- కమ్యూనిస్టు మ్యానిఫెస్టో విడుదలై 178 ఏండ్లు…
Communist Manifesto | 1848 ఫిబ్రవరి 21న విడుదలై.. ప్రపంచంలో సంచలనం రేపిన 23 పేజీల కరపత్రం. అది విప్లవాలకు నిర్వచనం చెప్పింది. ఉద్యమాలకు స్ఫూర్తినిచ్చింది. ఒక దశలో మూడో వంతు భాభాగాన్ని ఎర్రపూల వనంగా మార్చింది. ఈ ప్రపంచం ఏకధృవ ప్రపంచంగా మారి పెట్టుబడిదారీ విధానం పెత్తనం చెలాయిస్తున్న వేళ.. ప్రత్యమ్నాయ వెలుగుదివిటీగా రగిలి…. కొత్త ప్రపంచంపై ఆశలు రేకెత్తించింది. అధికారంలో ఉన్న శక్తుల వెన్నుల్లో వణుకు పుట్టించింది. విశేషం ఏమిటంటే.. నేటి సామ్రాజ్యవాద శక్తులకు ఇప్పటికీ పీడకలగానే తయారైంది. ఒక్క కమ్యూనిస్టు మిగిలినా కష్టమేనని పాలకులే చెప్పుకొనేలా భయపెడుతోంది. అదే కమ్యూనిస్టు మ్యానిఫెస్టో!
కార్ల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఎంగెల్స్ ఈ కమ్యూనిస్టు మ్యానిఫెస్టో రాసే సమయానికి ఐరోపా ఖండం మొత్తం కీలక అంచున నిలిచి ఉంది. పారిశ్రామిక విప్లవం.. అనేక నగరాలను పరిశ్రమల కుప్పగా మార్చేసింది. నగరాలను పొగ, ధూళి దట్టంగా కమ్మేశాయి. ఒక అసంతృప్తికర వాతావరణం. ప్రజల్లో రాజకీయ అసంతృప్తి లోలోన రగులుతుంటే.. మార్పు కోసం గళమెత్తే కంఠాలు.. రోజు రోజుకు బలంగా మారుతున్నాయి. ఈ పరిస్థితులను, పరిణామాలను మార్క్స్, ఎంగెల్స్ గమనిస్తూ ఉన్నారు.. ఎదురు చూస్తూ ఉన్నారు… రాస్తూ ఉన్నారు!
కమ్యూనిస్టు పార్టీ మ్యానిఫెస్టో లేదా కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక.. అనేది ఒక ఔత్సాహిక రాజకీయ గ్రూపు అయిన కమ్యూనిస్ట్ లీగ్ మదిలో మెదిలిన అంశం. ఇదేమీ శూన్యం నుంచి వచ్చిపడింది కాదు. ఈ మ్యానిఫెస్టో ఉత్సాహభరితమైన.. వేగంగా మారుతున్న కాలంలో బయటకు వచ్చింది. కొద్దవారాలకే యూరప్ ఖండం అంతటా విప్లవ జ్వాలలు వ్యాపించబోతున్న వేళ.. దానిని లండన్‌లో ప్రచురించారు. మార్క్స్ తన కచ్చితమైన విశ్లేషణా దృష్టితో, ప్రవాహంలా సాగిపోయే పద ప్రయోగాలతో ఒక గ్రంథాన్ని రూపొందించాడు. అది కొంత చరిత్ర.. కొంత భవిష్యత్‌వాణి. కానీ.. మొత్తంగా చూస్తే.. పూర్తిగా విప్లవాత్మక పాఠంగా నిలిచింది. అదేమీ సమాజాన్ని నిశ్చలంగా గమనించిన వ్యాఖ్యానం మాత్రమే కాదు.. అది పోరాటానికి ఇచ్చిన పిలుపు.
కమ్యూనిస్టు మ్యానిఫెస్టో ఒక నిర్మాణాత్మక వాదనలను వ్యక్తపరుస్తుంది. అది మొత్తంగా నాలుగు భాగాలుగా ఉంటుంది. మొదటిది అత్యంత ప్రముఖమైనది.. ‘బూర్జువాలు, కార్మికవర్గం’. ‘ఇప్పటి వరకూ ఉన్న సమాజాల చరిత్ర మొత్తం వర్గపోరాటాల చరిత్రే’నని ఇది తేల్చి చెబుతుంది. చారిత్రక భౌతికవాద సిద్ధాంతాన్ని సమగ్రం వివరిస్తూ.. ‘ఆర్థిక శక్తులే సామాజిక మార్పులకు ప్రధాన కారణం’ అని సూత్రీకరిస్తుంది. రెండో భాగంలో కార్మికులు, కమ్యూనిస్టులు. ఇందులో కార్మికోద్యమంలో కమ్యూనిస్టుల ప్రత్యేక పాత్ర ఏంటో వివరిస్తారు. మూడో భాగం అప్పటి సోషలిస్టు సాహిత్యంపై విమర్శనాత్మకంగా ఉంటుంది. నాలుగో భాగం.. ‘ప్రపంచ కార్మికులారా ఏకం కండి.. పోరాడితే పోయేదేమీ లేదు.. బానిస సంకెళ్లు తప్ప’ అనే మరణం లేని నినాదంతో ముగుస్తుంది.
నిజానికి మార్క్స్, ఎంగెల్స్ రాసింది ప్రస్తుత వ్యవస్థకు నేరుగా విసిరిన సవాల్. వర్గపోరాటాల కథే చరిత్ర అని, పెట్టుబడిదారీ విధానం ఎన్ని ఆవిష్కరణలు చేసినప్పటికీ.. అది చరిత్రలో శాశ్వతం కాదని, చరిత్రలోని ఇతర వ్యవస్థల తరహాలోనే ఒక దశలో అది కూడా కూలిపోక తప్పదని కుండబద్దలు కొట్టారు.
పెట్టుబడిదారీ వర్గం.. అంటే పరిశ్రమల యజమానులు.. ఒక కొత్త ప్రపంచాన్ని నిర్మించారు. కానీ.. ఆ ప్రపంచంలో కార్మికులు.. ఒక భారీ లాభాల యంత్రంలో చిన్న విడిభాగాలుగా మారిపోయారు. లాభాల కోసం నడిచే వ్యవస్థలో వారి జీవితం విలువను కోల్పోయింది. దీనికి పరిష్కరమేంటి? విప్లవం!! ఉత్పత్తిసాధనాలు అన్నీ అందరి ఉమ్మడి సొత్తుగా ఉండాలి. కార్మికులే తమ భవిష్యత్తును నిర్ణయించుకోవాలి. దోపిడీ సంకెళ్లు తెగిపోవాలి. ఇదే కమ్యూనిస్టు మ్యానిఫెస్టో చూపిన దారి. అయితే.. దీనిపై మిశ్రమ స్పందనలు వచ్చాయి. కొందరు దీన్ని కలగా అభివర్ణించారు. వాస్తవిక ప్రపంచాన్ని అర్థం చేసుకోలేని, ఊహా ప్రపంచాల్లో తిరిగేవారి కల్పనలంటూ మరికొందరు కొట్టిపడేశారు. కానీ… కొందరు మాత్రం ఈ సిద్ధాంతం తీవ్రతను అర్థం చేసుకున్నారు. శతాబ్దాలుగా తాము నిర్మించుకున్న వ్యవస్థలకు పెనుసవాలు ఎదురవుతుందని గుర్తించారు.
అదే సమయంలో ఈ పుస్తకాన్ని చదివిన కార్మికులకు తాము రహస్య సమావేశాల్లో, అంతర్గతంగా చెప్పుకొన్న మాటలు ప్రతిధ్వనించినట్టయింది. తాము ఎదుర్కొంటున్న కష్టాల గురించి, వాటి పరిష్కారం గురించి ఎవరో మాట్లాడుతున్నట్టే తోచింది. తమ కష్టాలకు, కన్నీళ్లకు కారణం అంటూ ఒకటుందని, అది యాదృచ్ఛికం కాదని వారికి అర్థమైంది.
కమ్యూనిస్టు మ్యానిఫెస్టో వచ్చీ రావడంతోనే దుమ్మురేపింది. యూరప్‌లో రగిలిపోయింది. పుస్తకం వెలువడిన కొద్దివారాలకే ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. 1848 విప్లవాలు.. ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రియా దాటి విస్తరించాయి. శ్రీశ్రీ అన్నట్టుగా.. ‘గుత్తపెత్తందారీ వర్గదుర్గాదుల్’ దద్దరిల్లిపోయాయి. రాజులు బెదిరిపోయారు. ప్రజలు వీధుల్లోకి వచ్చారు. రోడ్లపై బారికేడ్లు మొలిచాయి. అయితే.. మొత్తంగా ఈ తిరుగుబాట్లకు మ్యానిఫెస్టోనే కారణం కాకపోయినా.. అసతృప్తజీవులకు, అణగారిన వర్గాలకు అది ఒక భాషను ఇచ్చింది. తిరుగుబాట్లకు ఒక దిశ చూపే దివిటీలా వెలిగింది.
కమ్యూనిస్టు మ్యానిఫెస్టో రాసే సమయానికి కార్ల్ మార్క్స్ 29 ఏళ్ల జర్నలిస్టు, తత్వవేత్త, ఆర్థిక శాస్త్రవేత్త. పెద్ద పేరు ప్రఖ్యాతులు ఉన్న ఆలోచనాపరుడేమీ కాదు. తాను నమ్మిన అభిప్రాయాలపై గట్టిగా నిలబడేవాడు. ఆయనను ఆర్థిక సమస్యలు నిత్యం వెంటాడుతుండేవి. ఆయన సహ రచయిత ఎంగెల్స్ విషయానికి వస్తే.. పూర్తి భిన్నం. ఎంగెల్స్… కార్మికవర్గం అంటే కనీస ప్రేమ లేని ధనిక పారిశ్రామికవేత్త కుటుంబంలో పుట్టాడు. ఆ ఇద్దరి అపూర్వ కలయిక ఒక అసాధారణ స్నేహ జంటను ఈ ప్రపంచానికి పరిచయం చేసింది. ఇద్దరి నమ్మకం ఒక్కటే.. పెట్టుబడిదారీ విధానం అనేది శాశ్వతం కాదు.. ఏదో ఒక రోజు అది అంతరించడం ఖాయం! దాని స్థానంలో మరో సమాజం ఆవిర్భవించడం తథ్యం. ఇదే కాలక్రమం. ఇదే నమ్మకంతో వారిద్దరూ నడిచారు.. చదివారు.. శోధించారు.. రాశారు.. సిద్ధాంతాలు తయారు చేశారు… మార్క్సిస్టు మహోపాధ్యులై బోధించారు! ప్రజల్లో, కార్మికుల్లో వర్గ చైతన్యాన్ని పెంచారు. అంతర్జాతీయ కార్మికవర్గానికి భావి ప్రపంచంపై అచంచలమైన నమ్మకాన్ని రగిలించారు.
అందులోనూ కార్ల్ మార్క్స్ రచనలు.. ఏదో ఏది ఎందుకు మొదలైందో అర్థం కాని.. థీసిస్ రాస్తున్నట్టు ఉండేవి కావు.. ఆయన పదాలు దుష్ట సమాజంపై కోపాన్ని వెళ్లగక్కుతాయి. సమసమాజంపై నమ్మకాన్ని బలోపేతం చేస్తాయి. ఆయన ప్రపంచాన్ని నిర్వచించలేదు.. ఇప్పటికి చాలా మంది నిర్వచించారు.. ఇక చేయాల్సింది దాన్ని మార్చడమేనని ఎలుగెత్తాడు.
సుమారు ఒకటిన్నర శతాబ్దాల తర్వాత కూడా కమ్యూనిస్టు మ్యానిఫెస్టో.. ప్రపంచంలో అత్యంత ఎక్కువగా చదివే రాజకీయ రచనల్లో ఒకటిగా నిలిచిపోయింది. దానిపై అనేక చర్చోపర్చలు సాగాయి.. అనేకసార్లు నిషేధానికి గురైంది.. మళ్లీ కొత్త అర్థాలతో, పునరుక్తులతో మళ్లీ మళ్లీ ప్రచురితమైంది. ఇప్పటికీ ప్రచురణలకు నోచుకుంటూనే ఉన్నది. 20వ శతాబ్దంలో ఎన్నో విప్లవాలు, ప్రభుత్వాలు, ఆర్థిక వ్యవస్థలపై అది ప్రభావం చూపింది. కొన్నింటిని మార్క్స్ కూడా ఊహించలేదో అన్నంతగా! ఆ సిద్ధాంతంపైనే లెనిన్ కమ్యూనిస్టు రష్యాను నిర్మించాడు. తూర్పు యూరప్ దేశాల్లో కొన్ని దశాబ్దాలు ఎర్రబావుటాలు ఎగిరాయి. చైనాను మావో ప్రగతిబాటలో దుంకించాడు. వియత్నాం, క్యూబా, ఉత్తర కొరియా, లావోస్.. ఎర్రజెండా నీడకు చేరాయి. కమ్యూనిస్టు ప్రభుత్వాలు కాకపోయినా.. ఆ భావజాలంతో ప్రభావితమై.. బొలీవియా, నికారాగ్వా వంటి దేశాల్లో ప్రజారంజక పాలన కొనసాగుతున్నది. తాజాగా శ్రీలంకలో ప్రజలు కమ్యూనిస్టులకే అధికారం అప్పగించారు.
ఇప్పుడు 21వ శతాబ్దంలో ఉన్నాం. ఈ ప్రపంచాన్ని కార్పొరేట్ శక్తులు, ఆర్థిక సంక్షోభాలు, సంపద అసమానతలు ముంచెత్తి ఉన్నాయి. ఈ సమయంలో కూడా కమ్యూనిస్టు మ్యానిఫెస్టో లేవనెత్తిన ప్రశ్నలు ఇంకా సమకాలీనతను కలిగి ఉండటమే ప్రత్యేకత. ధనికస్వామ్యానికి, కార్మికవర్గానికి మధ్య ఘర్షణ, వైరుధ్యాలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. కార్మిక హక్కులు, అసమానతలు, ఆర్థిక విధానాలపై చోటు చేసుకుంటున్న చర్చల వెనుక ఇంకా మార్క్స్ ఆలోచనలే ప్రతిధ్వనిస్తున్నాయి. కొందరు దాన్ని మార్గదర్శకంగా చూస్తే.. మరికొందరు దాన్నొక హెచ్చరికగానే ఇంకా పరిగణిస్తున్నారు. కానీ.. ఒక విషయం మాత్రం స్పష్టం.. ఆ ఆలోచనను మాత్రం ఎవ్వరూ మర్చిపోలేరు. ఎందుకంటే.. ఒకసారి బయటకు వచ్చిన ఆలోచనను పూర్తిగా అదుపులో పెట్టడం అసాధ్యం! అందుకు నిదర్శనంగా నిలిచింది.. నిలుస్తూనే ఉంటుంది.. కమ్యూనిస్టు మ్యానిఫెస్టో!! ఎందుకంటే.. పెట్టుబడిదారీ, సామ్రాజ్యవాద విధానాల అంతు చూసే ‘కమ్యూనిస్టు పిశాచాన్ని’ పట్టి దాచడం ఏ గుత్తశక్తికీ సాధ్యం కాదు.. కాబోదు! ఒకటి మాత్రం సత్యం. మార్పు తథ్యం.. మార్పు నిత్యం. కమ్యూనిస్టు సిద్ధాంతం అజేయం. అజరామరం.
