Site icon vidhaatha

TPCC Chief Mahesh Kumar Goud: ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షిగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో భాగంగా ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ముందు టీపీసీసీ చీఫ్ బి.మహేష్ కుమార్ గౌడ్ మంగళవారం హాజరయ్యారు. ఈ కేసులో ఆయన సాక్షిగా వాంగ్మూలం ఇచ్చారు. 2023నవంబర్ లో జరిగిన శాసన సభ ఎన్నికల సమమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న తన ఫోన్ ను బీఆర్ఎస్ ప్రభుత్వం ట్యాపింగ్ చేసిందని మహేష్ కుమార్ గౌడ్ గతంలో ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆయన పోలీసుల సూచన మేరకు జూబ్లీహిల్స్ పీఎస్ లో సిట్ ముందు విచారణకు హాజరై వాంగ్మూలం ఇచ్చారు.

అటు గద్వాల జడ్పీ మాజీ చైర్ పర్సన్ సరిత సైతం జూబ్లీహిల్స్ పోలీసుల ముందు ఫోన్ ట్యాపింగ్ కేసులో తన వాంగ్ములం ఇచ్చారు. సరిత ఫోన్ కూడా ట్యాపింగ్ చేసినట్లుగా ఆమె గతంలో ఆరోపించారు. కాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్ రావును మంగళవారం నాల్గవ సారి సిట్ విచారణకు పిలిచింది. సాక్షుల స్టేట్మెంట్ ఆధారంగా ప్రభాకర్ రావును సిట్ విచారించనుంది.  మరోవైపు మహేష్ కుమార్ గౌడ్ జూబ్లీహిల్స్ పీఎస్ సిట్ కార్యాలయానికి వచ్చిన సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు హల్చల్ చేశారు. కార్యాలయంలోనికి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకుని బయటికి పంపించారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య స్వల్ప తోపులాట సాగింది.

కేసీఆర్ సిగ్గుతో తలవంచుకోవాలి : పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

హేయమైన ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడిన మాజీ సీఎం కేసీఆర్ , కేటీఆర్ లు సిగ్గుతో తలదించుకోవాలని టీపీసీసీ చీఫ్ బీ.మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో జూబ్లీహిల్స్ సిట్ కార్యాలయంలో సాక్షిగా వాంగ్మూలం ఇచ్చిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ లిస్ట్ లో సీఎం రేవంత్ సహా 650 మందికిపైగా కాంగ్రెస్ నేతల ఫోన్ నెంబర్లు ఉన్నాయన్నారు. మా ఫోన్లు ట్యాప్ అయినట్లు ఆనాడే ఫిర్యాదు చేశామని తెలిపారు. రాజకీయ నేతల ఫోన్లు ట్యాప్ చేయడం హేయమైన చర్య అన్నారు. కేసీఆర్ తెలంగాణలో ప్రతిపక్షాలను అణిచివేసి..ఎన్నికల్లో గెలవకుండా చేసి ఎప్పటికి తనే సీఎంగా ఉండాలనే దురుద్దేశంలో ఫోన్ ట్యాపింగ్ లకు పాల్పడ్డాడని ఆరోపించారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి మా ఫోన్లు ట్యాప్ చేయడమే కారణమబని భావిస్తున్నామన్నారు. మావోయిస్టుల సానుభూతిపరుల పేరుతో మా ఫోన్లు ట్యాప్ చేశారని..అన్ని చట్టాలను నిస్సిగ్గుగా ఉల్లంఘించారని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. నిందితులు ఎంతటివారైనా వారిని చట్టప్రకారం కఠినంగా శిక్షించాలన్నారు.

Exit mobile version