విధాత: ఏపీలో జగన్ సర్కారు ఎన్నికలకు సిద్ధం అవుతున్నట్లే ఉంది. చిన్నచిన్న అడ్డంకులు, పాలనా పరమైన చిక్కులు తొలగించుకుని విజయానిక బాటలు వేసుకునే పనిలో ఉన్నారు. ఈ క్రమంలో తమ గెలుపుకు ఎక్కడెక్కడ అడ్డంకులు ఉన్నాయో గుర్తించి వాటిని సమూలంగా తొలగిస్తూ ముందుకు వెళుతున్నారు.
ఈ క్రమంలో జగన్ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల విధుల నుంచి టీచర్లను తప్పిస్తూ ఉత్తర్వులు తెచ్చింది. వాస్తవానికి ఎన్నికల్లో పోలింగ్ ఆఫీసర్లు.. బూత్ లెవెల్ ఆఫీసర్లు, అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్ వంటి కీలక స్థానాల్లో టీచర్లు ఉంటుండగా.. ఓటర్లను ప్రభావితం చేసేది కూడా వారే.
అయితే గత కొన్నాళ్లుగా పదోన్నతులు, బదిలీలు, పీఆర్సీ, స్కూళ్ల రేషనలైజేషన్ వంటి అంశాల్లో టీచర్లు అసంతృప్తిగా ఉన్నారు. సీపీఎస్ అంశంలో జగన్ తమను మోసగించారని భావిస్తున్న టీచర్లు ఆ మధ్య చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేసి తమ బలాన్ని చూపి జగన్‌ను బెదిరించాలని చూశారు.
అంతేకాకుండా రానున్న ఎన్నికల్లో తమ సత్తా ఏమిటో చూపుతామని, ప్రభుత్వం దారికి వచ్చేలా చేస్తామని కూడా కొందరు టీచర్లు హెచ్చులకు పోయారు. ఇప్పుడు దానికి సమాధానం అన్నట్లుగా ప్రభుత్వం వారిని ఏకంగా ఎన్నికల విధులకు దూరం చేసింది.
బోధనేతర పనుల్లో టీచర్లను వినియోగించబోమని ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటికే నాడు నేడు..జగనన్న గోరు ముద్ద ఇలా ఇతరత్రా పనుల్లో బోలేడు మంది టీచర్లకు బోధనేతర పనులు మీద పడ్డాయని, దాని వల్ల బోధనకు విఘాతం కలిగి పిల్లలు నష్టపోతున్నారని సర్కారు చెబుతోంది.
అందుకే వారికి బోధనేతర పనులకు దూరం పెడుతున్నామని అంటోంది. కానీ అసలు విషయం మాత్రం ఈ టీచర్లు గంప గుత్తగా సర్కారుకు వ్యతిరేకంగా ఉన్నట్లు గుర్తించి సర్కార్ ఈ విధంగా వారి తోకలు కత్తిరించిందని అంటున్నారు.