Pawan Kalyan: రీసెంట్‌గా బ్రో సినిమాతో ప్రేక్షకులని పలకరించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు తను కమిటైన తదుపరి సినిమాలు కూడా పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ ఖాతాలో ఇప్పుడు ఓజీ అనే చిత్రంతో పాటు హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ అనే చిత్రాలు ఉన్నాయి. వీటిలో ముందుగా ఓజీ అనే చిత్ర షూటింగ్ పూర్తి చేయాలని అనుకుంటున్నాడు పవన్. సాహో డైరెక్టర్ సుజిత్ డైరెక్షన్‌లో ఓజీ అనే గ్యాంగ్ స్టార్ మూవీ తెరకెక్కుతుంది. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా సాగుతుంది. మూడు షెడ్యూల్స్ పూర్తి చేసినట్టు తెలుస్తుండగా, దాదాపు 50 శాతం పైగా షూటింగ్ ఫినిష్ చేశారని అంటున్నారు.
ఇక ప్రస్తుతం నాలుగో షెడ్యూల్ షూటింగ్ జరుగుతున్నట్టు టాక్. అయితే మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ లేకుండానే ఇతర ఆర్టిస్ట్‌లతో షూటింగ్ చేసిన సుజీత్ ఇప్పుడు పవన్ కాంబినేషన్ సీన్స్ చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తుంది. తాజాగా లొకేషన్ నుండి కొన్ని ఫొటోలు బయటకు రాగా, ఇందులో పవన్ మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ తీసుకుంటూ కనిపిస్తున్నాడు. పవన్ ఇలా మార్షల్ ఆర్ట్స్ చేస్తున్న మూవీ స్టిల్స్ బయటకు రావడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. సినిమా ఓ రేంజ్‌లో ఉంటుందని చెబుతున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ పలు సినిమాలలో తన మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యం చూపించి అలరించిన విషయం విదితమే.
సుజీత్ తెరకెక్కిస్తున్న ఓజీ సినిమా విషయానికి వస్తే ఇందులో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా…బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మి విలన్ గా అలరించనున్నాడు.ఇక అర్జున్ దాస్, శ్రియారెడ్డి ప్రధాన పాత్రలలో సందడి చేయనున్నారు. వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో తర్వాత థమన్ ఈ చిత్రానికి స్వరాలు అందిస్తున్నారు. 90 స్ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీని చిత్రీకరించనున్నారని సమాచారం. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్ లేదా వచ్చే ఏడాది ఏప్రిల్ లో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు.. ఏపీ ఎలక్షన్స్ ఆధారంగా ఈ సినిమా రిలీజ్ ఉంటుందని సమాచారం.