Bandi Sanjay : టెన్త్ క్లాస్ పేపర్ లీకేజీ కేసులో బండి సంజయ్ కు బిగ్ రిలీఫ్

10వ తరగతి ప్రశ్నాపత్ర లీకేజీ కేసులో బండి సంజయ్‌కు హైకోర్టు భారీ ఊరట ఇచ్చింది. రాజకీయ కక్ష్యలతో నమోదైన నిరాధార కేసుగా హైకోర్టు కొట్టివేసింది.

Bandi Sanjay

విధాత, హైదరాబాద్ : పదవ తరగతి పరీక్షల ప్రశ్నపత్రం కేసులో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హైకోర్టులో ఊరట దక్కింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆయనపై పోలీసులు పెట్టిన పదవ తరగతి ప్రశ్నపత్రం లీకేజీ కేసును హైకోర్టు కొట్టివేసింది. ఇది పూర్తి నిరాధారమైన కేసుగా హైకోర్టు పేర్కొంది. రాజకీయ కక్ష్యల కారణంగానే కేసు నమోదు చేశారని బండి సంజయ్ న్యాయవాది వాదనలు వినిపించారు. కేసు నమోదులో సరైన సెక్షన్లు, దర్యాప్తులో పూర్తి వివరాలు లేవంటూ హైకోర్టు కేసు కొట్టివేసింది. గతంలో కమలాపూర్ పోలీస్ స్టేషన్‌లో 2023లో 10వ తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై కేసు నమోదు చేశారు. ఇందులో బండి సంజయ్ పేరును ప్రధాన నిందితుడిగా కమలాపురం పోలీసులు చేర్చారు.కేసును కొట్టివేస్తూ హైకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో బీజేపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి. ప్రజా సమస్యలపై పోరాడుతున్న బండి సంజయ్ పై ద్వేషంతో అకారణంగా కేసులు పెట్టి వేధించిందన్న బీజేపీ నాయకులు ఆరోపించారు. హైకోర్టు తీర్పు బీఆర్ఎస్ కు చెంప పెట్టు వంటిదన్నారు.

నాంపల్లి కోర్టుకు హాజరైన బండి సంజయ్

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గురువారం నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ పని చేసిన సమయంలో నల్గొండ జిల్లాలోని నేరడుచర్ల మండలం వడ్ల కొనుగోలు కేంద్రాలను ఆయన సందర్శించి రైతాంగ సమస్యలపై ఆందోళనలు నిర్వహించారు. ఈ సందర్భంగా నేరేడుచర్లలో బీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. బండి సంజయ్ కాన్వాయ్‌పై బీఆర్ఎస్ నేతలు రాళ్ల దాడి చేశారు. ఘటనల్లో బండి సంజయ్‌పై పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు. ఈ కేసుల విచారణలో భాగంగా బండి సంజయ్.. నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు.విచారణ అనంతరం జనవరి 7వ తేదీకి ఈ కేసును న్యాయమూర్తి వాయిదా వేశారు.

Latest News