కాంగ్రెస్ సహకారంతోనే రాజకీయ దాడులు: పల్లా, కేపీ ఫైర్

కాంగ్రెస్ ప్రభుత్వ సహకారంతోనే రాష్ట్రంలో బీఆర్ఎస్ నాయకులపై రాజకీయ దాడులు కొనసాగుతున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, కేపీ వివేకానందలు ఆరోపించారు. కరీంనగర్ లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై జరిగిన దాడిపై చట్టపర చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ప్రతినిధి బృందం శుక్రవారం డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.

కాంగ్రెస్ సహకారంతోనే రాజకీయ దాడులు: పల్లా, కేపీ ఫైర్

విధాత, హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వ సహకారంతోనే రాష్ట్రంలో బీఆర్ఎస్ నాయకులపై రాజకీయ దాడులు కొనసాగుతున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, కేపీ వివేకానందలు ఆరోపించారు. కరీంనగర్ లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై జరిగిన దాడిపై చట్టపర చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ప్రతినిధి బృందం శుక్రవారం డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అనంతరం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దిగజారిపోయాయని, వెనుకబడిన రాష్ట్రాలలో ఏ విధంగా ఉన్నదో అదే పరిస్థితి తెలంగాణలో ఉందని విమర్శించారు. నచ్చని రాజకీయ పార్టీల నేతల కార్యాలయాలపై ,ఇండ్లపై దాడులు చేస్తున్నారు అని, కరీంనగర్లో పోలీసుల చేతగాని తనాన్ని డీజీపీకి వివరించాం అని తెలిపారు. నిన్న కౌశిక్ రెడ్డిని చంపాలని వచ్చారని, బండి సంజయ్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే మేము సమాధానం చెప్పాలా వద్దా ? అని ప్రశ్నించారు. బండి సంజయ్ రెచ్చ గొడితేనే బీజేపీ కార్యకర్తలు కౌశిక్ రెడ్డిపై దాడికి వచ్చారు అని, బండి సంజయ్ పై కేసు నమోదు చేయాలని, కౌశిక్ రెడ్డికి భద్రత పెంచాలని డిమాండ్ చేశారు.

బీఆర్ఎస్ ఎల్పీ విప్ కేపీ వివేకానంద మాట్లాడుతూ బండి సంజయ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య చీకటి ఒప్పందాలు.. వ్యాపారాలు అందరికి తెలుసు అన్నారు. ముఖ్యమంత్రికి ఎప్పుడు ఆపద వచ్చినా కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఆయనకు సహాయ మంత్రిగా ఉంటున్నారని ఆరోపించారు. బండి సంజయ్ కి అహంకారం పెరిగింది అని, 2014 ముందు బండి సంజయ్ ఏ విధంగా డబ్బులు వసూలు చేశారో మాకు తెలుసు అన్నారు. మీ భాషపై మీ భాషలోనే చెబితే దాడులు చేస్తారా..? అని, కౌశిక్ రెడ్డి ఏమి తప్పు మాట్లాడారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ ను డ్రగ్స్ అంటాడని..మేము అదే భాషలో సమాధానం చెబుతాం అని తెలిపారు. వచ్చేది మా ప్రభుత్వమే అని.. అప్పుడు బండి సంజయ్ గుజరాత్ వెళ్ళి దాచుకోవాలన్నారు. దాడికి సంబంధించి అన్ని ఆధారాలు డీజీపీకి ఇచ్చాం అన్నారు. ఎఫ్ఐఆర్ లో బండి సంజయ్ ని A1 చేర్చాలని డిమాండ్ చేశారు.  రాబోయే రోజుల్లో బండికి తగిన గుణపాఠం చెబుతాం అన్నారు.

మండలి బీఆర్ఎస్ ఎల్పీ విప్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ రాజ్యాంగాన్ని రక్షించాల్సిన హోంశాఖ సహాయ మంత్రి గుండాలను పెట్టి కొట్టిస్తున్నారన్నారని విమర్శించారు. ప్రభుత్వమే ప్రభుత్వ ఆస్తులపై దాడులు చేస్తోందన్నారు. నేరస్తులు మంత్రులు అవుతున్నారు.. నేరపూరిత పాలన జరుగుతుంది అని, వరుస పెట్టి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కార్యాలయాలపై దాడి జరుగుతున్నాయన్నారు. పోలీసులు గుండాలను బతిమిలాడుతున్నారని, రాష్ట్రంలో శాంతిభద్రతలు అమలవుతున్నాయా..? అని ప్రశ్నించారు. కేసీఆర్ ను అవమానిస్తూ దారుణమైన మాటలు మాట్లాడినా కూడా ఎక్కడ కూడా ఫ్యాక్షనిస్టు సంస్కృతితో దాడులు చేయలేదు అని, బండి సంజయ్ నోటి నుంచి ఒక్క మంచి మాట వినలేదు అన్నారు. బండి సంజయ్ రామాయణం ఉపనిషత్తులు చదివాడా..? ఆయనకు ఏమైనా వచ్చా..? బీహార్ సంస్కృతి తెలంగాణలో రావద్దని డీజీపీని కోరాం అని, దాడులు ఇలాగే జరిగితే ఆత్మ రక్షణ కోసం ప్రతిదాడులు చేయాల్సి వస్తుంది అని హెచ్చరించారు.

ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజ్ శ్రవణ్ మాట్లాడుతూ.. భగవంతుని దయవల్ల ఇవాళ కౌశిక్ రెడ్డి బతికి ఉన్నాడని, కేటీ ఆర్ పై వాడిన ఆ భాష బీజేపీ సిద్ధాంతాలకు అనుగుణంగా ఉందా ? భారత్ మాతాకీ జై అనే వారి నోటి నుంచి వచ్చే మాటలేనా అవి అని బండి సంజయ్ ఆలోచించుకోవాలన్నారు. కేసీఆర్ కి పుట్టావా అని బండి సంజయ్ అనడం హోంశాఖ సహాయ మంత్రి లాంగ్వేజా..? అని ప్రశ్నించారు. మీ భాషతో మీ బీజేపీ పార్టీని బొంద పెడుతున్నారని చురకలేశారు. రాష్ట్రం లో పోలీస్ శాఖ ఎవరి కోసం పని చేస్తోంది ? అని, ఐపీఎస్ ఆఫీసర్ భార్య గొంతు కోసి చంపేశారని, శాంతిభద్రతలు ఎక్కడున్నాయని నిలదీశారు. మహిళా కమిషనర్ సుమతి రోడ్డుపై నిలబడితే పోకిరీల అల్లరి చేష్టలు అందరూ చూశారు అన్నారు. ముఖ్యమంత్రి కమాండ్ కంట్రోల్ కి వెళ్ళి ఏమి చేస్తున్నారని,
బీఆర్ఎస్ కార్యాలయాలు, క్యాంప్ ఆఫీసులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించేదాకా మా పోరాటం కొనసాగుతుందని తెలిపారు. డీజీపీని కలిసిన వారిలో ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, డాక్టర్ కె. సంజయ్ లు ఉన్నారు.