క్యాన్సర్ వ్యాక్సిన్ సక్సెస్ ..రికార్డు స్థాయిలో అమెరికా కంపెనీ షేర్ ధర!

క్యాన్సర్ నివారణ వ్యాక్సిన్ రూపొందించిన అమెరికా బయోటెక్ దిగ్గజం మోడెర్నా కంపెనీ షేర్ ధర ఒకే రోజులో 177% పెరిగి సంచలనం రేపింది. స్టాక్ మార్కెట్ చరిత్రలోనే ఇది అత్యధిక పెరుగుదల అని, అలాగే కంపెనీ చరిత్రలోనే అతిపెద్ద ఒక్కరోజు లాభం అని కంపెనీ నివేదిక పేర్కొంది.

Reported by: Y.V. Narsimha Reddy | సైన్స్​ – టెక్నాలజీ | Aug 20, 2026, 12:50 pm IST
Read Time: 3 mins
క్యాన్సర్ వ్యాక్సిన్ సక్సెస్ ..రికార్డు స్థాయిలో అమెరికా కంపెనీ షేర్ ధర!

అమెరికాకు చెందిన ప్రముఖ బయోటెక్ కంపెనీ మోడెర్నా సంస్థ క్యాన్సర్ వ్యాక్సిన్లను అభివృద్ధి చేయడంతో సాధించిన విజయం ఆ కంపెనీ ఆర్థిక స్థాయిని నెక్ట్స్ లెవల్ కు తీసుకెళ్లింది. ప్రస్తుతం మోడెర్నా కంపెనీ షేర్ ధర ఒకే రోజులో 177% పెరిగి సంచలనం రేపింది. స్టాక్ మార్కెట్ చరిత్రలోనే ఇది అత్యధిక పెరుగుదల అని, అలాగే కంపెనీ చరిత్రలోనే అతిపెద్ద ఒక్కరోజు లాభం అని కంపెనీ నివేదిక పేర్కొంది.

కోవిడ్-19 మహమ్మారి తర్వాత డిమాండ్ తగ్గి నష్టాల్లో ఉన్న మోడర్నా కంపెనీ మార్కెట్ విలువ ఈ ఒక్క పరిణామాంతో ఒక్కసారిగా బిలియన్ల డాలర్లు బలపడింది. కోవిడ్-19 వ్యాక్సిన్‌కు ప్రసిద్ధి చెందిన అమెరికా బయోటెక్నాలజీ సంస్థ మోడెర్నా, మెర్క్‌తో కలిసి అభివృద్ధి చేస్తున్న వ్యక్తిగత క్యాన్సర్ వ్యాక్సిన్ ఒక పెద్ద చివరి దశ ప్రయోగంలో విజయం సాధించడంతో, దాని షేర్లు ఒక్క రోజులోనే 177% పెరిగాయి. శస్త్రచికిత్స ద్వారా కణితులను తొలగించిన రోగులలో, తీవ్రమైన చర్మ క్యాన్సర్ అయిన మెలనోమా తిరిగి రాకుండా లేదా వ్యాపించకుండా నిరోధించడానికి ఈ ప్రయోగాత్మక చికిత్స సహాయపడుతుంది.

మోడెర్నా,మెర్క్ సంస్థలు ఇప్పటికే ఊపిరితిత్తులు, మూత్రాశయం, మూత్రపిండాల క్యాన్సర్‌తో సహా ఇతర క్యాన్సర్లలో వ్యక్తిగతీకరించిన క్యాన్సర్ వ్యాక్సిన్‌లను పరీక్షిస్తుండగా, క్లోమ , జీర్ణాశయ క్యాన్సర్లలో ప్రాథమిక దశ అధ్యయనాలు జరుగుతున్నాయి.