Adilabad | ST రిజర్డ్వ్ ‘సిట్టింగ్’లకు స్థాన చలనం.. ముగ్గురు కొత్తవారికి కేటాయింపు

Adilabad | 5 జనరల్, 2 ఎస్సీ స్థానాలు పదిలం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ ఎన్నికల వ్యూహం టికెట్ రాని సిట్టింగ్ లకు హామీలు, బుజ్జగింపులు భవిష్యత్తులో న్యాయం జరిగేనా? విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: బీఆర్ఎస్ లో నెల రోజుల నుండి పోటాపోటీగా టికెట్ కోసం ప్రయత్నాలు కొనసాగించిన సిటింగ్, ఆశావహుల ఆశలకు సోమవారంతో తెరపడింది. సిటింగ్ స్థానాల్లో ఎమ్మెల్యేలు, ఆశావహులు నువ్వా నేనా అంటూ టికెట్ కోసం పోటీపడి ప్రచారం చేసుకున్నారు. ప్రజల్లోనూ […]

  • Publish Date - August 21, 2023 / 11:54 AM IST

Adilabad |

  • 5 జనరల్, 2 ఎస్సీ స్థానాలు పదిలం
  • ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ ఎన్నికల వ్యూహం
  • టికెట్ రాని సిట్టింగ్ లకు హామీలు, బుజ్జగింపులు
  • భవిష్యత్తులో న్యాయం జరిగేనా?

విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: బీఆర్ఎస్ లో నెల రోజుల నుండి పోటాపోటీగా టికెట్ కోసం ప్రయత్నాలు కొనసాగించిన సిటింగ్, ఆశావహుల ఆశలకు సోమవారంతో తెరపడింది. సిటింగ్ స్థానాల్లో ఎమ్మెల్యేలు, ఆశావహులు నువ్వా నేనా అంటూ టికెట్ కోసం పోటీపడి ప్రచారం చేసుకున్నారు. ప్రజల్లోనూ మమేకమయ్యారు. టికెట్ నాకే వస్తుంది.. ఓట్లు వేయాలని అడిగారు. ఎట్టకేలకు సోషల్ మీడియా జాబితాల ఊహగానాలకు తెరపడింది.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మూడు నియోజకవర్గాలకు మినహా, ఏడు నియోజకవర్గాల్లో సిటింగ్ స్థానాలను వారికే కేటాయించారు. అందరూ ఊహించినట్టే సిర్పూర్ నియోజకవర్గం సిటింగ్ ఎమ్మెల్యే కోనేరు కోనప్పకు టికెట్ దక్కింది. చెన్నూర్ నియోజవర్గం సిటింగ్ ఎమ్మెల్యే బాల్క సుమన్ కే కేటాయించారు. బెల్లంపల్లి నియోజకవర్గం సిటింగ్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై అనేక ఆరోపణలు ఉన్నాయి.

అయినా బీఆర్ఎస్ అధిష్టానం వాటిని సైతం పక్కనపెట్టింది. మూడోసారి ముచ్చటగా ఆయనకే టికెట్ కేటాయించారు. మంచిర్యాల నియోజకవర్గం సిటింగ్ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావుకు మూడోసారి టికెట్ కేటాయించారు. నిర్మల్ నియోజకవర్గం సిటింగ్ ఎమ్మెల్యే అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కే టికెట్ వరించింది. ఐకే రెడ్డి 2014లో బీఎస్పీ తరపున గెలిచి టీఆర్ఎస్ లో చేరి, ఆ పార్టీ తరపున రెండోసారి టికెట్ దక్కించుకున్నారు.

ఆదిలాబాద్.. జోగు రామన్నకే

ఆదిలాబాద్ నియోజకవర్గ సిటింగ్ ఎమ్మెల్యే జోగు రామన్నకే బీఆర్ఎస్ టికెట్ కేటాయించింది. జోగు రామన్న పార్టీ ఉద్యమకాలం నుండి పార్టీలోనే ఉన్నాడు. ఆయనకూ మూడోసారి టికెట్ వరించింది. ముధోల్ నియోజకవర్గ సిటింగ్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి టికెట్ పై కొంత సందేహలున్నా, ఎట్టకేలకు అధిష్టానం అతనికే టికెట్ కేటాయించింది.

ఆత్రం సక్కు కు చేజారింది..

అసిఫాబాద్ నియోజకవర్గ సిటింగ్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు కు పార్టీ టికెట్ నిరాకరించింది. ఆ స్థానంలో మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత జడ్పీ చైర్మన్ కోవలక్ష్మికి కేటాయించారు. ఆత్రం సక్కును పార్టీ అధిష్టానం పిలిపించి బుజ్జగించింది. భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉంటాయని, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఆదిలాబాద్ పార్లమెంటు స్థానం నుండి టికెట్ ఇస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం.

రేఖా నాయక్ కు షాక్

అందరూ ఊహించినట్లుగానే ఖానాపూర్ నియోజవర్గం సిటింగ్ ఎమ్మెల్యే రేఖా నాయక్ కు అధిష్టానం షాక్ ఇచ్చింది . రేఖా నాయక్ బీఆర్ఎస్ తరపున రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. మూడోసారి టికెట్ కోసం ప్రయత్నించినా నిరాశే మిగిలింది. ఆమె స్థానంలో కేటీఆర్ తో మంచి సంబంధాలున్న జాన్సన్ నాయక్ కు టికెట్ కేటాయించారు.

రాథోడ్ బాబురావుకూ అదేబాట

బోథ్ నియోజవర్గం సిటింగ్ ఎమ్మెల్యే రాథోడ్ బాబురావు కు అధిష్టానం టికెట్ నిరాకరించింది. ఆయన స్థానంలో నేరేడుకొండా జడ్సీటీపీ అనిల్ జాదవ్ కు టికెట్ కేటాయించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మూడు ఎస్టీ రిజర్వ్ స్థానాల్లో అభ్యర్థుల స్థాన చలనం జరిగింది. మిగతా స్థానాల్లో యథావిధిగా పాత సిటింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ కేటాయించారు. 15 రోజుల నుండి బీఆర్ఎస్ టికెట్ల కోసం సిటింగులు, ఆశావాహులు అన్ని ప్రయత్నాలు చేశారు. మూడు స్థానాల్లో ఆశావహులకు కలిసి వచ్చిందనే చెప్పవచ్చు.

ఊగిసలాటలో టికెట్ దక్కని సిటింగ్ లు

ఆసిఫాబాద్ నియోజవర్గంలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున గెలిచి, బీఆర్ఎస్ లో చేరిన ఆత్రం సక్కు… 2023 ఎన్నికల్లో టికెట్ హామీతోనే పార్టీలో చేరినట్లు సమాచారం. అయినప్పటికీ ఈసారి పార్టీ టికెట్ నిరాకరించింది. గత ఎన్నికల్లో ఆత్రం సక్కు చేతిలో ఓటమిపాలైన ప్రస్తుత జడ్పీ చైర్ పర్సన్ కోవ లక్ష్మీకి అవకాశం కల్పించారు. ఆత్రం సక్కును లోకసభ బరిలో నిలపడానికి రాష్ట్ర నాయకత్వం హామీ ఇచ్చినట్లు సమాచారం.

ఇదిలా ఉంటే తమ స్థానాల్లో తమకు కాకుండా కొత్తవారికి టికెట్ కేటాయించిన నేపథ్యంలో తమ పరిస్థితి ఏమిటన్న ఆందోళనలో టికెట్ రాని సిటింగులు ఉన్నట్లు తెలుస్తోంది. సిట్టింగులకు ప్రత్యామ్నాయంగా అధిష్టానం ఏదో ఒక దారి చూపుతుందన్న వాదనలు లేకపోలేదు. సిటింగ్ సీటు పోగొట్టుకొని భవిష్యత్తులో పార్టీ ఇచ్చిన హామీలు నెరవేరుస్తుందో లేదో అన్న ఊగిసలాటలో టికెట్ రాని సిట్టింగ్ లు ఆందోళనలో ఉన్నారు.

Latest News