సముద్రంలో ఒక లోతు తర్వాత ఏముందనది ఇప్పటికీ మిస్టరీ (Mysterious Eggs) నే. అతి శీతల జలాలు, శరీరాన్ని చిదిమేసే ఒత్తిడి ఉండే ఆ చీకటి ప్రదేశాల్లో పరిశోధనలు చేయడానికి శాస్త్రవేత్తలూ జంకుతారు. మన కంటికి కనపడని జలచరాలు, ప్రకృతి అద్భుతాలకు ఆ ప్రాంతాలు నెలవు. సాంకేతికత పెరిగేకొద్దీ కొద్ది కొద్దిగా సాగర గర్భంలోకి మనం ప్రవేశిస్తూ.. కొత్త కొత్త విషయాలను తెలుసుకుంటున్నాం. సముద్ర గర్భంలో ఉండే అననుకూల పరిస్థితులను తట్టుకుంటూ కూడా కొన్ని జీవులు మనుగడ సాధిస్తున్నాయి.
అలాంటి జీవులపై పరిశోధనలు (Study) చేయడమే ఈ అధ్యయనాల ఉద్దేశం. తాజాగా.. జపాన్ సమీపంలోని సముద్రంలో అత్యంత లోతైన కురిల్ కమచత్కా ట్రెంచ్‌లో 6,200 మీటర్ల లోతున నల్లగా ఉన్న కొన్ని గుడ్లను కనుగొన్నారు. యూనివర్సిటీ ఆఫ్ టోక్యోకు చెందిన డా.యసునోరి కనో.. రిమోట్ ఆపరేటెడ్ వెహికల్ (ఆర్ఓవీ)ని లోపలకు పంపి వాటిని బయటకు తీసుకొచ్చారు. ఆ ప్రదేశం కటిక చీకట్లో ఉన్నప్పటికీ సాంకేతికత సాయంతో ఆ గుడ్లను బయటకు తీసుకురావడం ద్వారా ఆయన సరికొత్త రికార్డును సృష్టించారు.
ఆ గుడ్లను పరిశీలించిన హోక్కాయ్‌డో యూనివర్సిటీ ప్రొఫెసర్ డా.కెయిచీ కకోయీ మాట్లాడుతూ.. ఇవి ఏకకణ జీవుల కుటుంబానికి చెందిన ప్రొటిస్ట్ తరహా జీవులు అయి ఉండొచ్చని తొలుత అభిప్రాయపడ్డారు. వీటిని పరిశీలించి చూడగా.. ఆ గుడ్లలో తెల్లని పాలలాంటి పదార్థం ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. దానిని బయటకు తీసి పరిశీలించగా.. అవి ఫ్లాట్‌వార్మ్స్ అనే సూక్ష్మజీవులని తేలింది. ఆ నల్లని పదార్థం వాటి చుట్టూ ఉన్న తొడుగు అని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఈ ఫలితాలు వారిని ఆశ్చర్యపోయేలా చేశాయి.
ఆ జీవులను పరిశీలించి.. ఇవి సముద్ర అంతరాళలో.. బాగా లోతున ఒంటరిగా తిరిగే పురుగుల్లాంటివని నిర్ధరించుకున్నారు. తీవ్ర ప్రతికూల పరిస్థితుల మధ్య జీవిస్తున్నప్పటికీ.. ఇవి సముద్ర ఉపరితలాల్లో నివసించే తమ కుటుంబంలోని ఇతర సూక్ష్మజీవుల లక్షణాలనే కలిగి ఉన్నాయని పరిశోధకులు పేర్కొన్నారు. కాబట్టి సముద్ర గర్భంలో జీవనానికి మానసికంగా దృఢత్వం అవసరమని అంతేకానీ దానికోసం ప్రత్యేకంగా పరిమాణ క్రమం చెందాల్సిన అవసరం లేదని ఈ అధ్యయనం అభిప్రాయపడింది. ఈ వివరాలు బయాలజీ లెటర్స్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.