బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి కాంగ్రెస్, బీజేపీలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇంకో సంవత్సరం కష్టపడితే చాలు.. మనల్ని సతాయించిన కాంగ్రెస్, బీజేపీకి మిత్తితో సహా తిరిగి ఇచ్చే బాధ్యత నాదంటూ కేటీఆర్ హెచ్చరించారు. ముషీరాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఆధ్వర్యంలో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై కేటీఆర్ మాట్లాడారు. రాష్ట్రంలో త్వరలోనే ప్రారంభం కానున్న “ఎస్.ఐ.ఆర్” ప్రక్రియపై సమగ్రంగా చర్చించి, క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ అనుసరించాల్సిన వ్యూహాలపై కేటీఆర్ దిశానిర్దేశం చేశారు.
గెలిపించిన గ్రామాలే..కాంగ్రెస్ ను దించేస్తాయ్
ఏ గ్రామాలైతే గెలిపించినయో.. ఏ జిల్లాలైతే గతంలో పొరపాటున కాంగ్రెస్ పార్టీకి ఓటేసిర్రో… వాళ్లంతా ఇవ్వాళ తిరుగుబాటు మూడ్‌లో ఉన్నరని కేటీఆర్ స్పష్టంచేశారు. ఎన్నికలు ఎప్పుడొస్తయా.. కాంగ్రెస్ పార్టీని ఎప్పుడెప్పుడు తరిమి కొడదామా..?అని ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి వడ్లు కొంటలేడు..రైతు బంధు వేస్తలేడు.యూరియా ఇస్తలేడు. కరెంట్ సక్కగ ఇస్తలేడు. చెప్పలేని గోస అంతా గ్రామాల్లో ఉన్నదని..హైదరాబాద్‌లో మీరిట్లే భద్రంగా ఉండండి. మళ్లా మీరెట్లాగో గులాబీ కండువాను గెలిపిస్తరనే నమ్మకముంది. ఈ సారి తిరుగుబాటు గ్రామాల నుంచి మొదలవుతదన్నారు..
కాంగ్రెస్ వస్తే రైతు బంధు బందయితదని కేసీఆర్ అంటున్నారని.. మేమేమన్నా దివానాగాళ్లమా.. మాకు ధిమాక్ లేదా ’ అని అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి మాట్లాడిండని, మరి ఈ రోజు నేను అడుగుతున్నానని… నువ్వొచ్చి రెండున్నరేళ్లు అయ్యిందని.. నాలుగుసార్లు రైతు బంధు ఎగ్గొట్టినవ్.. మరి ఏమనాలే నిన్ను దివానాగాడు అంటే తప్పయిదా.. ధిమాక్ లేనండంటే తప్పయితదా..? అనికేటీఆర్ ప్రశ్నించారు. నేను తిట్టిన తిట్ల కంటే ఎక్కువగానే.. రేవంత్ రెడ్డిని గ్రామాల్లో తిడుతున్నారని, ఎక్కడనన్నా దొరికితే తన్నేటట్టే ఉన్నారని కేటీఆర్ అన్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ,బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్.ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.