విధాత: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర జోరుగా కొనసాగుతోన్న విషయం తెలిసిందే. రాహుల్ పాదయాత్రకు ప్రతి రాష్ట్రంలో అపూర్వ స్పందన లభిస్తోంది. ఆయన యాత్రకు వేలాది మంది హాజరవుతున్నారు. రాహుల్ అడుగులో అడుగేసి ముందుకు కదులుతున్నారు.
జోరుగా కొనసాగుతున్న జోడో యాత్రపై భారతీయ జనతా పార్టీ నాయకులు తీవ్ర విమర్శలు చేశారు. దీంతో రాహుల్ గాంధీ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. రాహుల్ ఎందుకు యాత్ర చేస్తున్నారో అర్థం కావడం లేదని, పాదయాత్రలతో ఓట్లు రాలవని ఎగతాళిగా బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని విలేకర్లు రాహుల్‌ను ప్రశ్నించారు.
దీనికి రాహుల్ సెటైరికల్ సమాధానం ఇచ్చారు. విద్వేష రాజకీయాలు చేస్తున్న బీజేపీని ఒక మార్కెట్‌గా, ఆ విద్వేష మార్కెట్‌లో ప్రేమను నింపే ఒక దుకాణంగా తన పాదయాత్రను రాహుల్ పోల్చి సమాధానమిచ్చారు. తాను విద్వేష మార్కెట్‌లో ప్రేమను పంచే ఒక దుకాణం తెరిచానని రాహుల్ వ్యాఖ్యానించారు.
ఇక తమిళనాడులోని కన్యాకుమారిలో మొదలైన భారత్ జోడో యాత్ర కర్ణాటక, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ మీదుగా రాజస్థాన్‌కు చేరింది. ప్రస్తుతం రాజస్థాన్‌లో రాహుల్ భారత్ జోడో యాత్ర కొనసాగుతున్నది. కశ్మీర్‌లో ఈ యాత్ర ముగియనుంది.