తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు, గౌరవం కోసం కె. కేశవరావు అధ్యక్షతన ఏర్పాటైన ప్రత్యేక కమిటీ శనివారం తొలిసారి సమావేశమైంది. జూన్ 4న అఖిలపక్షం నిర్వహించి అమరవీరులను, ఉద్యమంలో పాల్గొన్న వారందరినీ గుర్తించి గౌరవించేందుకు కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించింది. కేకే అధ్యక్షతన కమిటీ సభ్యులు మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్, ఎమ్మెల్సీ ఎం.కోదండరామ్, మాజీ ఎమ్మెల్సీ ఎస్.రాములు నాయక్, మోతే శోభన్ రెడ్డి, సంబంధిత ఉన్నతాధికారులతో జరిపిన ఈ సమావేశంలో విధి విధానాలు, ఉద్యమకారుల సమాచార సేకరణ తదితర అంశాలపై చర్చించారు.
తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమంలో పాల్గొని త్యాగాలు చేసిన నిజమైన ఉద్యమకారులను గుర్తించి, వారికి ప్రభుత్వ పరంగా లభించాల్సిన గౌరవం, సంక్షేమ పథకాలు,ఇతర సదుపాయాలపై ఈ కమిటీ ప్రభుత్వానికి సిఫార్సులు చేయనుంది. ఉద్యమకారుల గుర్తింపు ప్రమాణాలు, జైలు శిక్షలు అనుభవించిన వారు, పలు పోలీస్ కేసుల నమోదు, ఉద్యమంలో పాల్గొన్న మేధావులు, కళాకారులు, రచయితలు, ఉద్యోగులు, జర్నలిస్టులు, అడ్వకేట్‍లు, విద్యార్థులు, ఆర్టిసీ కార్మికులు, సింగరేణి కార్మికులు, వారందరిని గుర్తించి, సముచితంగా గౌరవించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి సిక్తా పట్నాయక్, హోం శాఖ ముఖ్యకార్యదర్శి శిఖా గోయల్, జి.ఎ.డి కార్యదర్శి రఘునందన్ రావు, జి.ఎ.డి ప్రోటోకాల్ డైరెక్టర్ హరీష్, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ నర్సింహా రెడ్డి, న్యాయ శాఖ కార్యదర్శి పాపి రెడ్డి, తదితర అధికారులు పాల్గొన్నారు.