Ramagundam | చల్లారని రామగుండం అసమ్మతి.. ఎవరి దారి వారిదే!

Ramagundam అధిష్టానం చొరవ తీసుకున్నా కానరాని ఐక్యత ఎమ్మెల్యే వర్సెస్ అసమ్మతి విధాత బ్యూరో, కరీంనగర్: పార్టీ కోసం పనిచేసే ఏ ఒక్క నేతను వదులుకునే ప్రసక్తి లేదని, సర్వేల ఆధారంగా గెలుపు గుర్రాలకే టికెట్లు కేటాయిస్తామని, ఎవరు కూడా పార్టీ లైన్ దాటి పనిచేయొద్దని, బీఆరెస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కే తారక రామారావు రామగుండం అసమ్మతి నేతలకు చేసిన హితబోధ ఇది. రామగుండం అసమ్మతి నేతలను హైదరాబాద్ పిలిపించి శాసనసభ లాబీల్లో గంటపాటు భేటీ అయిన […]

  • Publish Date - August 7, 2023 / 12:23 AM IST

Ramagundam

  • అధిష్టానం చొరవ తీసుకున్నా కానరాని ఐక్యత
  • ఎమ్మెల్యే వర్సెస్ అసమ్మతి

విధాత బ్యూరో, కరీంనగర్: పార్టీ కోసం పనిచేసే ఏ ఒక్క నేతను వదులుకునే ప్రసక్తి లేదని, సర్వేల ఆధారంగా గెలుపు గుర్రాలకే టికెట్లు కేటాయిస్తామని, ఎవరు కూడా పార్టీ లైన్ దాటి పనిచేయొద్దని, బీఆరెస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కే తారక రామారావు రామగుండం అసమ్మతి నేతలకు చేసిన హితబోధ ఇది.

రామగుండం అసమ్మతి నేతలను హైదరాబాద్ పిలిపించి శాసనసభ లాబీల్లో గంటపాటు భేటీ అయిన అనంతరం పార్టీ కార్యనిర్వాక అధ్యక్షుడు చేసిన సయోధ్య ప్రయత్నాలు అసమ్మతినేతలకు అంతగా రుచించినట్టు కనిపించడం లేదు. అసమ్మతి నేతలకు అధిష్టానం నుండి పిలుపు రాగానే, రామగుండం రాజకీయాల ఉత్కంఠకు తెరపడుతుందని అంతా భావించారు.

ఈ సమావేశం అనంతరం రామగుండం రాజకీయాలు ఏమలుపు తిరుగుతాయోనని ఆసక్తికర చర్చలు కూడా నడిచాయి. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కు వ్యతిరేకంగా గత కొంతకాలంగా బీఆరెస్ పార్టీ ఆశావాహులు పాలకుర్తి జడ్పీటీసీ కందుల సంధ్యారాణి, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, రామగుండం నగర పాలక సంస్థ తొలి మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ, బసంత్ నగర్ పర్మినెంట్ కార్మిక సంఘం నాయకులు బయ్యపు మనోహర్ రెడ్డి, బీఆరెస్‌ పార్టీ సీనియర్ నాయకులు పాతిపెల్లి ఎల్లయ్యలు కలిసి నియోజకవర్గంలో రాజకీయంగా పావులు కదుపుతున్నారు.

ఈ ఐదుగురు ఆశావాహులు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వవద్దని, ఇస్తే నియోజకవర్గంలో పార్టీ ఓటమి పాలయ్యే అవకాశాలు ఉన్నాయని బాహాటంగానే ప్రచారం చేస్తున్నారు. దీంతోపాటు ఎమ్మెల్యే ఎన్నో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని, ఆయనపై ప్రజల్లో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉందని ఎమ్మెల్యే అభ్యర్థిని మార్చాలని డిమాండ్ చేస్తున్నారు.

అధికార పార్టీలో రామగుండం రాజకీయాలు సంచలనంగా మారడంతో ఆశావహులతో గతంలోనే మంత్రి కొప్పుల ఈశ్వర్ కరీంనగర్ లో సమావేశం అయ్యారు. ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్యేకు టికెట్ ఇవ్వడానికి వీలు లేదని అసమ్మతి నేతలు ఆయన ముందు కూడా కుండబద్దలు కొట్టారు. దీంతో సమస్య పరిష్కార బాధ్యతను మంత్రి అధిష్టానం చేతిలో పెట్టారు.

దీనిపై స్పందించిన పార్టీ అధిష్టానం అసమ్మతినేతలతో సమావేశాన్ని ఏర్పాటు చేసింది. కొన్ని అనివార్య కారణాలతో సమావేశం రద్దు కావడంతో మళ్లీ ఆశవాహులు తమ కార్యాచరణకు పదును పెట్టారు. ఏకంగా ఈనెల 6వ తేదీన గోదావరిఖని మార్కండేయ కాలనీలోని బృందావన్ గార్డెన్ లో ప్రజా ఆశీర్వాద సభ పేరుతో భారీ బహిరంగ సభకు సన్నాహాలు చేశారు.

దీంతో రామగుండం రాజకీయాలు మరోసారి చర్చకు దారి తీసాయి. పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకున్న పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావు హుటాహుటిన అసమ్మతినేతలను హైదరాబాద్ పిలిచి చర్చించినప్పటికీ, నియోజకవర్గ బాధ్యతలు మంత్రి కొప్పుల ఈశ్వర్ కు అప్పగించినప్పటికీ, పరిస్థితిలో మాత్రం మార్పు రాలేదు. ఎమ్మెల్యే చందర్ తనకు కేటీఆర్ ఆశీస్సులు ఉంటాయని గట్టి నమ్మకంతో ఉండగా, అసమ్మతి నేతలు ఇకపై తమ భారాన్ని మంత్రి కొప్పుల ఈశ్వర్ పై వేశారు.

Latest News