• Telugu News
  • /Telangana

తెలంగాణ రాజకీయాల్లో..ఎథిక్స్ రచ్చ!

పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై తెలంగాణ అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ విచారణ కొనసాగుతోంది. ఈ నెల 29న మరోసారి సమావేశం కానున్న కమిటీ చర్యలపై రాజకీయంగా ఉత్కంఠ నెలకొంది.

Reported by: Tejaswini Nanna | తెలంగాణ‌ | Aug 26, 2026, 2:10 pm IST
Read Time: 8 mins
తెలంగాణ రాజకీయాల్లో..ఎథిక్స్ రచ్చ!

తెలంగాణ రాజకీయాలు నది జలాలు..22ఏ నిషేధిత భూములు, పాలిటెక్నిక్ విద్యార్ధుల నిరసనలు , ఫీజు రీఎంబర్స్మెంట్ ఆందోళనలు, కొండా సుస్మిత-సురేఖ ఎపిసోడ్, సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన రద్దు వివాదం నుంచి ఎథిక్స్ కమిటీ వైపు మళ్లాయి. గత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.. సీనియర్ సభ్యుడైన కడియం శ్రీహరిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు సంబంధించిన ఉదంతాన్ని అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ(ప్రవర్తనా నియమావళి కమిటీ)కి సిఫార్సు చేస్తూ సభ తీర్మానం ఆమోదించింది. చైర్మన్ రేవూరి ప్రకాశ్ రెడ్డి అధ్యక్షతన ఎథిక్స్ కమిటీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో తన తొలి సమావేశం నిర్వహించింది. ఈ సమావేశం సిఫారసు చేసిన అంశాలపై స్పీకర్ ఇప్పటికే సమీక్షించారు.

కౌశిక్‌రెడ్డి.. కడియంను ఉద్దేశించి బెదిరింపు ధోరణిలో సంజ్ఞలు చేశారని.. ఆయన హావభావాలు, వ్యవహారశైలి సరిగా లేదన్న అంశంపై ఎథిక్స్ కమిటీ విచారణ కొనసాగిస్తుంది. ఈ కమిటీ మరోసారి కౌశిక్ రెడ్డి అంశంపై సమావేశమై పూర్తిస్థాయిలో చర్చించి, ఓ నిర్ణయం తీసుకోవాలనే అభిప్రాయానికి వచ్చింది. తాజాగా ఈ నెల 29న ఎథిక్స్ కమిటీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో మరోసారి చర్చించాలని నిర్ణయించింది. ఈ సమావేశం అనంతరం పాడి కౌశిక్ రెడ్డిపై ఎథిక్స్ కమిటీ సిఫారసుల మేరకు స్పీకర్ నిర్ణయం తీసుకోనుండగా..ఈ వ్యవహరం రాజకీయంగా ఆసక్తి రేపుతుంది.

బీఆర్ఎస్ కౌంటర్ ఎటాక్…

సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎథిక్స్ కమిటీ ద్వారా పాడి కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకునే దిశగా అడుగులేస్తుండటంతో ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ మేల్కొంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని, సంపత్ ను అసెంబ్లీ నుంచి బహిష్కరించిన నేపథ్యంలో..అదే తరహాలో పాడి కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవచ్చన్న ప్రచారం వినిపిస్తుంది. దీంతో అప్రమత్తమైన బీఆర్ఎస్ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పలు సందర్భాల్లో చేసిన అనుచిత వ్యాఖ్యలను గుర్తు చేస్తూ కౌంటర్ ఎటాక్ చేపట్టింది. ఎథిక్స్ కమిటీకి అధికార పక్షం వారి తప్పుడు మాటలు ఎందుకు పట్టడం లేదని, కేవలం ప్రతిపక్ష ఎమ్మెల్యే మాటలనే ఎందుకు తప్పుబడుతున్నారంటూ బీఆర్ఎస్ ప్రశ్నిస్తుంది.

రేవంత్ రెడ్డి “బడివే” అంటే ఎథిక్స్ కమిటీకి కనిపించలేదా? : మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి

పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను తప్పుబడుతున్న ఎథిక్స్ కమిటీకి అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వాడిన అసభ్య పదజాలం కనిపించకపోవడం విడ్డూరంగా ఉందని బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తప్పుబట్టారు.బుధవారం తెలంగాణ భవన్ లో పాడి కౌశిక్ రెడ్డితో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. దానం నాగేందర్ అసెంబ్లీలో బజారు రౌడీ లాగా ప్రవర్తించి..అరేయ్..తోలు తీస్తా కొడుకా..బయటకూడా తిరుగనివ్వనంటూ బీఆర్ఎస్ సభ్యులను అసెంబ్లీలో బెదిరించారని అది ఎథిక్స్ కమిటీకి ఎందుకు రిఫర్ చేయలేదు? అని ప్రశ్నించారు. సభలో మందుల సామెల్ కత్తుల కోలాటం ఆడుతాం అంటే ఎథిక్స్ కమిటీకి కనిపించలేదా?, వీర్లపల్లి శంకర్, పొన్నం ప్రభాకర్ లు అసెంబ్లీలో అసహ్యంగా సైగలు చేస్తే ఎథిక్స్ కమిటీకి కనిపించడం లేదా? అని నిలదీశారు. వేముల వీరేశం నన్ను గెలుకొద్దంటూ హెచ్చరించారని గుర్తు చేశారు.

స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి మా దగ్గర కండలు తిరిగినోళ్లు ఉన్నారని, తిరగేసి బోర్లా వేసి పండవెట్టి కొడుతాం అన్నారని, ముసుగేసుకుని వస్తే ముసుగు ఊడబెరికి బట్టలిప్పి కొడుతా అంటూ జర్నలిస్టులను బెదిరించాడని అంటే ఎథిక్స్ కమిటీకి కనిపించలేదా? నిద్ర పోయిందా? అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి”బడివే” అన్న మాటలు ఎందుకు ఎథిక్స్ కమిటీకి వినిపించడం లేదు..కనిపించడం లేదు అంటూ నిలదీశారు. మాజీ మంత్రి సబితమ్మను ఉద్దేశించి..ఆమె మాటలు నమ్మితే జూబ్లీ బస్టాండ్ లో అడుక్కోవాల్సి వస్తదని రేవంత్ వ్యాఖ్యానించాడని గుర్తు చేశారు. సభా మర్యాదలు, సాంప్రదాయాలు,నైతిక విలువలు, సభా నిబంధనలు, ప్రవర్తన నియామావళి అధికార, ప్రతిపక్ష సభ్యులందరికి ఒకటే ఉంటాయని, అలా చూడనప్పుడు ఎథిక్స్ కమిటీని పొలిటికల్ కమిటీగా భావించాల్సి వస్తుందని వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎథిక్స్ కమిటీని ఓ రాజకీయ కక్ష సాధింపు వేదికగా కాంగ్రెస్ సర్కార్ వాడుతోందని విమర్శించారు. సభ్యుల నైతిక విలువలు కాపాడటానికి ఈ కమిటీ ఉండాలే తప్ప.. కాంగ్రెస్ రాజకీయ కక్షలు తీర్చుకోవడానికి కాదు అన్నారు. గతంలో కౌశిక్ రెడ్డిపై అసెంబ్లీలో ఎథిక్స్ కమిటీకి రెకమెండ్ చేసిన సమయంలో.. అసలు ఎథిక్స్ కమిటీనే లేదు అని గుర్తు చేశారు.