కొత్తగా విదుదలయ్యే సినిమాలపై రివ్యూలు విపరీతమైన ప్రభావాన్ని చూపిస్తాయి. రిలీజ్ రోజు మొదటి షో, మొదటి గంట తర్వాత మొదలయ్యే సోషల్ రివ్యూలు, క్రికెట్ బెట్టింగ్‌లాగా గంటకోసారి కూడా రివ్యూ ఇస్తాయి. దాంతో ప్రేక్షకులు ప్రభావితమై సినిమాకు వెళ్లాలా. వద్దా అనేది నిర్ణయించుకుంటున్నారు.
పెద్ద హీరో సినిమా అయితే, మరోరకం టెన్షన్. ఫ్యాన్స్ సూపర్ అని రివ్యూలు పెడితే, వేరే హీరో ఫ్యాన్స్ చెత్త అని పెడతారు. అయితే ఇదంతా ఓ రెండు రోజుల పెళ్లే. అ తరువాత సినిమా తన సొంత పర్ఫార్మన్స్ మీదే నడుస్తుంది. కానీ, మొదటి రోజులు చాలా కీలకం. కలెక్షన్లు ఆ రోజుల్లోనే ఎక్కువగా ఉంటాయి. అక్కడ దెబ్బ పడితే ఇక సినిమా కోలుకోవడం చాలా కష్టం. అందుకే నిర్మాతలు రివ్యూ అంటేనే పీడకలలా భావిస్తారు. రివ్యూలు రాసేవాళ్లను సాధ్యమైనంత వరకు మేనేజ్ చేస్తారు. కానీ, వారి మేనేజ్‌మెంట్‌లో మిస్సయిన వారు కసి కొద్దీ నెగటివ్ రివ్యూలు మొదలెడతారు. ఈ విషయమై స్పందించిన కేరళ ఉన్నత న్యాయస్థానం, సినిమా విడుదలైన రెండు రోజులవరకూ ఎటువంటి రివ్యూలు, ఏ రకమైన మీడియాలోనూ ప్రచురించవద్దని ఆదేశాలు జారీ చేసింది.
తాజాగా దాఖలైన ఒక పిటిషన్‌ను విచారించిన కేరళ హైకోర్టు ఈ విధమైన ఆదేశాలు జారీ చేసిందని కేరళ హైకోర్టు సలహాదారులైన శ్యామ్ పద్మన్ స్వయంగా ప్రకటించారు. అంతేకాకుండా నెగెటివ్ రివ్యూలు రాసే వెబ్‌సైట్లు, సోషల్‌మీడియా ఖాతాలు, యూట్యూబ్ చానెళ్లపై నిరంతర పర్యవేక్షణ కూడా ఉంటుందని పద్మన్ తెలిపారు. న్యాయస్థానం వెలువరించిన ఈ నిర్ణయం పట్ల మలయాళ నిర్మాతలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.
సాధారణంగా నెగటివ్ రివ్యూలు రాసేవాళ్లు రెండు రకాలు. ఒకటి హీరోల అభిమానులు. రెండోవారు జర్నలిస్టులమని చెప్పుకుని రివ్యూలు రాసేవారు. వీళ్లకు నిర్మాత నుండి డబ్బులు ముడితే కానీ, రివ్యూ రాదు. ఒకవేళ నిర్మాత డబ్బులు ఇవ్వకపోతే ఇక అంతే సంగతులు. ఆ సినిమాపై విషం చిమ్ముతూ నానా చండాలంగా రాసేస్తారు. ఇవన్నీ సోషల్‌మీడియాలో షేర్ అవడం వల్ల, ప్రేక్షకులు అయోమయానికి గురవుతారు. చూడాలా? వద్దా అనే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఓటీటీల వల్ల నెల తిరిగేసరికి ఏదో ప్లాట్‌ఫారంలోకి సినిమా వస్తోంది. దాంతో ఇప్పటికే కుటుంబ ప్రేక్షకులు దాదాపు దూరమైపోయారు. ఇక మిగిలింది యువత. వీరిపైనే సినిమా భవితవ్యం ఆధారపడి ఉంటోంది. అయితే చాలా మంచి సినిమా అయితేనే థియేటర్లకు ప్రేక్షకులు వస్తున్నారు. చిన్నదైనా, పెద్దదైనా సినిమా బాగుంటే ఆటోమాటిక్‌గా నడిచిపోతుంది. ఒకరకంగా ఇది కూడా ఓటీటీల పుణ్యమే. రకరకాల భాషల్లో ఇప్పుడు సినిమాలు సబ్‌టైటిళ్లతో అందుబాటులో ఉంటున్నాయి. దాంతో సినిమా కంటెంట్‌పై ప్రేక్షకుడికి అభిరుచి పెరిగింది. అలా పబ్లిసిటీ గొప్పగా లేకపోయినా, చిన్న సినిమాలు గొప్పగా ఆడేస్తున్నాయి. హనుమాన్, కాంతార, కేజీఎఫ్, ప్రేమలు, సామజవరగమన లాంటి సినిమాలు అలా ఆడినవే.
వాస్తవానికి, రివ్యూలు రాయడం మంచి పద్ధతే. సినిమాలో ఏది బాగుంది? ఏది బాగాలేదు అనేది ఒక అనుభవజ్ఞుడైన సినిమా జర్నలిస్టు, ఒక మంచి పత్రికలో రాస్తే అది చదివిన నిర్మాత, దర్శకుడు, హీరో తమను తాము కరెక్ట్ చేసుకునే అవకాశముంటుంది. తద్వారా వారినుండి ఇంకా మంచి సినిమాలను ఆశించవచ్చు. కేవలం డబ్బు కోసం సోషల్‌మీడియా ఉంది కదాని ఏది పడితే అది రాసేస్తే సినిమా రంగానికి మంచిది కాదు. దాంట్లో కూడా వేలాదిమంది కార్మికులు పనిచేస్తారు. వారి బతుకుదెరువు కూడా ప్రశ్నార్థకమవుతుంది. అసహ్యకరమైన విషయమేంటంటే, ఈ రివ్యూలు వ్యక్తిగత దూషణల స్థాయికి కూడా దిగజారాయి. సినిమాలో పనిచేసిన టెక్నీషియన్లు, నటీనటుల గురించి అసభ్యంగా కూడా రాస్తున్నారు.
రెండు రోజుల క్రితం, తెలుగు హీరో విశ్వక్‌సేన్, తన కొత్త సినిమా గామి గురించి ఇదే ఆవేదన వ్యక్తం చేసాడు. మంచి సినిమా అయినప్పటికీ నెగెటివ్ రివ్యూలు రాస్తున్నారని, ఇలాంటివాటికే మహేశ్‌బాబు సినిమా గుంటూరుకారం బలయ్యిందన్నారు. సినిమా బాగుందని తెలిసిన చాలా రోజుల తర్వాత ప్రేక్షకులు ఆ సినిమాను చూట్టం మొదలుపెట్టారు. కానీ, మొదటి రెండు రోజుల కలెక్షన్లపై తీవ్రంగా దెబ్బ పడింది. కేరళ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు, అన్ని భాషల్లో అమలైతే కానీ, సమస్య పరిష్కారం కాదు. ఈ దిశగా కేంద్రం కూడా చర్యలు తీసుకుంటే బాగుంటుందని పలువురు సినిమారంగ ప్రముఖులు అభిప్రాయం వ్యక్తం చేసారు.