Philippines Floods : ఫిలిప్పీన్స్‌లో భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఆకస్మిక వరదల కారణంగా 13 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 23 మంది గల్లంతయ్యారు. వరదల్లో గల్లంతైన వారు మత్స్యకారులుగా సమాచారం. మంగళవారం కురిసిన భారీ వర్షాలకు నదులు పొంగిపొర్లుతుండగా రోడ్లన్నీ జలమయమయ్యాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో కరెంటు సరఫరా నిలిచిపోయింది. వరదల కారణంగా 45వేల మందికిపైగా నిరాశ్రయులయ్యారు.
చాలా మంది శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. అయితే, గల్లంతైన మత్స్యకారులు ప్రతికూల వాతావరణాన్ని సైతం లెక్క చేయకుండా సముద్రంలో వేటకు వెళ్లడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తున్నది. వాతావరణ బ్యూరో ఫిలిప్పీన్ అట్మాస్ఫియరిక్, జియోఫిజికల్ అండ్ ఆస్ట్రోనామికల్ సర్వీసెస్ ప్రకారం.. వరదల కారణంగా భారీగా నష్టం జరిగింది. పలు ప్రాంతాల్లో వర్షాల కారణంగా కొండ చరియలు విరిగిపడే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. మనీలాకు ఆగ్నేయంగా 270 కి.మీ దూరంలో ఉన్న కామరైన్స్ సుర్‌లో ఒక ఏళ్ల బాలిక, 64 ఏళ్ల వ్యక్తి వేర్వేరు సంఘటనల్లో మరణించారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగిస్తున్నట్లు అధికారులు వివరించారు.