Extramarital Affair | పని చేసే ప్రాంతాల్లో కొంత మంది ఉద్యోగులు వివాహేతర సంబంధాలు కొనసాగిస్తుంటారు. ఇలాంటి కేసులను ప్రతి రోజు ఏదో ఒక చోట చూస్తూనే ఉంటాం. అయితే తమ కంపెనీ కార్యకలాపాలు సక్రమంగా ఉండాలని, ఉద్యోగుల కుటుంబాలు కూడా సవ్యంగా ఉండాలనే ఉద్దేశంతో వివాహేతర సంబంధాలపై ఓ కంపెనీ హెచ్చరికలు జారీ చేసింది.
కంపెనీలో పని చేసే ఉద్యోగులు ఎవరైనా వివాహేతర సంబంధాలు కొనసాగించినా, తమ జీవిత భాగస్వాములకు విడాకులు ఇచ్చినా ఉద్యోగాల్లో నుంచి తీసేస్తామని చైనాకు చెందిన ఓ కంపెనీ తమ ఉద్యోగులను హెచ్చరించింది.
వింత ఆదేశాలు జారీ చేసిన చైనా కంపెనీపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ కొనసాగుతోంది. అంతే కాదు అంతర్జాతీయ మీడియా దృష్టిని కూడా ఆకర్షించింది. ఈ సందర్భంగా ఆ కంపెనీకి చెందిన ఓ ప్రతినిధి మాట్లాడుతూ.. కంపెనీ అంతర్గత నిర్వహణను మెరుగుపర్చుకోవడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.
కుటుంబానికి విశ్వాసంగా ఉండటం, దంపతుల మధ్య మంచి అనుబంధాన్ని నెలకొల్పే సంస్కృతిని బలోపేతం చేయాలనే ఉద్దేశంతోనే ఈ ఆదేశాలు జారీ చేశామన్నారు. ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉంటేనే ఉద్యోగుల పనితీరు కూడా బాగుంటుందని భావించి ఈ నిబంధనలు రూపొందించినట్లు తెలిపారు.
అయితే ఉద్యోగుల వ్యక్తిగత విషయాలకు సంబంధించి కంపెనీ జోక్యం చేసుకోవడం సరికాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నిబంధనల వల్ల కుటుంబ విలువలు నిలబడుతాయనే వాదన కూడా కొందరు చేస్తుననారు. ఈ నిబంధనలు న్యాయపరంగా సరైంది కాదని ఓ లాయర్ స్పష్టం చేశాడు.
ఓ ఉద్యోగిని తొలగించడానికి అతని పనితీరు ఆధారిత కారణాలు మాత్రమే న్యాయస్థానంలో చెల్లుబాటు అవుతాయని లాయర్ పేర్కొన్నాడు. వివాహేతర సంబంధం పెట్టుకుంటే ఉద్యోగంలో నుంచి తీసేస్తామన్న నిబంధన చట్ట సమ్మతం కాదన్నారు.