులు దోషులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ధ్వంసమైన వాహనాలెవరివో ప్రకటించాలని కోరుతున్నారు.
హనుమకొండలో యువతిపై..
ఇటీవల హన్మకొండలోని ప్రైవేటు హాస్టల్లో ఉంటున్న యువతిపై అత్యాచారయత్నం చేసిన సంఘటనలో ఒక ఎమ్మెల్యే ప్రైవేట్ పీఏతో పాటు అతని స్నేహితులు ఉన్న విషయం సంచలనం సృష్టించింది. హాస్టల్ నిర్వాహకురాలి సహకారంతో యువతిపై అఘాయిత్యానికి ఒడిగట్టేఃదుకు ప్రయత్నించారు.
ఈ వ్యవహారంలో ఎమ్మెల్యేపై ప్రత్యర్థి పార్టీల నుంచి తీవ్ర విమర్శలు, ఆరోపణలు వ్యక్తమయ్యాయి. ఆ మధ్య హైదరాబాదులో మైనర్ బాలికను పబ్బుకు తీసుకెళ్లి అక్కడ నుంచి సామూహిక అత్యాచారం చేసిన సంఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలోనూ పలువురు రాజకీయ ప్రజాప్రతినిధుల కుమారులు ఉండటం చర్చనీయాశంగా మారింది.
రాఘవాపూర్‌లో..
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం రాఘవపూర్‌లో మైనర్ బాలిక (1౦) పై ఓ యువకుడు అత్యాచారయత్నం చేశాడు.ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు స్థానిక స్టేషన్లో కేసు నమోదు చేశారు. బాలిక రెండుమూడు రోజులుగా ముభావంగా ఉండటంతో అనుమానమొచ్చిన తల్లిదండ్రులు ప్రశ్నించడంతో ఈ ఘట వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు మండలంలోని సముద్రాలకు చెందిన పులి రజనీ కుమార్ (33)ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
బాలికలకు అండ అవసరం..
చిన్న వయసులో అందులో మైనర్లపై కామాంధులు జరుపుతున్న లైంగిక దాడులతో ఆడబిడ్డల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తమవుతుంది. సమాజంలో రోజురోజుకు పెరిగిపోతున్న నేర ప్రవృత్తికి ఇది నిదర్శనమని పలువురు పేర్కొంటున్నారు. పతనమవుతున్న విలువలు,దిగజారుతున్న సంస్కృతి వల్ల ఈ సంఘటనలు జరుగుతున్నట్లు భావిస్తున్నారు. ప్రధానంగా బాలికలకు చిన్నప్పటి నుంచి తమ పట్ల జరిగే వేధింపులు, అత్యాచారాల పట్ల అవగాహనతోపాటు పాటించాల్సిన కనీస జాగ్రత్తలు తెలియజేయాలని చెబుతున్నారు. ఈ విషయంలో తల్లిదండ్రులు, విద్యాలయాలు శ్రద్ధ వహించాలని కోరుతున్నారు.
సమాజంలో పేట్రేగుతున్న హింస ప్రవృత్తికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ముఖ్యంగా ముక్కుపచ్చలారని వయసులో అత్యాచారానికి గురవుతున్న బాలికల పట్ల సానుభూతితో వ్యవహరించాలని, ఈ ఘటనలకు పాల్పడుతున్న నిందితులను కఠినంగా శిక్షించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
కేసు విచారణలో వేగం పెంచి నిందితులకు తగిన శిక్ష విధించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటే కొంత మేరకైన ఫలితాలు ఉంటాయని భావిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వం, పోలీసులు, ప్రజా ప్రతినిధులు కనబరిచే హడావుడిని చిత్తశుద్ధిని ఆచరణాత్మకంగా నిరూపించుకోవాలని మహిళా సంఘాల ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.