AI Layoffs Truth | ఖర్చు తగ్గించుకునేందుకే లేఆఫ్‌లు.. అందుకు ‘ఏఐ ముసుగు’…

AI Layoffs Truth | ఇప్పుడు యావత్‌ ప్రపంచంలోని పెట్టుబడిదారీ వర్గాన్ని ఒక పిశాచం ఆవహించింది. ఆ పిశాచాన్ని చూపించి అనేక కంపెనీలు ఉద్యోగస్తులను తొలగిస్తున్నాయి. ఆ పిశాచం పేరుతో పెద్ద మొత్తంలో ఖర్చును పొదుపు చేసుకుంటున్నాయి. సంబంధం ఉన్నా లేకపోయినా.. పిశాచంతో ముడిపెట్టేసి.. లాభాలు పోగేసుకుంటున్నాయి. ఆ పిశాచం పేరు ఏఐ!!

AI Layoffs Truth | ఇప్పుడు యావత్‌ ప్రపంచంలోని పెట్టుబడిదారీ వర్గాన్ని ఒక పిశాచం ఆవహించింది. ఆ పిశాచాన్ని చూపించి అనేక కంపెనీలు ఉద్యోగస్తులను తొలగిస్తున్నాయి. ఆ పిశాచం పేరుతో పెద్ద మొత్తంలో ఖర్చును పొదుపు చేసుకుంటున్నాయి. సంబంధం ఉన్నా లేకపోయినా.. పిశాచంతో ముడిపెట్టేసి.. లాభాలు పోగేసుకుంటున్నాయి. ఆ పిశాచం పేరు ఏఐ!!

నిజమే.. ఏ కంపెనీ లేఆఫ్‌ ప్రకటించినా.. ఈ మధ్య ఏఐ పేరే ముందుకు తీసుకువస్తున్నారు. ఏఐ బూచిని చూపి.. ఉద్యోగాల్లో పెద్ద ఎత్తున కోతలు పెడుతున్నారు. ఇందుకు వారు అందంగా చెబుతున్న పేరు… ఏఐ ట్రాన్స్‌ఫర్మేషన్‌! నిజానికి ఇప్పటికే తొలగించిన చాలా ఉద్యోగాలకు కృత్రిమ మేధతో సంబంధం లేకపోయినా.. అదే పదాన్ని వాడేస్తున్నారు.

ఒక కంపెనీ ఉద్యోగులుకు ఉదయం ఆరు గంటల 47 నిమిషాలకు ఒక మెయిల్‌ వచ్చింది. కాఫీ కూడా తాగకముందే.. వందల మంది ఉద్యోగాలు కోల్పోయారు. అందులో పేర్కొన్న అంశం.. మీ పాత్రలు మా ఏఐ ట్రాన్స్‌ఫర్మేషన్ ప్రయాణంలో భాగంగా రీఇమాజిన్‌ చేయబడ్డాయి…! అది చదివిన ఉద్యోగులకు అర్థమైంది.. అది పదవి మార్పు కాదని.. ప్రమోషన్‌ అంతకంటే కాదని.. అది లేఆఫ్‌ నోటీసు అని!! అంతే.. దెబ్బకు 700 మంది ఉద్యోగాలు కోల్పోయారు.

కంపెనీ చెబుతున్న కారణం.. ఏఐ. కానీ.. వాస్తవానికి వారి పనుల్లో ఏ ఒక్కటీ ఏఐతో సంబంధం ఉన్నది కాదు. సెక్రటరీలు, మార్కెటింగ్‌ టీమ్‌, అడ్మిన్‌ స్టాఫ్‌, డీఎఫ్‌ఐ డిపార్ట్‌మెంట్‌.. వీటిల్లో ఎక్కడా మెషిన్‌ లెర్నింగ్‌ లేదు.. ఎక్కడా ఆటోమేషన్‌ లేదు.. అయినా.. ఏఐ పేరు చెప్పి.. వీరిని ఇంటికి పంపించేశారు. అదికూడా ఒక రెండక్షరాల పదం.. ‘ఏఐ’తో!

ఉద్యోగాల తొలగింపులో ఏఐ ముసుగును కంపెనీలు యథేచ్ఛగా వాడటం మొదలుపెడుతున్నాయన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఉద్యోగాల కోతలకు ఏఐ అనేది ఒక కొత్త మంత్రంలా మారిందని అంటున్నారు. మార్కెట్‌ పరిస్థితులు బాగోలేవు అంటే.. ప్రశ్నలు వస్తాయి.. ఖర్చు తగ్గించుకుంటాం.. అంటే ఉద్యోగస్తులు ఆగ్రహిస్తారు. స్టాక్‌ బైబ్యాక్‌ల కోసం కోతుల అంటే.. పెట్టుబడిదారులు అసహనం వ్యక్తం చేస్తారు. కానీ.. ఏఐ అంటే మాత్రం ఎవ్వరైనా తలూపాల్సిందే. అదో ప్రగతి భావన అనే ఫీలింగ్‌ కల్పిస్తారని.. కంపెనీ భవిష్యత్తువైపు పరుగులు తీస్తున్నదనే భ్రమల్లో ముంచేస్తారని ఉద్యోగ రంగ నిపుణులు చెబుతున్నారు. ఈ విధానాన్ని ఇప్పుడు ఇండస్ట్రీలో అందంగా.. AI Washing అని పిలుస్తున్నారు. అంటే.. కారణమేదైనా.. ఏఐ పేరుతో కథ మార్చేయడమే!

బేకర్‌ మెకన్జీ కథ ఇదే

గత వారం అంతర్జాతీయ లా ఫర్మ్‌.. మేకర్‌ మెకెన్జీ 700 మంది ఉద్యోగులను తొలగించింది. వారు చేసిన ప్రకటన ఇలా ఉంది… “rethinking the ways in which we work, including through our use of AI, introducing efficiencies.” అంతే.. తెల్లారి పత్రికల్లో లీగల్‌ ఇండస్ట్రీని మార్చివేస్తున్న ఏఐ… అంటూ హెడింగ్స్‌ వెల్లువెత్తాయి. కానీ.. వాస్తవాలను ఒకసారి పరిశీలిస్తే అసలు గుట్టు బయట పడింది. నిజానికి లీగల్‌ ఇండస్ట్రీని ఏఐ మార్చలేదు. ఆ కంపెనీ.. తన సెక్రటరీలను తొలగించింది. సెక్రటరీలకు ఏఐకి సంబంధం ఏంటన్నది మాత్రం అడగొద్దు!

లెక్కలు డొక్కలు చించుతాయి…
గణాంకాలను పరిశీలిస్తే ఏఐ ముసుగును ఎంతబాగా వాడుకుంటున్నారో తేలిపోతున్నది. 2025లో ఏఐ కారణం చెప్పి తొలగించిన ఉద్యోగస్తుల సంఖ్య సుమారు 55వేలు. అంటే.. 2023తో పోల్చితే 13 రెట్లు పెరుగుదల. అయితే.. ఫారెస్టర్‌ (Forrester) అనే పరిశోధన సంస్థ అంచనా ప్రకారం.. 2030 నాటికి పూర్తిగా ఆటోమేట్‌ అయ్యే ఉద్యోగాలు కేవలం ఆరు శాతమే. ఇదే 55వేల ఉద్యోగాలకు వర్తింప చేస్తే.. అందులో వాస్తవంగా ఏఐ పేరుతో తొలగించినవి ఆరు శాతం ఉద్యోగాలు మాత్రమే. ఇక్కడ అమెజాన్‌ సీఈవో ఆండి జెస్సీ మాటలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వర్క్‌ఫోర్స్‌ను తగ్గించుకోవడం నిజానికి ఏఐ కారణం కాదని, అదొక సంస్కృతి మాత్రమేనని ఆయన తేల్చి చెప్పారు. అంటే.. ఖర్చు తగ్గించుకోవడానికి చేసే తొలగింపులకు ఏఐ ముసుగు వేస్తున్నారని క్లియర్‌గా అర్థమవుతున్నది. మేం డబ్బు పొదుపు చేసుకోవడం కోసం మిమ్మల్ని తీసేశాం.. అనే కంటే.. ఏఐ ఆధారంగా ఆప్టిమైజేషన్‌ చేశాం.. అనడం స్టాక్‌మార్కెట్‌కు సైతం వీనుల విందుగా వినిపిస్తుందని విశ్లేషకులు అంటున్నారు. ఒక రకంగా ఏఐ అనే పదం.. మత్తుమందు లాంటిదని చెబుతున్నారు. ఇది వాడితే.. ఎవ్వరూ ఏమీ మాట్లాడలేరని పేర్కొంటున్నారు. నిజానికి ఏఐ ఉద్యోగాలను తీసేస్తున్నది అనడం కన్నా.. కంపెనీలు వాటి ఖర్చును తగ్గించుకునేందుకు ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న ఏఐ అనే పదాన్ని ఉపయోగించుకుంటున్నాయని సూత్రీకరిస్తున్నారు.

 

Latest News