విధాత, హైదరాబాద్: సింగరేణి కార్మిక సంఘాల ఎన్నికలు వాయిదా వేయాలని సింగరేణి సంస్థ యాజమాన్యం తెలంగాణ హైకోర్టులో అప్పీల్ దాఖలు చేసింది. తెలంగాణ శాసనసభ ఎన్నికలు పూర్తయ్యే వరకు, సింగరేణి కార్మిక సంఘాల ఎన్నికలు వాయిదా వేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.
అయితే అక్టోబర్‌లో కార్మిక సంఘాల ఎన్నికలు పూర్తిచేయాలని ఇప్పటికే హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. దీన్ని సవాల్ చేస్తూ బుధవారం సింగరేణి సంస్థ యాజమాన్యం అప్పీల్ దాఖలు చేసింది. దీనిపై గురువారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ శ్రవణ్‌కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టింది.
సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును రద్దు చేస్తూ ఎన్నికలు వాయిదా వేయాలని సింగరేణి సంస్థ తరుఫు న్యాయవాదులు పేర్కొన్నారు. దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈనెల 11కు వాయిదా వేసింది.