విధాత: ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీ ఓలా వినియోగదారులకు శుభవార్త చెప్పింది. పోర్ట్‌పోలియోలోని ఓలా ఎస్1 ఎక్స్ ప్లస్ ఈవీ ధరలను తగ్గిస్తున్నట్లు పేర్కొంది. ఓలా ఎస్1 ఎక్స్ ప్లస్ ఎక్స్‌షోరూం ధర రూ.1,09,999గా ఉండేది. ప్రస్తుతం ఈ మోడల్‌పై రూ.20వేల వరకు కంపెనీ తగ్గింపును ఇస్తున్నది. ప్రస్తుతం ఈ స్కూటర్ ఎక్స్‌షోరూం ధర రూ.89,999కి తగ్గింది. రాబోయే రోజుల్లో ఈ స్కూటర్‌ను కొనుగోలు చేసేవారికి అదనపు బెనిఫిట్స్ సైతం అందుబాటులో ఉండనున్నాయి.
జనవరిలో ఎప్పటిలాగే..
తగ్గింపు ధర డిసెంబర్ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని.. జనవరిలో మళ్లీ ధరలు పెరుగుతాయని కంపెనీ స్పష్టం చేసింది. నవంబర్‌లో ఈ మోడల్ స్కూటర్లు 30వేలకుపైగా అమ్ముడయ్యాయి. ఇది ఓ రికార్డు. ఓలా ధరను తగ్గించడంతో ఇతర సీఐఈ స్కూటర్ల సరసన నిలుస్తుందని.. ఫలితంగా ప్రజలు ఐసీఈని కాకుండా ఎలక్ట్రిక్‌ని ఎంచుకుంటారని విశ్వసిస్తున్నట్లు కంపెనీ ఎలక్ట్రిక్ చీఫ్ మార్కెట్ ఆఫీసర్ అన్షుల్ ఖండేల్వాల్ పేర్కొన్నారు. ఎస్1 ఎక్స్ ప్లస్ స్కూటర్ 3కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో వస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 151 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. 500వాట్ ఛార్జర్‌తో ఈ వెహికిల్ బ్యాటరీని 7.4 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేసుకోవచ్చు.
ఇంకా ఫీచర్స్..
ఈ ఓలా స్కూటర్‌లో హబ్ మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్‌తో వస్తుంది. స్కూటర్ టాప్ స్పీడ్ 90 కేఎంపీహెచ్. 0 నుంచి 40 కిలోమీటర్ల స్పీడ్‌ను కేవలం 3.3 సెకన్లలోనే అందుకుంటుంది. 0 నుంచి 60 కిలోమీటర్ల స్పీడ్‌ను అందుకునేందుకు 5.5 సెకన్ల సమయం పడుతుంది. స్కూటర్‌లో ఈకో మోడ్, నార్మల్ మోడ్, స్పోర్ట్ మోడ్ వంటి 3 మోడ్స్ ఇందులో ఉన్నాయి. స్కూటర్‌లో 5 ఇంచ్ ఎల్సీడీ డిస్ప్లే, ఎల్ఈడీ లైటింగ్, సైడ్ స్టాండ్ అలర్ట్, రివర్స్ మోడ్, రిమోట్ బూట్ అన్క్లాక్, నేవిగేషన్ వంటివి ఉన్నాయి. బ్లూటూత్, జీపీఎస్ కనెక్టివిటీతో పాటు ఓటీఏ అప్‌డేట్స్ సైతం పొందొచ్చు. ఇదిలా ఉండగా.. డిసెంబర్‌లో మూవ్ఓఎస్ 4 ఓలా లాంచ్ చేయబోతున్నది. ప్రస్తుతం బీటా వర్షెన్ దశలో ఉన్నట్టు ఓలా పేర్కొంది.