Chenab Bridge:: ప్రపంచంలోనే అతి ఎత్తయిన రైల్వే ఆర్చి బ్రిడ్జి జమ్మూకశ్మీర్ లోని చినాబ్ ఉక్కు వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం జెండా ఊపి ప్రారంభించారు. కట్ ఢా నుంచి కశ్మీర్ కు వందే భారత్ రైలుకు జెండా ఊపడం ద్వారా ప్రధాని మోదీ ఈ వంతెనను ప్రారంభించారు. వంతెన ప్రారంభోత్సవంతో కశ్మీర్ ను దేశంలోని వివిధ ప్రాంతాలకు అనుసంధానించే రైల్వే మార్గం ఏర్పాటుపై శతాబ్ధపు కల సాకారమైంది. అత్యంత దుర్లభమైన శివాలిక్, పీర్ పంజాల్ పర్వత శ్రేణులను కలుపుతూ కశ్మీర్ లోయకు రైలును నడపాలన్న బ్రిటీష్ కాలం నాటి ప్రణాళిక చినాబ్ వంతెన ప్రారంభోత్సవంతో కార్యరూపం దాల్చింది. భారత రైల్వే చరిత్రలో అతి పెద్ద వంతెన గా చినాబ్ వంతెన నిలిచిపోనుంది. ఉదంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్వే లింక్(యూఎస్ బీఆర్ఎల్ )లో భాగంగా నిర్మించిన చినాబ్ వంతెన రైల్వే మార్గం మొత్తం 272 కిలోమీటర్ల పొడవు ఉంది. చినాబ్ వంతెనతో పాటు దేశంలోనే మొట్టమొదటిసారిగా తీగలతో అనుసంధానించిన అంజీ రైల్వే వంతెన (కేబుల్ బ్రిడ్జి)ను కూడా ప్రారంభించారు. రఫీయాబాద్ కుప్వర మధ్య జాతీయ రహదారి విస్తరణకు, సోఫియాన్ బైపాస్ రోడ్డు నిర్మాణానికి ప్రధాని శంకుస్థాపన చేశారు. శ్రీనగర్ బిమినియా జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై నిర్మించిన రెండు ఫ్లై ఓవర్లను ప్రారంభించారు. కట్ ఢా మాత వైష్ణవి దేవి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎక్సలెన్స్ కు శంకుస్థాపన చేశారు. కట్‌ఢాలో మొత్తం రూ.46వేల కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులను ఆవిష్కరించారు.
వంతెన మీదుగా వందేభారత్ లో ప్రధాని మోదీ
పహల్గాం ఉగ్రదాడి తర్వాత ప్రధాని జమ్మూకశ్మీర్‌లో పర్యటించడం ఇదే తొలిసారి కావడంతో భారీ స్థాయిలో భద్రతా బలగాలను మోహరించారు. ఉదంపుర్‌లోని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో దిగిన మోదీ.. వంతెన ప్రారంభానికి ముందు దానిని పరిశీలించారు. అలాగే జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో మాట్లాడారు. ఈ సందర్భంగా చినాబ్, అంజీ వంతెనలపై పరుగులు తీసిన వందేభారత్ రైలులో మోదీ ప్రయాణించారు. అనంతరం మోదీ కట్‌ఢాలో బహిరంగ ర్యాలీలో పాల్గొన్నారు.
దేశానికే తలమానికం..కశ్మర్ ప్రగతిలో మైలురాయి
రైలు మార్గం ద్వారా కశ్మీర్‌ను భారత్‌లోని మిగతా ప్రాంతాలతో అనుసంధానించేందుకు చేపట్టిన ఉధంపుర్-శ్రీనగర్-బారాముల్లా రైల్వే ప్రాజెక్టులో చినాబ్ వంతెన ఓ భాగం. 2002లో అటల్ బిహారీ వాజ్‌పేయీ హయాంలో ఈ ప్రాజెక్ట్‌కు రూపకల్పన చేశారు. 23 ఏళ్ల తర్వాత ఇది పూర్తయింది. కరోనా సమయంలో వంతెన నిర్మాణ పనులు కొంతకాలం నిలిచిపోయాయి. 1.31కిలోమీటర్ల పొడవున్న ఈ వంతెన నిర్మాణంలో 28వేల టన్నుల ఉక్కును వాడారు. రూ.1,486కోట్లతో నిర్మించారు. చినాబ్ నదీపై 359 మీటర్ల ఎత్తులో నిర్మించిన ఈ వంతెన పొడవు 1,315 మీటర్లు. చైనాలోని బెయిపాన్ నదిపై ఉన్న షుబాయ్ రైల్వే వంతెన (275 మీటర్లు ఎత్తు) ఇప్పటిదాక అతి ఎతైన వంతెనగా ఉంది. ఈ ప్రపంచ రికార్డును చినాబ్ వంతెన తిరగారాసింది. పారిస్‌లోని ప్రఖ్యాత ఈఫిల్ టవర్‌తో పోలిస్తే చినాబ్ వంతెన ఎత్తు 30 మీటర్లు ఎక్కువ కావడం విశేషం. అతివేగం, భూకంపాలు, వరదలు, బాంబు పేలుళ్లను సైతం తట్టుకునేలా అత్యాధునిక సాంకేతికతతో చినాబ్ వంతెన నిర్మించారు. దీని ప్రారంభంతో జమ్మూ నుంచి శ్రీనగర్‌కు ప్రయాణ సమయం కూడా తగ్గుతుంది. ఈ వంతెన జీవితకాలం దాదాపు 120 ఏళ్లు అని ఇంజినీర్లు అంచనా వేశారు. దీనిపై గరిష్ఠంగా 100కి.మీ. వేగంతో రైలు వెళ్లే అవకాశం ఉంది.