విధాత: తెలుగు బుల్లితెరపై ‘వంటలక్క’గా ఎనలేని క్రేజ్‌ని సొంతం చేసుకున్న మలయాళ నటి ప్రేమి విశ్వనాథ్. ‘కార్తీకదీపం’ సీరియల్‌లో దీపగా, వంటలక్కగా నటించి బీభత్సమైన క్రేజ్‌ని ఆమె సొంతం చేసుకుంది. ఇంకా చెప్పాలంటే.. తెలుగు వారి ప్రతి ఇంటిలో భాగమయ్యేంతగా ఆమె ఆ సీరియల్‌తో పేరును సంపాదించుకుంది. దీప, డాక్టర్ బాబు గురించి సినిమాలలో కూడా కామెంట్స్ వస్తుంటాయి.
ఇక సోషల్ మీడియాలో అయితే చెప్పనవసరం లేదు. ఇంతకుముందు బాగా ఫేమస్ అయిన టిక్‌టాక్‌లో అయితే దీపక్క, డాక్టర్ బాబు అంటూ పలువురు వీడియోలు చేసి ఆ సీరియల్‌ని ట్రెండ్‌లో ఉంచారు. బుల్లి తెరపై తిరుగులేని హిట్టుగా ఆ సీరియల్ దూసుకుపోతుంది. ఇప్పుడు కాస్త సీరియల్‌పై క్రేజ్ తగ్గిందేమో కానీ.. వంటలక్కపై మాత్రం ఇంచు కూడా తగ్గలేదు.
ఆ క్రేజే ఇప్పుడామెను వెండితెర వైపు అడుగులు వేసేలా చేస్తోంది. ఇప్పుడామె టాలీవుడ్‌లోని ఓ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఆమె నటిస్తున్నట్లుగా చిత్రయూనిట్ కూడా అధికారికంగా ప్రకటించారు. ఇంతకీ ఆ హీరో ఎవరని అనుకుంటున్నారా?
ఆ హీరో మరెవరో కాదు.. అక్కినేని నాగచైతన్య. ఆయన హీరోగా.. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం ఇటీవలే సెట్స్ పైకి వెళ్ళింది. NC22 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మరోసారి చైతూ సరసన కృతి శెట్టి (బంగార్రాజు చిత్రంలో కలిసి నటించారు) కథానాయికగా కనిపించనుంది.
నాగచైతన్య కెరీర్‌లో అత్యంత భారీ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో అరవింద్ స్వామి, శరత్ కుమార్, ప్రియమణి వంటి వారితో పాటు ప్రేమి విశ్వనాథ్ కూడా ఓ కీలక పాత్రలో నటించబోతుందంటూ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
ఈ సినిమాకున్న మరో విశేషం ఏమిటంటే.. దిగ్గజ సంగీత దర్శకులైన తండ్రీ కొడుకులు ఇసైజ్ఞాని ఇళయరాజా, యువన్ శంకర్ రాజా కలిసి సంగీతం అందిస్తుండటం. ఇక వంటలక్క విషయానికి వస్తే.. బుల్లితెరపై సక్సెస్‌ఫుల్ నటిగా పేరు తెచ్చుకున్న ప్రేమి.. ఇప్పుడు తెలుగు వెండితెరపై ఎటువంటి గుర్తింపును సొంతం చేసుకుంటుందో చూడాలి. మరో విషయం ఏమిటంటే.. మలయాళంలో ఆమెకు ఇప్పటికే వెండితెర అనుభవం ఉంది.