Chennamaneni Ramesh
- భూ కబ్జాదారుల పట్ల జాగ్రత్త
- ప్రజల ఆస్తులు కబ్జా చేయాలని చూస్తే ఊరుకోను
- టికెట్ కేటాయింపు పార్టీ నిర్ణయం, అయితే నా ప్రణాళిక నాకుంది
- వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు
విధాత బ్యూరో, కరీంనగర్: వేములవాడ శాసనసభ్యుడు చెన్నమనేని రమేష్ బాబు పార్టీలో జరుగుతున్న పరిణామాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ పార్టీలో దొంగలు ఉన్నారని ఆయన సంచలన ఆరోపణ చేశారు. రైతులకు ఉచిత విద్యుత్తుపై కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా వేములవాడ పట్టణం లోని మూలవాగు బ్రిడ్జి వద్ద పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఇక్కడి నుండి పార్టీ టికెట్ ఆశిస్తున్న ఏనుగు మనోహర్ రెడ్డి, చలిమెడ లక్ష్మీ నరసింహారావు వర్గీయులు కూడా ఈ ధర్నాలో పాల్గొన్నారు.
ఎమ్మెల్యే రమేష్ బాబు హాట్ కామెంట్స్
పార్టీలో కొంత మంది అటు, ఇటు మాట్లాడుతున్నారు. అవన్నీ నాకు తెలియనివి కావు.. ఎమ్మెల్యే ఉన్నా లేకున్నా.. పర్వాలేదు ఇప్పటికే నాలుగు సార్లు గెలిచా చాలు. పదవులపై వ్యామోహం లేదు. ఎప్పుడైనా నేను ప్రజల్లో గెలిచి నట్టే. కానీ ఒక్కటి చెబుతున్న ఇక్కడ ప్రజల ఆస్తులు కబ్జా చేస్తే మాత్రం ఊరుకోను, ఖబడ్దార్ అంటూ తన వ్యతిరేకవర్గాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేకెత్తించాయి.
నేను శాసనసభ్యునిగా లేకుండా పోతే జాగాలు కబ్జాలు చేయాలని చూస్తారని జాగ్రత్త గా ఉండాలని ప్రజలకు సూచించారు. పార్టీ టికెట్ నా చేతుల్లో లేదు. టికెట్ ఇచ్చే నిర్ణయం పార్టీ చేతుల్లో ఉంది. అయినా నా ప్రణాళిక నాకుందన్నారు. నియోజకవర్గం ప్రజల సంక్షేమం కోసం అనునిత్యం వారి వెంటే ఉంటానని, ఇదే విషయాన్ని ముఖ్యమంత్రికి కూడా చెప్పానన్నారు.
అయితే.. కొంతమంది నేతలు నన్ను పక్కకు నెట్టాలని చూస్తున్నారు. రమేష్ బాబుకు ఏం తెలువదని అనుకుంటున్నారు.. కానీ నా ముందు వాళ్లు లాగులు వేసుకున్న వాళ్ళే అన్నారు. తాను వెళ్ళిపోతే మంచివారిని రానివ్వచ్చని, దొంగలను రానివ్వద్దని కార్యకర్తలకు సూచించారు. తన దగ్గర రెండు మాటలు ఉండవన్నారు.