ఇప్పుడెందుకు సీబీఐ విచారణ కోరడం లేదు: ఎంపీ లక్ష్మణ్

కాళేశ్వరం అక్రమాలపైన ఎన్నికలకు ముందు సీబీఐ విచారణకు డిమాండ్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడేందుకు కోరడం లేదని బీజేపీ రాజ్య సభ సభ్యుడు లక్ష్మణ్ ప్రశ్నించారు.

  • Publish Date - December 30, 2023 / 12:23 PM IST
  • కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై అనుమానాలు


విధాత: కాళేశ్వరం అక్రమాలపైన, మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపైన ఎన్నికలకు ముందు సీబీఐ విచారణకు డిమాండ్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడేందుకు సీబీఐ విచారణ కోరడం లేదని బీజేపీ రాజ్య సభ సభ్యుడు లక్ష్మణ్ ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో లక్ష్మణ్ మాట్లాడుతూ బీజేపీ చొరవతో కాళేశ్వరం ప్రాజెక్ట్ ను డ్యాం సేఫ్టీ అథారిటీ పరిశీలించి నివేదిక ఇచ్చిందన్నారు.


మేడిగడ్డ బ్యారేజ్ డిజైన్ లోపం ఉందని చెప్పిందన్నారు. పూర్తి వివరాలు ఇవ్వాలని అడిగితే గత ప్రభుత్వం ఇవ్వలేదన్నారు. బ్యారేజ్‌ను పూర్తిగా తొలగించాలని అభిప్రాయపడిందన్నారు. అప్పుడు సీబీఐ విచారణ చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారని, కేసీఆర్ అంటే కాళేశ్వరం చంద్రశేఖర్ రావు అన్నారన్నారు.


అధికారంలోకి వచ్చాకా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మేడిగడ్డ కుంగుబాటును చిన్నదిగా చూపే ప్రయత్నం చేస్తుందని, అసలు ఈ ప్రభుత్వం ఎవరిని అందుకు బాధ్యులుగా చేయాలని చూస్తుందో స్పష్టం చేయాలన్నారు. ఇప్పటి వరకు ఒక్క అధికారిపై చర్యలు తీసుకోకపోగా, వారితోనే పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఏర్పాటు చేశరని, ప్రభుత్వం తీరుపై అనేక అనుమానాలు వస్తున్నాయన్నారు.


జ్యూడిషియల్ విచారణ జరిపిస్తామన్న ప్రభుత్వం అందుకు చర్యలు తీసుకోకుండా, అసెంబ్లీ, మండలిలో అఖిల పక్షాన్ని మేడిగడ్డ వద్దకు తీసుకెలుతామని చేసిన ప్రకటనను విస్మరించి కేవలం మంత్రులు గుంపుగా వెళ్లి కాళేశ్వరం అవినీతి పుట్ట, వృధా ప్రాజెక్టు అని చెప్పడ వెనుక మతలబు ఏమిటని ప్రశ్నించారు.


కాళేశ్వరం సహా అనేక అవినీతి, కుటుంబ పాలనకు పాల్పడిన బీఆరెస్‌ను ప్రజలు శిక్షించారని, అయితే వాళ్లు తిన్న సొమ్ముని కక్కించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపైనే ఉందని లక్ష్మణ్ అన్నారు.అవినీతికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోకపోతే ప్రజల ముందు ఈ ప్రభుత్వం దోషిగా నిల్చోవాల్సి వస్తుందని లక్ష్మణ్ స్పష్టం చేశారు. కాళేశ్వరం సహా ఇప్పటిదాక కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను గమనిస్తే కేవలం బీఆరెస్‌ను రాజకీయంగా లొంగ తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా కనబడుతుందన్నారు.