MLC Alugubelli Narsi Reddy
విధాత: గురుకుల ఉపాధ్యాయుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని గురుకుల ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న మూడు దశల పోరాట కార్యక్రమాలలో భాగంగా నల్లగొండ జిల్లా కేంద్రం క్లాక్‌టవర్ సెంటర్ వద్ద నల్లగొండ జిల్లా గురుకులాల ఉపాధ్యాయుల జిల్లా కన్వీనర్ జి. రాంబాబు గారి అధ్యక్షతన జరిగిన నిరసన దీక్ష నిర్వహించారు. దీక్షలకు ఎమ్మెల్సీ నర్సిరెడ్డి సంఘీభావం తెలిపి మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్రంలో గురుకుల విద్యాసంస్థలు నాణ్యమైన విద్యకు విజయవంతమైన నమూనాగా ఉన్నాయని, ఈ విజయాల వెనుక గురుకులాల ఉపాధ్యాయుల శ్రమ, అంకితభావం ఎంతో ఉందని తెలియజేసారు. అయినా ఉపాధ్యాయులకు శ్రమకు తగిన వేతనం గానీ, కష్టానికి తగిన గుర్తింపు లభించడం లేదన్నారు. గురుకులాల అన్ని సొసైటీలలో ఏకరూప పరిపాలన అమలు చేయాలని, అన్ని సొసైటీల బోధన సమయాన్ని ఒకే విధంగా ఉండేలా మార్చాలని, అన్ని గురుకులాల్లో బదిలీలు- పదోన్నతులు వెంటనే చేపట్టాలని, కేర్ టేకర్, డిప్యూటీ వార్డెన్ లను ప్రత్యేకంగా నియమించాలని డిమాండ్ చేశారు.
ఉపాధ్యాయులను నైట్ డ్యూటీ ల నుంచి మినహాయించి, కాంట్రాక్టు, గెస్ట్, పార్ట్ టైం, ఔట్‌సోర్సింగ్ ఉపాధ్యాయులకు బేసిక్ పే, 12 నెలల వేతనం కల్పించాలని, సిఆర్టి ల సర్వీస్ రెగ్యులర్ చేయాలని, అన్ని గురుకుల విద్యాలయాలకు శాశ్వత భవనాలు, స్టాఫ్ క్వార్టర్స్ నిర్మించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శులు ఎం. రాజశేఖర్ రెడ్డి, జి. నాగమణి, జిల్లా అధ్యక్షులు ఎడ్ల సైదులు , ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ళ వెంకటేశం, కోశాధికారి నర్రా శేఖర్ రెడ్డి, గురుకులాల నుండి రాధా, శివ, శశిధర్, జ్యోతి బాబు, సంజయ్ కుమార్, మధు, నాగరాజు, ఉపేందర్, సునీల్, వెంకట్, ప్రసాద్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.