Chiranjeevi | ‘పునాదిరాళ్లు’తో మొదలైన చిరంజీవి సినీ ప్రస్థానం .. కెమెరా అనుభవాన్ని గుర్తు చేసుకున్న మెగాస్టార్

Chiranjeevi |తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవి సినీ ప్రయాణం ఎంత గొప్పదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుత నటన, మెస్మరైజింగ్ డ్యాన్స్‌లు, పవర్‌ఫుల్ యాక్షన్ సన్నివేశాలతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆయన ప్రయాణానికి పునాదిగా నిలిచింది ‘పునాదిరాళ్లు’ సినిమా

Chiranjeevi |తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవి సినీ ప్రయాణం ఎంత గొప్పదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుత నటన, మెస్మరైజింగ్ డ్యాన్స్‌లు, పవర్‌ఫుల్ యాక్షన్ సన్నివేశాలతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆయన ప్రయాణానికి పునాదిగా నిలిచింది ‘పునాదిరాళ్లు’ సినిమా. ఇదే ఆయన నటించిన తొలి చిత్రం అయినప్పటికీ, ప్రేక్షకుల ముందుకు మాత్రం ముందుగా వచ్చిన సినిమా ‘ప్రాణం ఖరీదు’. అయినా కూడా చిరంజీవి కెరీర్‌కు నిజమైన ఆరంభం ‘పునాదిరాళ్లు’తోనే అని సినీ విశ్లేషకులు భావిస్తుంటారు. ఈ నేపథ్యంలో తన సినీ జీవితంలో అత్యంత అమూల్యమైన జ్ఞాపకాన్ని తాజాగా చిరంజీవి సోషల్ మీడియా ద్వారా గుర్తు చేసుకున్నారు.

‘పునాదిరాళ్లు’ సినిమా కోసం జీవితంలో తొలిసారి కెమెరా ముందు నిలిచిన రోజును స్మరించుకుంటూ ప్రత్యేక పోస్ట్ చేశారు. ఆ రోజు తనలో కలిగిన ఆత్రుత, ఆనందం, బాధ్యత, భావోద్వేగం మాటల్లో చెప్పలేనివని పేర్కొంటూ ఆ క్షణం ఇప్పటికీ నిన్న మొన్న జరిగినట్టే అనిపిస్తుందని తెలిపారు. తనకు తొలి అవకాశం ఇచ్చిన దర్శకుడు, నిర్మాతలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ వారి నమ్మకం, ప్రోత్సాహమే తన నటన ప్రయాణానికి బలమైన పునాదులు వేసిందన్నారు. అలాగే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తనను ఆదరిస్తూ ఆశీర్వదిస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలిపారు. గుడిపాటి రాజ్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పునాదిరాళ్లు’ చిత్రానికి క్రాంతికుమార్ నిర్మాతగా వ్యవహరించారు.

1978 ఫిబ్రవరి 11న చిరంజీవి తొలిసారి ఈ సినిమా కోసం కెమెరా ముందుకు వచ్చారు. అనంతరం 1979 జూన్ 21న ఈ చిత్రం విడుదలైంది. అప్పట్లో పెద్దగా వాణిజ్య విజయాన్ని అందుకోకపోయినా, చిరంజీవి కెరీర్‌కు ఇది మైలురాయిగా నిలిచింది. ఆ చిన్న ప్రారంభమే తర్వాత తెలుగు సినీ పరిశ్రమలో ఒక మహానటుడి అవతరణకు దారితీసిందని అభిమానులు భావిస్తున్నారు. దశాబ్దాల పాటు అగ్రనటుడిగా కొనసాగుతూ ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలతో ఇండస్ట్రీని ప్రభావితం చేసిన చిరంజీవి, తన తొలి అడుగును మరువకుండా గుర్తు చేసుకోవడం అభిమానుల్లో మరింత అభిమానాన్ని పెంచుతోంది.

ఆయన చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మొత్తంగా ‘పునాదిరాళ్లు’ సినిమా కేవలం ఒక చిత్రం మాత్రమే కాకుండా మెగాస్టార్ చిరంజీవి అనే మహోన్నత వ్యక్తిత్వానికి ఆరంభ బిందువుగా నిలిచిన ప్రత్యేక గుర్తుగా మిగిలిపోయింది.

Latest News