-పెరుగుతున్న వడ్డీరేట్లతో సామాన్యుల ఆశలు ఆవిరి
-గడిచిన 10 నెలల్లో 2.5 శాతం ఎగిసిన రుణ భారం
విధాత: సామాన్యుడి సొంతింటి కలలు కల్లలైపోతున్నాయి. అసలే ఆర్థిక మాంద్యం, ఉద్యోగ కోతలతో సొంతిల్లు జోలికి పోలేకపోతున్న సగటు మనిషిని.. భారంగా మారుతున్న రుణాలు మరింతగా భయపెడుతున్నాయి. గత ఏడాది మే నెలకు ముందు 4 శాతంగా ఉన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపోరేటు.. ఇప్పుడు 6.5 శాతానికి చేరింది.
రెపోరేటుకు అనుగుణంగానే బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలూ తమ రుణాలపై వడ్డీరేట్లను పెంచుతూపోతున్నాయి. దీంతో నిరుడు మే నెలలో 6.5 శాతంగా ఉన్న బ్యాంక్ లోన్ వడ్డీరేటు.. ప్రస్తుతం 9 శాతం దరిదాపుల్లోకి వచ్చింది. ఫలితంగా రుణగ్రహీతపై ఈఎంఐ భారం కనీసం రూ.2 వేలు పెరిగింది. అలాగే ఈఎంఐ కాకుండా రుణ కాలపరిమితి (టెన్యూర్)ని పెంచుకోవాలనుకునే రుణగ్రహీతలకూ రెండేండ్లకుపైగానే టెన్యూర్ పెరిగిందని బ్యాంకింగ్ పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయి.
వేతన జీవులు లబోదిబో
రుణాలపై పెరుగుతున్న వడ్డీరేట్లు.. వేతన జీవులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కరోనా సమయంలో దిగాలుపడిన దేశ ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించేందుకు రెపోరేటును ఆర్బీఐ పెద్ద ఎత్తున తగ్గించిన విషయం తెలిసిందే. దీంతో రుణాలపై వడ్డీరేట్లూ తగ్గాయి. ఫలితంగా చాలామంది, ముఖ్యంగా ఉద్యోగులు కాస్త రిస్కైనాసరే ఇండ్ల కొనుగోళ్లకు ముందుకొచ్చారు. వడ్డీరేట్లు తక్కువగా ఉండటంతో రుణాలను తీసుకుని ఇండ్లు, అపార్టుమెంట్లలో ఫ్లాట్లు కొన్నారు. అయితే గత ఏడాది కరోనా పరిస్థితులు చక్కబడటం, ద్రవ్యోల్బణం విజృంభిస్తుండటంతో రెపోరేటును ఆర్బీఐ పెంచడం మొదలుపెట్టింది.
దీంతో రుణాలపై వడ్డీరేట్లూ పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో రుణాల ఈఎంఐలు, కాలపరిమితులు కూడా పెరుగుతూ వస్తున్నాయి. ఈ పరిణామం వేతన జీవులకు మింగుడు పడకుండా తయారైంది. ఓవైపు కరోనా దెబ్బ నుంచి నెమ్మదిగా కోలుకుంటున్న కంపెనీలు.. ఉద్యోగుల జీతాలను పెంచేందుకు ససేమిరా అంటున్నాయి. మరోవైపు తీసుకున్న అప్పులపై వడ్డీభారం పెరుగుతున్నది. దీంతో చాలామంది ఇప్పటికే ఇండ్లను రీ-సేల్‌కు పెడుతున్నారని రియల్టీ వర్గాలు చెప్తున్నాయి.
మున్ముందు మరిన్ని వడ్డింపులు
మున్ముందు వడ్డీరేట్లు మరింతగా పెరిగే వీలుందన్న అభిప్రాయాలు ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే రుణాల ఈఎంఐలు ఇంకా పెరగడం ఖాయంగా కనిపిస్తున్నది. ఆర్థిక మాంద్యం, ఉద్యోగ కోతల మధ్య ఇప్పటికే గృహ రుణాల వంటి దీర్ఘకాలిక కమిట్‌మెంట్లకు ఎవరూ వెళ్లలేకపోతున్నారు. వడ్డీరేట్లు ఇంకా పెరిగితే నిర్మాణ రంగం మళ్లీ కుదేలవుతుందన్న ఆందోళనలు రియల్ ఎస్టేట్ నుంచీ వ్యక్తమవుతున్నాయి.
ద్రవ్యోల్బణం అదుపే లక్ష్యంగా ఆర్బీఐ ద్రవ్యసమీక్షల్ని చేస్తున్నది. అందుకే గత ఏడాది మే నెల నుంచి ఇప్పటిదాకా రెపోరేటును 2.5 శాతం పెంచింది. దీంతో కరోనాకు ముందున్న స్థాయిని మించిపోయింది. మరోవైపు ఫెడ్ రిజర్వ్ నిర్ణయాలు సైతం ఆర్బీఐ వడ్డింపులకు దారితీస్తున్నదని అంటున్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో బ్యాంకులు తాజా పెంపును రుణగ్రహీతలకు బదిలీ చేయవద్దన్న సూచనలూ వస్తున్నాయి. కానీ బ్యాంకులు ఇందుకు సిద్ధంగా ఉండవన్నది మరికొందరి మాట. మొత్తానికి వడ్డీరేట్ల పెంపులు.. సామాన్యుల సొంతింటి కలను చిదిమేస్తున్నాయి.