Rakesh Master: రెండు గోడల మధ్య సమసిపోవల్సిన సమస్యని ఇద్దరు మహిళలు నడిరోడ్డు మీదకు తీసుకు వచ్చారు. పట్టపగలే నడిరోడ్డుపై వీధి రౌడీల్లా కొట్టుకొని వీరంగం సృష్టించారు. ఆ ఇద్దరు మహిళలలో ఒక మహిళ దివంగత కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ భార్య లక్ష్మీ. వీరిద్దరు మూడేళ్ల పాటు సహజీవనం చేశారు. ఆ తర్వాత రాకేష్ మాస్టర్ నుండి లక్ష్మీ విడిపోయి విడిగా ఉంటుంది. ఆమెపై ఓ ఐదుగురు మహిళలు పంజాగుట్ట ఏరియాలో దాడిచేశారు. స్నేహితుడితో కలిసి స్కూటీపై వెళ్తున్న సమయంలో లక్ష్మీని అడ్డగించిన లల్లి అండ్ గ్యాంగ్ దారుణంగా కొట్టారు. జుట్టు పట్టుకుని దొర్లించి మరీ చితక్కొట్టినట్టు తెలుస్తుంది. అయితే ఆమె తీవ్ర గాయాలతో పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో పోలీసులకి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది.
లక్ష్మిపై దాడి చేసిన మహిళల్లో ఒకరైన లల్లి తన యూట్యూబ్ ఛానల్ ద్వారా దాడి చేయడానికి గల కారణం వివరించింది. తన మైనర్ కూతురి మీద లక్ష్మీ దారుణమైన కామెంట్స్ చేసిందని, ఆ కారణంగా తను స్కూల్‌కి కూడా వెళ్లడం మానేసిందని లల్లి అంటుంది. ఈ క్రమంలోనే లక్ష్మీపై దాడి చేసామని, ఆమె యూట్యూబ్ వదిలిపోవాలని మేము దాడి చేయలేదంటూ లల్లి స్పష్టం చేసింది. కొద్ది రోజులుగా వీరిద్దరి మధ్య వివాదం నడుస్తుండగా, ఇప్పుడు దాడుల వరకు వెళ్లింది. లక్ష్మీ మాట్లాడుతూ..తనని చంపేస్తామని బెదిరిస్తున్నారని, తనపై పెరుగు పెద్దమ్మ, దుర్గ, లల్లీ, నెల్లూరుకు చెందిన భారతి, మరో మహిళ దాడి చేశారని లక్ష్మీ ఆరోపించింది.
కాగా, రాకేష్ మాస్టర్ దగ్గరకు వంట చేయడానికి వచ్చిన లక్ష్మిని ఆయన తన భార్యగా పరిచయం చేయగా, కొన్నాళ్లపాటు ఆయనతో సంతోషంగానే జీవించింది లక్ష్మీ. అయితే రాకేష్ మాస్టర్ యూట్యూబ్ ఛానెల్ లక్ష్మీ లాగేసుకుందని కొందరు చెప్పుకొస్తున్నారు. ఆ యూట్యూబ్ ఛానెల్ కోసం ఆయన కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నారని..వారికి లల్లీ తన వంతు సహకరిస్తున్నారని సమాచారం. ఈ క్రమంలోనే లల్లీకి, లక్ష్మికి మధ్య కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్నాయని అంటున్నారు. మరి ఈ వివాదంపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.