ప్ర‌గ‌తి భ‌వ‌న్ ప్ర‌జ‌ల‌కే.. ప్ర‌జాదర్బార్ అక్క‌డే

ఎన్నిక‌ల‌కు ముందు పీసీసీ అధ్య‌క్షుడి హోదాలో రేవంత్‌రెడ్డి ప్ర‌గ‌తి భ‌వ‌న్‌ను ప్ర‌జా భ‌వ‌న్‌గా మార్చాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం

  • Publish Date - December 7, 2023 / 03:23 AM IST
  • సొంతిల్లే రేవంత్ అధికార నివాసం
  • సెక్ర‌టేరియ‌ట్ నుంచే పాల‌న‌


విధాత‌, హైద‌రాబాద్‌: ఎన్నిక‌ల‌కు ముందు పీసీసీ అధ్య‌క్షుడి హోదాలో రేవంత్‌రెడ్డి ప్ర‌గ‌తి భ‌వ‌న్‌ను ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తీసుకువ‌స్తాన‌ని ఇచ్చిన హామీ మేర‌కు సీఎంగా పాల‌నా ప‌గ్గాలు చేప‌ట్ట‌గానే ప్ర‌జా భ‌వ‌న్‌గా మార్చాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం. దీనికి అంబేద్క‌ర్ ప్ర‌జా భ‌వ‌న్‌గా పేరుపెట్టే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌జా దర్బార్ నిత్యం ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లోనే జ‌ర‌పాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు స‌మాచారం. సీఎం అధికారిక నివాసంగా బీఆరెస్ అధినేత కేసీఆర్ ముఖ్య‌మంత్రి హోదాలో ముచ్చ‌ట‌ప‌డి క‌ట్టించుకున్నారు.


దీనిపై పెద్దఎత్తున విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. దొర కోట క‌ట్టుకున్నార‌ని, ప్ర‌జ‌ల‌కు మాత్రం డ‌బుల్ బెడ్‌రూమ్ ఇండ్లు క‌ట్టించి ఇవ్వ‌లేద‌ని పెద్దఎత్తున విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. అయితే ఆ విమ‌ర్శ‌ల‌ను ఏమాత్రం ప‌ట్టించుకొని కేసీఆర్ డోంట్ కేర్ అని వ‌దిలేశారు. దీంతో గ‌డిల‌పాల‌న అంతం కావాల‌న్న డిమాండ్‌ను కాంగ్రెస్ చేసింది. తాము అధికారంలోకి రాగానే ప్ర‌గ‌తి భ‌వ‌న్‌ను ప్ర‌జా భ‌వ‌న్ చేస్తామ‌ని ప్ర‌క‌టించిన రేవంత్‌రెడ్డి.. ఈ మేర‌కు ప్ర‌జా దర్బార్ నిత్యం అక్క‌డే నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు విశ్వ‌స‌నీయంగా తెలిసింది.


క‌ట్టుకున్న ఇంట్లోనే నివాసం


రేవంత్‌రెడ్డికి సీఎం హోదాలో ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో నివ‌సించ‌డానికి అవ‌కాశం ఉన్నా అందుకు సిద్ధంగా లేర‌ని స‌మాచారం. తాను క‌ట్టుకున్న ఇంట్లోనే నివాసం ఉండాల‌ని నిర్ణయించుకున్న‌ట్లు తెలుస్తోంది. గ‌డిల పాల‌న‌కు వ్య‌తిరేకంగా తాను పోరాడాన‌ని, ప్ర‌జ‌ల సొమ్ముతో నిర్మించిన ఆ గ‌డిని.. ప్ర‌జ‌ల అవ‌స‌రాల‌కే వినియోగిస్తాన‌ని రేవంత్ త‌న స‌న్నిహితులకు తెలిపిన‌ట్లు స‌మాచారం. ఈ మేర‌కు ఇప్పుడుంటున్న ఇంట్లోనే సీఎంగా ఉంటాన‌ని అన్న‌ట్లు తెలిసింది. దీంతో సొంత ఇల్లే అధికారిక నివాసం కానున్న‌ది.


అయితే ప‌రిపాల‌న అంతా సెక్ర‌టేరియట్ నుంచే నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు స‌మాచారం. కేసీఆర్‌కు స‌చివాల‌యానికి రాని సీఎంగా పేరున్న‌ది. దీంతో కేసీఆర్ తీవ్ర విమ‌ర్శ‌ల‌కు గుర‌య్యారు. ఇలాంటి అప‌వాదు త‌న‌కు రావ‌ద్ద‌ని భావించిన రేవంత్‌రెడ్డి క్ర‌మం త‌ప్ప‌కుండా స‌చివాల‌యానికి వ‌చ్చి పాల‌న కొన‌సాగించాల‌ని, అంద‌రికీ అందుబాటులో ఉండాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు స‌మాచారం. ఈమేర‌కు గురువారం ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం అయిపోయిన త‌రువాత‌ రేవంత్‌రెడ్డి సీఎం హోదాలో మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు సెక్ర‌టేరియ‌ట్‌కు వెళ్లే అవ‌కాశం ఉంది.


అడ్డుకున్న పోలీసులే.. భద్రతతో తీసుకెళ్లనున్నారు


రేవంత్ రెడ్డి ఇప్ప‌టివ‌ర‌కు నూత‌న సెక్ర‌టేరియ‌ట్‌కు వెళ్లలేని ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఔట‌ర్ రింగ్ రోడ్ టోల్ టెండ‌ర్ కాంట్రాక్ట్ అక్ర‌మాల‌పై ప్ర‌భుత్వాన్ని పీసీసీ అధ్య‌క్షుడిగా రేవంత్ రెడ్డి ప్ర‌శ్నించారు. నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా టెండ‌ర్ అగ్రిమెంట్ జ‌రిగింద‌ని ఆరోపించిన రేవంత్ రెడ్డి, దీనిపై పుర‌పాల‌క శాఖ ముఖ్య‌కార్య‌ద‌ర్శి అర‌వింద్‌కుమార్‌ను స‌మాచారం అడ‌గ‌డానికి స‌చివాల‌యానికి వెళితే, పోలీసులు అడ్డుకొని స‌చివాల‌యానికి రానీయ‌లేదు. దీనిపై పెద్ద వివాదం జరిగింది. తాజాగా అదే స‌చివాల‌యంలోకి సీఎం హోదాలో రేవంత్‌రెడ్డిని పోలీసులు భ‌ద్ర‌త‌తో తీసుకువెళ్ల‌నున్నారు.


బారికేడ్ల తొలగింపు


సీఎం అధికార నివాసం ప్రగతి భవన్ ఇక నుంచి ప్రజా దర్బార్ గా మారనుండడంతో అధికారులు ఇప్పటి నుంచే ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఇన్నాళ్లు ప్రగతి భవన్ కు ఎదురుగా, ఇరువైపులా ఉన్న ప్రధానరోడ్లపై సామాన్యులకు ఎలాంటి అనుమతి ఉండేది కాదు. అడుగడుగునా బారికేడ్లు ఏర్పాటు చేసి పోలీసులు భద్రత కల్పించేవారు. ఈ క్రమంలో రోడ్లపై అడుగడుగునా ఉన్న బారికేడ్లను అధికారులు బుధవారం రాత్రి నుంచే తొలగించేస్తున్నారు. సామాన్యులు కూడా ప్రగతి భవన్ కు నేరుగా చేరుకునేలా విస్తృత ఏర్పాట్లలో అధికారులు, పోలీసులు నిమగ్నమయ్యారు.


సచివాలయంలో మీడియాకు ప్రత్యేక గది


తెలంగాణ సచివాలయంలో ఇన్నాళ్లూ మీడియాకు ఉన్న ఆంక్షలు కాంగ్రెస్ కొత్త ప్రభుత్వంలో తొలగిపోనున్నాయి. ముఖ్యమంత్రిగా పాలన పగ్గాలు చేపట్టనున్న రేవంత్ రెడ్డి.. సచివాలయంలో మీడియా ప్రతినిధులకు ప్రత్యేక వసతులతో కూడిన గదిని కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం సచివాలయ భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్ లేదా మొదటి అంతస్తులో ఏర్పాట్లు చేసేందుకు యోచిస్తున్నట్లు సమాచారం. బీఆరెస్ పాలనలో సచివాలయం లోపలికి వెళ్లేందుకు మీడియా పడిన పాట్లు ఇక నుంచి తొలగిపోనున్నాయని భావిస్తున్నారు.


విధాత ePaper కోసం ఇక్కడ క్లిక్ చేయండి