నా 2% ఆస్తి విలువ రూ.400 కోట్లు.. ఆస్తి గుట్టు విప్పేసిన నారా భువనేశ్వరి

  • Publish Date - September 25, 2023 / 04:44 PM IST

ఎంతోమంది కి స్ఫూర్తి ప్రదాతగా నిలిచి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు కృషి చేసిన చంద్రబాబును రాజకీయ కక్షతో అరెస్ట్ చేసి జైల్లో వేశారని ఆయన సతీమణి భువనేశ్వరి ఆరోపించారు. సోమవారం సాయంత్రం కోడలు బ్రహ్మణి, టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తోబాటు చంద్రబాబును ములాఖాత్ లో కలిసిన భువనేశ్వరి ఆ తరువాత మీడియాతో మాట్లాడారు. ప్రజల సొమ్ము తమకు వద్దన్నారు. తమ కుటుంబం ప్రజా సేవకే అంకితమైందని భువనేశ్వరి తెలిపారు.

తన భర్త చంద్రబాబు ఏ తప్పు చేయలేదని అన్నారు. ఇదే సమయంలో ఆమె తన ఆస్తుల గుట్టు విప్పేసారు. హెరిటేజ్ లోని తన వాటాలో కేవలం రెండు శాతాన్ని అమ్మితే క్షణంలో రూ.400 కోట్లు వస్తాయని అలాంటి తమకు ప్రజలసొమ్ము ఎందుకని ప్రశ్నించారు. ఇక ఈమె చేసిన ప్రకటన అటు వైసిపికి అస్త్రంగా మారింది. రెండు శాతం వాటా అమ్మితే రూ.400 కోట్లు వస్తున్నప్పుడు మొత్తం వాటా విలువ ఎన్ని వేలకోట్లు ఉంటుంది ? ఇదంతా ఎలా సంపాదించారు ? ఇది అక్రమార్జన కాదా అంటూ సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు.

ఆమె తెలిసి మాట్లాడారో, ప్రజల డబ్బు తమకు అవసరం లేదని చెప్పడానికి మాట్లాడారో కానీ మొత్తానికి ఆమె తన ఆస్తుల లెక్క బయటికి చెప్పేశారు. ఇదిప్పుడు టిడిపి వాళ్లకు అనవసరమైన తలనొప్పిని తెచ్చేలా ఉంది. ఇక ఆమె మీడియాతో మాట్లాడుతూ “సింహంలా గర్జించే ఆయనను జైల్లో పెట్టి ఉండొచ్చు. కానీ ఒకటి మరిచిపోతున్నారు.

ఇక నుంచి ప్రజల కోసం మరింత కసిగా చంద్రబాబు పని చేస్తారు” అని అన్నారు. బినామీ కంపెనీ పేరుతో చంద్రబాబు కోట్లాది రూపాయలు కాజేశారన్న ఆరోపణల్లో నిజం లేదని తెలిపారు. చంద్రబాబు అరెస్టుకు నిరసగా కాకినాడ జిల్లా జగ్గంపేటలో జరుగుతున్న నిరాహర దీక్షల శిబిరాన్ని ఆమె సందర్శించారు. శిబిరంలో పాల్గొని వారికి సంఘీభావం తెలిపారు.

Latest News